సికింద్రాబాద్, వెలుగు: బిర్యానీ తయారీకి ఉపయోగించే బాస్మతి రైస్ కూడా కల్తీ అవుతున్నాయి. లాభాల కోసం కొందరు వ్యాపారులు నాణ్యమైన బాస్మతి రైస్‌లో లోకల్‌గా దొరికే పొడవైన బియ్యాన్ని కలిపి అమ్ముతున్నారని హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్(సీడీఎఫ్‌డీ) సైంటిస్టులు గుర్తించారు. 2021–22 మధ్యకాలంలో బాస్మతి రైస్ నాణ్యతా ప్రమాణాలపై సీడీఎఫ్‌డీ సైంటిస్టుల టీమ్ స్టడీ చేసింది.
బాస్మతి బియ్యం నిర్దేశిత నాణ్యతా ప్రమాణాల్లో ఉంటున్నాయా లేదా అనేది గుర్తించడానికి దేశ, విదేశాలకు చెందిన 495 నమూనాలను సేకరించి టెస్టులు చేశారు. వీటిలో 50 శాతానికిపైగా నాణ్యమైన రకానికి చెందినవి కాదని సైంటిస్టులు నిర్ధారించారు. ఈ కల్తీ 15 శాతం వరకు ఉంటుందని, బాస్మతి రైస్ కల్తీ వల్ల వాటి సహజసిద్ధమైన సువాసన, ఔషధ గుణాలు తగ్గిపోన్నాయని తేల్చారు.
ప్రమాణాలను పట్టించుకుంటలె
విత్తన చట్టం 1966 ప్రకారం.. నాణ్యమైన బాస్మతి బియ్యపు గింజ వండటానికి ముందు 6.6 మిల్లీమీటర్ల పొడవు, 2 మిల్లీమీటర్ల మందం కలిగి ఉండాలని, అలాగే వండిన తర్వాత దాని పొడవు 12 మిల్లీమీటర్లు ఉండాలి. అయితే విత్తన చట్టం సూచించిన పరిమితుల్లో ప్రస్తుతం వాడుతున్న బాస్మతి రైస్ లేదని సైంటిస్టులు తేల్చారు. నిబంధనల ప్రకారం బియ్యం నాణ్యత లేదని, వ్యాపారులు లాభాల కోసం నాణ్యమైన బాస్మతి రైస్‌లో లోకల్‌గా దొరికే పొడుగు బియ్యాన్ని కలిపి కల్తీ చేస్తున్నారని గుర్తించారు. సాధారణ బియ్యాన్ని కూడా బాస్మతిలా నమ్మించడానికి గడ్డి నుంచి సువాసన సారం తీసి బాస్మతి కాని బియ్యంపై పిచికారీ చేసి అమ్ముతున్నారని చెబుతున్నారు.
ఇలా కల్తీ చేసిన రైస్సువాసన కలిగి ఉండటంతో కల్తీ జరిగినట్లు గుర్తించలేరని అంటున్నారు. బాస్మతి బియ్యం నాణ్యతకు సంబంధించి సీడీఎఫ్‌డీ వంటి సంస్థలు, ఇతర ఏజెన్సీలు ధ్రువీకరణ పత్రం జారీ చేస్తాయి. ఇలా చేసిన బియ్యాన్నే దేశీయ మార్కెట్లో సరఫరా చేస్తారు. అయితే నాణ్యత సర్టిఫికెట్ ఉన్న బాస్మతి రైస్‌లో లోకల్ మార్కెట్లో దొరికే బాస్మతిని పోలిన బియ్యాన్ని కలిపి కల్తీ చేస్తున్నారు.
పూసా బాస్మతి 1121 రకం బాస్మతి బియ్యాన్ని.. సుగంధ 2, సుగంధ 3 రకాలతో కల్తీ చేస్తున్నారని, పూసా బాస్మతి 1 బియ్యాన్ని షర్బతి రకంతో కల్తీ చేస్తున్నారని మీరట్‌లోని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎక్స్‌పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన బాస్మతి ఎక్స్‌పోర్ట్స్ డెవలప్మెంట్ ఫౌండేషన్ లేబొరేటరీ సైంటిస్టులు నిర్ధారించారు. కాగా, సింగిల్ న్యూక్లియోటైడ్ పాలి మార్ఫిజం(ఎస్ఎన్పీ) పద్ధతిని ఉపయోగించి బాస్మతి బియ్యం కల్తీని సులభంగా గుర్తించవచ్చని సైంటిస్టులు చెపుతున్నారు.
