అన్ని విభాగాల అధికారులతో ఇంచార్జీ వీసీ సమావేశం

అన్ని విభాగాల అధికారులతో ఇంచార్జీ వీసీ సమావేశం

నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో వివాదాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు అన్ని విభాగాల అధికారులతో ఇంచార్జి వీసీ వెంకటరమణ సమావేశం నిర్వహించారు. ఆగస్టు 6వ తేదీన 9 ఆరోగ్య బీమా కంపెనీలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అంతేగాకుండా విద్యార్థుల కోసం వివిధ క్లబ్ లు (నేచర్, మ్యూజిక్, డాన్స్, సైన్స్ క్లబ్) ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 2వ వారంలో 2022-2023 సంబంధించిన ప్రవేశాల జాబితాలను విడుదల చేయాలని ఇంచార్జి వీసీ వెంకటరమణ నిర్ణయించారు. 

ట్రిపుల్ ఐటీ కళాశాలలో మౌలిక సదుపాయాలు, కనీస సౌకర్యాలు కల్పించాలని ఇటీవలే పెద్ద ఎత్తున విద్యార్థుల ఆందోళనలు నిర్వహించారు. ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అనంతరం ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంది. ఇంచార్జి వీసీగా వెంకటరమణను నియమించారు. ఆయన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశాలు జరిపారు. కొన్ని ఆంక్షలు విధించడం వివాదాస్పదమయ్యాయి. తాజాగా.. ఆరోగ్య బీమా పేరిట విద్యార్థుల నుంచి దోపిడీకి తెరదీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏడాది ప్రవేశాల సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి రూ. 700 వసూలు చేశారని, పీయూసీ -2 విద్యార్థి మృతితో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఇంచార్జి వీసీ వెంకటరమణ సీరియస్ అయ్యారు. విద్యార్థుల నుంచి వసూలు చేసి ప్రీమియం చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. తాజాగా ఇంచార్జీ వీసీ తీసుకున్న నిర్ణయాలపై విద్యార్థుల నుంచి ఎలాంటి స్పందన వ్యక్తం అవుతుందో చూడాలి.