- పగిడిద్ద రాజును పాదయాత్రగా మేళతాళాలతో తీసుకెళ్లనున్న అరెం వంశస్థులు
- ఈ నెల 26న బర్లగుట్ట నుంచి పాదయాత్ర ప్రారంభం..
- మార్చి మొదటి వారంలో నాగవెళ్లి జాతర
భద్రాద్రికొత్తగూడెం/గుండాల, వెలుగు : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగైన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ముహూర్తం సమీపిస్తున్న వేళ, సమ్మక్క భర్త పగిడిద్ద రాజు మేడారానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం బర్లగుట్టలో కొలువైన పగిడిద్ద రాజు మేడారానికి చేరుకున్న తర్వాతే జాతర ఘట్టం మొదలవుతుంది. ఈ సంప్రదాయాన్ని అనుసరించి, ఈ నెల 26న అరెం వంశీయులు పగిడిద్ద రాజును జెండాల రూపంలో మేళతాళాల మధ్య పాదయాత్రగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారానికి తీసుకెళ్లనున్నారు. అంతకుముందు యాపలగడ్డలోని పాత గుడి వద్ద గంగా స్నానం, ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతారం మీదుగా యాత్ర కొనసాగిస్తారు.
28న మేడారం చేరుకోగానే సమ్మక్క పూజారులు ఎదుర్కోళ్లు నిర్వహించి, పగిడిద్ద రాజు గద్దెపై జెండాలను ప్రతిష్ఠిస్తారు. మేడారం జాతర అనంతరం మార్చి మొదటి వారంలో బర్లగుట్టలో 'నాగవెళ్లి' జాతరను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
బర్లగుట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి
సమ్మక్క-సారలమ్మ జాతరలో కీలక పాత్ర పోషించే పగిడిద్ద రాజు కొలువైన బర్లగుట్ట ప్రాంత అభివృద్ధిని ప్రభుత్వం విస్మరించడంపై భక్తులు, పూజారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతంపై దృష్టి సారించాలని తలపతి అరెం కాంతారావు కోరారు. ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక నేతలు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, ఈ చారిత్రక ప్రాంతం అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమని ఆయన వాపోయారు.
ఇప్పటికైనా కలెక్టర్, ఐటీడీఏ అధికారులు బర్లగుట్టను సందర్శించి, పగిడిద్ద రాజు జాతరకు ప్రత్యేక నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాలని అరెం వంశీయులు డిమాండ్ చేస్తున్నారు.
