క్లారిటీ లేకుండానే బాసర ట్రిపుల్ఐటీ నోటిఫికేషన్ విడుదల

క్లారిటీ లేకుండానే బాసర ట్రిపుల్ఐటీ నోటిఫికేషన్ విడుదల
  • నిరుడు 500 సీట్లకు కోత.. ఈసారి ఆర్జీయూకేటీ సీట్లెన్ని?
  • కరోనాతో నిరుడు 1500 నుంచి వెయ్యి సీట్లకు తగ్గించిన సర్కారు
  • ఈసారి సీట్లపై ప్రభుత్వానికి లేఖ రాసిన ఆర్జీయూకేటీ 
  • తగ్గించొద్దంటున్న స్టూడెంట్లు, పేరెంట్స్ 

హైదరాబాద్, వెలుగు: బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్​ నాలెడ్జ్​టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ)లో సీట్ల భర్తీపై మళ్లీ గందరగోళం నెలకొంది. ఆదివారం ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వర్సిటీ.. ఎన్ని సీట్లు అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. మరోపక్క15% ఏపీ సీట్ల కోటాపైనా స్పష్టత లేదు. కరోనా కారణంగా నిరుడు 1,500 సీట్లలో 500 సీట్లకు కోతపెట్టిన సర్కారు.. ఈ ఏడాది కూడా అదేబాటలో నడవాలని యోచిస్తోంది. దీంతో స్టూడెంట్స్, పేరెంట్ల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామీణ, పేద స్టూడెంట్స్‌‌కు క్వాలిటీ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ అందించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్జీయూకేటీ(బాసర ట్రిపుల్ఐటీ)ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి టెన్త్ క్లాస్ మార్కుల ఆధారంగానే వర్సిటీలోని ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో అడ్మిషన్లు ఇస్తున్నారు. వర్సిటీ ప్రారంభంలో ఏటా 2 వేల మందికి అడ్మిషన్లు ఇచ్చారు. నిధుల కొరత, నిర్వహణ భారంతో ఆ  సీట్లను వెయ్యికి కుదించారు. అయితే పేరెంట్స్ ​నుంచి ఒత్తిడి రావడంతో మూడేండ్ల కింద మళ్లీ సీట్లను1,500కు పెంచారు. కరోనా సాకుతో గత ఏడాది వెయ్యికి తగ్గించారు. దీంతో 500 మంది పేద స్టూడెంట్స్ అడ్మిషన్లు కోల్పోయినట్లయింది. 

సీట్లపై నో క్లారిటీ..
టెన్త్ రిజల్ట్ వచ్చి 2 నెలలు దాటింది. పాలిసెట్ రిజల్ట్ కూడా ఆరు రోజుల కిందే వచ్చాయి. రెండు రోజుల కింద అడ్మిషన్స్​కు నోటిఫికేషన్ ​ఇచ్చిన ఆర్జీయూకేటీ.. ఎన్ని సీట్లను భర్తీ చేస్తారనే దానిపై క్లారిటీ ఇయ్యలేదు. వెయ్యి సీట్లు నింపాలా..1,500 సీట్లా అనే దానిపై క్లారిటీ కోసం సర్కారుకు లేఖ రాసినట్టు వర్సిటీ అధికారులు చెప్తున్నారు. అయితే కరోనా కారణం చెప్పి, ఈ ఏడాది కూడా వెయ్యి సీట్లనే భర్తీ చేసే ఆలోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది.  వర్సిటీకి నిధులు ఇవ్వలేకనే సీట్లకు కోత పెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని స్టూడెంట్స్​పేరెంట్స్​ఆరోపిస్తున్నారు. ఏపీలోనూ కొత్తగా ట్రిపుల్ఐటీలు ఏర్పాటు కావడంతో బాసర ట్రిపుల్ ఐటీకి ఏపీ స్టూడెంట్లు పెద్దగా రావడం లేదు. దీంతో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ప్రస్తుతం వాటిని జనరల్ సీట్లు చూపిస్తూ, ఏపీతో పాటు అన్ని రాష్ర్టాలకు చెందిన వారు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఏడాది నాన్ ​లోకల్ ​కోటాను ఎత్తేసి, మొత్తం సీట్లను తెలంగాణ స్టూడెంట్లతోనే నింపేందుకు చర్యలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సర్కారుకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు వర్సిటీ ఆఫీసర్లు చెప్తున్నారు. 

సీట్లకు ఫుల్ డిమాండ్... 
ఏటా టెన్త్ జీపీఏ ఆధారంగా బాసర ట్రిపుల్​ఐటీలో అడ్మిషన్లు ఇచ్చే వారు. ఈ ఏడాది 2,10,647 మంది స్టూడెంట్లకు10 జీపీఏ వచ్చింది. దీంతో పాలిసెట్ ర్యాంకుల ఆధారంగా సీట్లు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఇటీవల రిలీజ్​ అయిన పాలిసెట్ ఎంపీసీ స్ట్రీమ్​లో 75,666 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో ఎంతమంది అడ్మిషన్లు కోరుకుంటున్నారనే దాని కోసం మరోసారి స్టూడెంట్ల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఈ నెల12 వరకు ఆన్​లైన్​వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు ఇప్పటికే సూచించారు. జిల్లాపరిషత్, సర్కారు స్కూళ్లలో చదివిన స్టూడెంట్లకు 0.4 గ్రేడ్ అదనంగా యాడ్ చేసి, ఈ నెల 18 న ఫస్ట్ సెలెక్షన్ లిస్టును ప్రకటించనున్నారు.