రూ.కోటి విలువైన 26 బంగారు బిస్కెట్లు సీజ్

రూ.కోటి విలువైన 26 బంగారు బిస్కెట్లు సీజ్

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని కస్టమ్స్ ఇంటలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. షార్జా నుంచి ఇండిగో 6E 1406 విమానంలో ఈ ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగాడు ఓ ప్యాసింజర్. హైదరాబాద్ కు వెళ్తున్న ఆ అనుమానిత ప్యాసింజర్ ను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ప్రయాణికుడి వద్ద 26 బంగారు బిస్కెట్లను గుర్తించారు.

పాస్ పోర్ట్ నెంబర్ టి 1129867 ఉన్న షేక్ అబ్దుల్ సాజిద్ అనే ప్రయాణికుడు.. 26 బంగారు కడ్డీలను అక్రమంగా తరలిస్తున్నాడు. 2,992 గ్రాములు అంటే 8 గ్రాములు తక్కువ 3 కేజీల బంగారాన్ని దొంగతనంగా రవాణా చేస్తూ దొరికిపోయాడు. ఈ బంగారు కడ్డీల విలువ బహిరంగ మార్కెట్లో రూ.1కోటి 11 లక్షల 60వేల 160 ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు.

ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని అతడిపై ఎయిర్ కస్టమ్స్ యాక్ట్.. ఎయిర్ సీ యు ఎస్/49/ఎడి జి ఎన్/102/2019-ఏ ఐ యు-బి కింద కేసు పెట్టారు.