బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలు యధాతథం

బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలు యధాతథం
  • నోటీసులిచ్చి చేతులు దులిపేసుకుంటున్న అధికారులు

నిర్మల్ జిల్లా: బాసర ట్రిపుల్ ఐటీ లో సమస్యలు మళ్లీ మొదటికి వచ్చినట్లే కనిపిస్తోంది. ఆహారంలో నాణ్యత లేదని ఫిర్యాదులు చేస్తే అధికారులు నోటీసులిచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా క్యాంటీన్లపై ఎనలేని ప్రేమ చూపిస్తోంది. గడువు ముగిసినా మూడు క్యాటరింగ్ సంస్థలను ప్రభుత్వం యధావిధిగా కొనసాగించడం విమర్శలకు తావిస్తోంది. తరుచూ ఫుడ్ పాయిజన్, భోజనంలో నాణ్యత లేకపోవడం, ఆహారంలో కప్పలు, పురుగులు లాంటివి వచ్చాయని ఎన్ని ఆరోపణలు చేసినా అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. 

నాణ్యమైన భోజనంపై నెరవేరని హామీలు

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేసినా...  రాష్ట్ర గవర్నర్-మంత్రులు సందర్శించినా మెస్ ల తీరు మారడం లేదు. మంత్రి కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి లు పర్యటించి విద్యార్థులకు నాణ్యమైన భోజనంపై ఇచ్చిన హామీలు సైతం ఎంతకు నెరవేరడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. చాలాసార్లు ఫుడ్ పాయిజన్ అయినా కూడా మెస్ ల యాజమాన్యాలను వెనుకేసుకొస్తున్నట్టు కనిపిస్తోంది.

ఈ క్యాంటీన్ల నిర్వహన వెనుక అధికార పార్టీ అగ్రనేతలు ఉండటంతోనే కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది భోజనం చాలాసార్లు వికటించి వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మార్చి 7న భోజనంలో కప్ప దర్శమిచ్చిన ఘటన కలకలం రేపింది. అది జరిగిన నాలుగు రోజులకే మార్చి 11న ఆహారంలో పురుగులు కనిపించాయి. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేసి నివేదికను కూడా అందించారు.

ఆ తర్వాత కూడా జూలై 15న ఫుడ్ పాయిజన్ తో 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. ఆగస్టు 4న 100 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ కావడంతో ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. ఇక  ఈ మధ్యనే మొన్న నవంబర్ 30న 80 మంది పిల్లలు వాంతులు విరేచనాలతో మళ్లీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ఇలా తరుచూ క్యాంటీన్ లో భోజనం వికటిస్తున్నా.. అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారే తప్ప నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు. 

ట్రిపుల్ ఐటీలో మొత్తం 8 వేల 500 మంది విద్యార్థులు ఉన్నారు. వారందరికి భోజనం పెట్టడానికి మూడు మెస్ లతో పాటు ఓ ప్రైవేట్ క్యాంటీన్ కూడా ఉంది. ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి వంద రూపాయలకు పైగా భోజనానికి ఖర్చు చేస్తోంది.  రోజుకు స్టూడెంట్స్  భోజనాలపై 10 లక్షల వరకు ఖర్చు అవుతోంది. విద్యార్థుల భోజనాలకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుచేసినా నాణ్యమైన భోజనం అందించలేకపోతున్నారు.

ప్రతి సంవత్సరం ట్రిపుల్ ఐటీ మెస్ ల వ్యవహరం వివాదాస్పదం అవుతూనే ఉంది. అయినా మెస్ ల తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. గత జూన్ నెల 14 నుంచి 20 వరకు తమ డిమాండ్లు పరిష్కారం కోసం డే అండ్ నైట్ నిరసన చేశారు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు. వర్షంలోనూ ఆందోళన చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి 20 న అర్ధరాత్రి వరకు విద్యార్థి సంఘం నేతలతో చర్చలు జరిపి దీక్షలు విరమింప చేసేలా చర్యలు తీసుకున్నారు. 45 రోజుల్లో అన్ని సమస్యలు తీరుస్తామన్న మంత్రి హామీలతో ఆనాడు విద్యార్థులు ఆందోళనలు విడిచిపెట్టి.. క్లాసుల బాట పట్టారు. 

మంత్రి కేటీఆర్ సెప్టెంబర్ 26న ట్రిపుల్ ఐటీలో పర్యటించారు. విద్యార్థులతో కలిసి భోజనం కూడా చేశారు. అయితే మంత్రులు వచ్చినందుకే మంచి భోజనం పెట్టారని, ఈ క్యాంటీన్లను మార్చి నాణ్యమైన భోజనం పెట్టాలని విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా... త్వరలోనే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి వెళ్లిపోయారు. నవంబర్ లోగా క్యాంటీన్ల మార్పుతో పాటు కొత్త ల్యాప్ టాప్ లు తీసుకొచ్చి తానే స్వయంగా విద్యార్థులకు అందిస్తానని మంత్రి కేటిఆర్ ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. 

రాష్ట్ర గవర్నర్ సైతం ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకొని భోజనంపై విమర్శలు చేశారు. కుళ్లిన కూరగాయలు, గుడ్లు, నాసిరకమైన ఆహార పదార్థాలు వాడటమే కాకుండా మూడు క్యాంటీన్లలో ఎక్కడా శుభ్రత పాటించడం లేదన్న ఆరోపణలు చేశారు.   ట్రిపుల్ ఐటీ మెస్ ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చలకు దారి తీసినా రాష్ట్ర ప్రభుత్వం, అక్కడి సిబ్బంది తీరు మాత్రం మారడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు, విధ్యార్థి సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనుంచి అయినా సమస్యలు పరిష్కరించి నాణ్యమైన భోజనం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.