మరో మారటోరియం కావాలంటున్న బ్యాంకులు

మరో మారటోరియం కావాలంటున్న బ్యాంకులు
  • కొన్ని లోన్లకు అయినా చాన్సివ్వాలి
  • ప్రభుత్వానికి ప్రైవేటు బ్యాంకర్ల రిక్వెస్ట్‌

న్యూఢిల్లీ: కొన్ని ఎంపిక చేసిన కేసులలో మారటోరియంకు తమను అనుమతిస్తే మేలని దేశంలోని ప్రైవేట్​ బ్యాంకులు కోరుకుంటున్నాయి. కొన్ని అప్పుల విషయంలో రీస్ట్రక్చరింగ్​కు అవకాశమివ్వాలని కూడా అవి భావిస్తున్నాయి. రిజర్వ్​ బ్యాంక్​ గవర్నర్​ శక్తికాంత దాస్​తో జరిగిన మీటింగ్​లో ప్రైవేట్​ బ్యాంకుల చీఫ్స్​ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏప్రిల్​–జూన్​ 2021 మధ్య కాలానికి వర్తించేలా ఈ మారటోరియం ఉండాలని ప్రైవేటు బ్యాంకులు భావిస్తున్నాయి. దీనివల్ల, సెకండ్​వేవ్​ దెబ్బకు ఏప్రిల్​ నుంచి చెల్లింపులు జరపని అకౌంట్లు జూన్​ నెలాఖరుకు మొండిబాకీలు (ఎన్​పీఏలు) కాకుండా ఉంటాయని వారు చెబుతున్నారు. వన్​ టైమ్​ సెటిల్​మెంట్​ స్కీము కింద ఈ అకౌంట్లలో చాలా వాటికి వెసులుబాటు కలగనుందని, కానీ దానికి ఆగస్టు–సెప్టెంబర్​ దాకా టైముందని బ్యాంకర్లు చెబుతున్నారు. అందుకే, ఇప్పుడు మారటోరియం ప్రకటించడం మేలని అంటున్నారు. మే 5 నాడు ప్రకటించిన రిలీఫ్​ స్కీము అమలు ఎలా ఉందో మంగళవారం నాటి మీటింగ్​లో గవర్నర్​ రివ్యూ చేసినట్లు ఆర్​బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. సెకండ్​వేవ్​తో ఇబ్బందులెదుర్కొంటున్న వారికి అప్పులు అందించాలని గవర్నర్​ ఈ మీటింగ్​లో ప్రైవేటు బ్యాంకులను కోరినట్లు పేర్కొంది.  ఏవియేషన్​, హోటల్స్​, హాస్పిటాలిటీ, రెస్టారెంట్లు వంటి అకౌంట్లకు వన్​ టైమ్​ రీస్ట్రక్చరింగ్​ అవకాశం కల్పించేలా తమను అనుమతించాలని కూడా ప్రైవేటు బ్యాంకులు కోరుతున్నాయి. అయితే మే 5 నాటి ఆర్​బీఐ ఆదేశాల ప్రకారం రిటెయిల్​, స్మాల్​ బిజినెస్​ బారోవర్లకు మాత్రమే ఆ వెసులుబాటు ప్రకటించారు. ఇలా వన్​ టైమ్​ రీస్ట్రక్చరింగ్​ అమలు వల్ల ఆ అకౌంట్లు ఎన్​పీఏలుగా మారకపోవడంతోపాటు, పేమెంట్లు జరపడానికి రెండు నుంచి మూడేళ్ల అదనపు టైము దొరుకుతుందని ప్రైవేటు బ్యాంకర్లు చెబుతున్నారు.గత ఏడాది మారటోరియంను ఎక్కువగా ఇండివిడ్యువల్సే వాడుకున్నారు. తమ రేటింగ్​పై నెగటివ్​ ఎఫెక్ట్​ పడుతుందనే ఆలోచనతో పెద్ద కార్పొరేట్లు ఆ మారిటోరియం ఉపయోగించుకోలేదని బ్యాంకింగ్​ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

చిన్న బిజినెస్​లపై ఆర్​బీఐ సర్వే

  • సెకండ్​ వేవ్​ ఎఫెక్ట్​ తెలుసుకోడానికే

రిటెయిల్ స్టోర్లు​, రెస్టారెంట్లు, మాల్స్​, హాస్పిటాలిటీ రంగాలలోని స్మాల్​, మీడియం బిజినెస్​లపై సెకండ్​ వేవ్​ ఎఫెక్ట్​ ఎలా ఉందో ఆర్​బీఐ తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ఒక సర్వే నిర్వహిస్తోంది. ఆయా రంగాలలోని కంపెనీలతో ఆన్​లైన్​ మీటింగ్​లు చేపట్టాల్సిందిగా బ్యాంకులను ఆర్​బీఐ ఆదేశించింది. సెకండ్​ వేవ్​ ఎఫెక్ట్​ ఏ రంగాలపై ఎక్కువగా పడిందో తెలుసుకోవాలని ఆర్​బీఐ కోరుకుంటోందని ఒక బ్యాంకరు చెప్పారు. మొదటి దఫా మారటోరియం తీసుకున్న వారే ఇప్పుడు కూడా ట్రబుల్స్​లో ఉన్నారని ఆ బ్యాంకరు వెల్లడించారు. అయితే, ఈ చొరవపై వివరాలు వెల్లడించడానికి ఆర్​బీఐ ప్రతినిధి ముందుకు రాలేదు. తన బ్యాంకరు, ఆర్​బీఐతో జూమ్​ కాల్​లో పాల్గొన్నట్లు ఒక రిటెయిలర్​ వెల్లడించారు. సెకండ్​ వేవ్​ ఎఫెక్ట్​ ఏ మేరకు ఉందనేది నేరుగా తెలుసుకోవాలనేది ఆర్​బీఐ ఆలోచనగా ఆ రిటెయిలర్​ పేర్కొన్నారు. కొత్త రిలీఫ్​ ప్యాకేజ్​ తయారీ లేదా అదనంగా అప్పులివ్వడం అనే రెండు అంశాల కోసం ఆర్​బీఐ బహుశా ఈ సర్వే చేపట్టి ఉండొచ్చని ఎక్స్​పర్టులు అంటున్నారు. దేశవ్యాప్తంగా 80 శాతం స్టోర్లు మూతపడ్డాయని రిటెయిలర్స్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా (ఆర్​ఏఐ) చెబుతోంది. రిటెయిల్​ రంగంలో పెట్టుబడులు రూ. 2.5 లక్షల కోట్ల దాకా ఉంటాయని, ఇందులో రూ. 75 వేల దకోట్ల దాకా అప్పులుండొచ్చని, అవి ఎన్​పీఏలుగా మారే ప్రమాదం ఉందని పేర్కొంది. నేషనల్​ రెస్టారెంట్స్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా కూడా కిందటి వారంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకుర్​కు ఇదే విషయం వెల్లడించినట్లు చెబుతున్నారు. తమను ఆదుకోవల్సిందిగా ఈ సందర్భంగా మంత్రిని కోరారని పేర్కొంటున్నారు. మొదటిసారి ఇచ్చిన 20 శాతం టాప్​ అప్​ లోన్​ ఇప్పటికే వాడేసుకున్నామని, తాజాగా సెకండ్​వేవ్​తో లిక్విడిటీ సమస్యలు ఎదుర్కొంటున్నామని ఈ రంగం ప్రతినిధులు చెబుతున్నారు. అదనంగా లిక్విడిటీ కోసం ఠాకూర్​ను రిక్వెస్ట్​ చేసినట్లు వారు వెల్లడించారు.