సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడు

సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడు

మనుషులందరూ ఒక్కటేనని, స్త్రీ పురుష భేదం లేదని, శ్రమను మించిన సౌందర్యం లేదని, భక్తి కన్నా సత్ప్రవర్తనే ముఖ్యమని వీరశైవ సంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడు. ఈయనను బసవన్న, బసవుడు, విశ్వగురు అని పిలుస్తారు. అప్పటికే వేళ్లూనుకున్న కుల వ్యవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను వ్యతిరేకించిన అభ్యుదయ వాది ఆయన. బసవేశ్వరుడి బోధనలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకం.

జ్ఞానమే గురువు.. దేహమే దేవాలయం, పనిని మించిన దైవం లేదు. కష్టాన్ని మించిన భక్తి లేదంటూ.. చేసే పనిలో దేవుడిని చూసే మార్గాన్ని చూపించి కాయకమే కైలాసం అనే కొత్త ఒరవడికి నాంది పలికారు బసవేశ్వరుడు. లింగాయత్ ధర్మం ఓ విప్లవాత్మకమైన మత రూపం. సమాజంలో ఆనాడు ధర్మం పేరిట జరుగుతున్న దురాచారాలను చూసి ఆయన చలించారు. అవన్నీ స్వార్థపరుల సృష్టి అంటూ సాంఘిక విప్లవానికి తెర తీశారు. నేటి మన పార్లమెంటరీ వ్యవస్థతో సమానమైన అనుభవ మంటపాన్ని బసవేశ్వరుడు ఆనాడే స్థాపించారు. జాతి, కుల, వర్గ, వర్ణ భేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు దక్కాలని ఆయన ఆకాంక్షించారు. బూజుపట్టిన మూఢాచారాలకు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసిన మొదటి సంఘ సేవకుడు బసవేశ్వరుడు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలన్న అపూర్వ ప్రగతిశీలి ఆయన. మొట్టమొదటి కులాంతర వివాహం చేసిన ఘనత కూడా ఆయనదే. బసవేశ్వరుడు కర్నాటకలోని హింగులేశ్వర బాగేవాడి అగ్రహారంలో 1134వ సంవత్సరం వైశాఖ శుద్ధతదియ(అక్షయ తృతీయ) రోజున మండెన మాదిరాజు, మాతాంబిక దంపతులకు జన్మించారు. ఉపనయనం చేయ నిశ్చయించిన తల్లిదండ్రులను వదలి కూడలసంగమ అనే పుణ్యక్షేత్రం చేరిన బసవుడు అక్కడ సంగమేశ్వరుడిని నిష్టతో ధ్యానించాడు. 12వ శతాబ్దంలో కర్నాటకను పాలించిన బిజ్జలుని కొలువులో చిన్న ఉద్యోగిగా చేరి, ఆయన భాండాగారానికి ప్రధాన అధికారి అయ్యారు. అలా భండారీ బసవడిగా ఖ్యాతినొందాడు. సామాజిక అసమానతలను చూసి చలించి అక్కడ బాధ్యతలను వదిలారు.  స్త్రీ, పురుష అసమానతలు, బాల్య వివాహాలు, సతీసహగమనం వంటి సాంఘిక దురాచారాలను ఆయన వ్యతిరేకించారు. సర్వసమానత్వమే శాంతికి మూలమని పేర్కొన్నారు. 

లింగాయత ధర్మం

బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే తర్వాతి కాలంలో ‘లింగాయత ధర్మం’గా స్థిరపడింది. వైదిక కర్మలంటే చిన్నతనం నుంచీ బసవేశ్వరుడికి పడేదికాదు. ఉపనయనం చేయాలని తండ్రి ప్రయత్నిస్తే బసవేశ్వరుడు ఇంటి నుంచి పారిపోయాడు.శివుడే సర్వేశ్వరుడు, శివుడిని మించిన దేవుడు లేడన్న విశ్వాసంతో ఆయన శివతత్వ ప్రచారానికి పూనుకున్నారు. అలా వీరశైవ మతానికి బీజాలు వేశారు. వ్యక్తుల జీవితాలను, సమాజ గమనాన్ని ప్రభావితం చేసేలా బసవేశ్వరుడు ఈ కొత్త ధర్మాన్ని సృష్టించారు. జాతి, వర్గ భేదం లేకుండా అందరూ దీక్షా సంస్కారం పొందడమే లింగాయత ధర్మం ముఖ్య ఉద్దేశం. ఆరోజుల్లో స్త్రీలకు, పంచములకు ధార్మిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులు ఉండేవి కావు. వెనుకబడిన కులాలకు ఆలయ ప్రవేశం లేకుండేది. వారిని పశువులతో సమానంగా చూసేవారు. ఆ సమయంలో మహాత్మ బసవేశ్వరుడు వాటిని రూపుమాపే ప్రయత్నం చేశారు. దేవుడినే భక్తుడి వద్దకు తీసుకు రావడానికి ఇష్టలింగమును కనిపెట్టారు. శివుడికి ప్రతిరూపమైన ఇష్ట లింగాన్ని భక్తుల చేతికిచ్చి వివక్ష గుడి సంస్కృతి, కుల వ్యవస్థపై పోరాటం చేశారు. 
                       
చరిత్రను పాఠ్యాంశాల్లో..

ప్రస్తుతం మనం ఆచరించే యోగాను ఆయన ఆనాడే తన ఇష్టలింగ పూజలో పేర్కొన్నారు. మాంసాహారాన్ని వదిలి శాకాహారాన్ని స్వీకరించడం, ఇష్టలింగ పూజ తదితరాలు బసవేశ్వరుడు సూచించిన భక్తి మార్గాల్లో ముఖ్యమైనవి. నరబలి, పశుబలి, యజ్ఞయాగాలు అర్థం లేని పూజలను నిరోధించి అనంతమైన, అతీతమైన సహజ శివ యోగమును ఆయన ప్రతిపాదించారు. కాయమే కైలాసమని చాటి శ్రమ జీవనానికి గౌరవస్థానం కల్పించిన బసవేశ్వరుడిని నందీశ్వరుడి అవతారంగా భావిస్తారు. బసవేశ్వరుడి జీవిత చరిత్రను గ్రంథస్తం చేసిన తొలి వ్యక్తి తెలుగువాడైన భీమకవి. ఆయన రచనల ఆధారంగా మిగతా కవులు బసవేశ్వరుడి జీవితాన్ని పురాణాలుగా రాశారు. ఆయన ప్రభావంతోనే పాల్కురికి సోమనాథుడు పలు విశేష రచనలు చేశారు. తెలుగులో మొట్టమొదటి దేశీ పురాణం బసవ పురాణమే. అలాగే మొదటి శతకం వృషాధిప శతకం. ఈ రెండు సోమనాథుడు రచించినవే. సోమనాథుడు బసవేశ్వరుడిని రెండో శంకరుడు అంటూ కొనియాడారు. బసవేశ్వరుని దివ్య జీవితగాధను తెలుపుతూ సోమనాథుడు రచించిన 'బసవ పురాణం' తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం 2015 నుంచి బసవేశ్వరుడి జయంతిని ఏటా అధికారికంగా నిర్వహిస్తోంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ట్యాంక్  బండ్ పై బసవేశ్వరుడి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసింది. సమానత్వం, సామాజిక మార్పు కోసం కృషి చేసిన బసవేశ్వరుడి చరిత్రను పాఠ్యాంశంలో చేర్చి నేటి పౌరులకు అందజేయాల్సిన అవసరం ఉంది.
-  నూలి శుభప్రద్ పటేల్రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు