
- రూ.8 కోట్లతో ఇటీవల సుందరీకరించిన హైడ్రా
- పిక్నిక్ స్పాట్గా మార్చినా వదలని చెత్త కంపు
- ఆటోలను వేరే చోటికి తరలించాలంటున్న స్థానికులు
- పోకిరీల బెడదా అరికట్టాలని వేడుకోలు
అంబర్పేట, వెలుగు: హైదరాబాద్ అంబర్పేటలో హైడ్రా ఇటీవల రూ.8 కోట్లతో సుందరీకరించి పిక్నిక్ స్పాట్ గా మార్చిన బతుకమ్మ కుంట మళ్లీ కంపు కొడుతోంది. కుంట చుట్టూ ‘చెత్త సేకరించే ఆటోలు’ పార్కింగ్ చేస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. సుందరీకరణలో భాగంగా కుంట చుట్టూ ప్రహరీకి అందమైన బొమ్మలు వేశారు. ప్రారంభం రోజు నాటికి ఆ పెయింటింగ్స్చూడ ముచ్చటగా ప్రజలను ఆకట్టుకున్నాయి. సుందరీకరణకు ముందు అక్కడ చెత్త సేకరించే ఆటోలు పార్కింగ్చేసేవారు. సుందరీకరణకు నోచుకున్న తర్వాత ఆ కుంట చుట్టూ మళ్లీ చెత్త సేకరించే ఆటోలు నిలపడం వల్ల దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో పిక్నిక్ స్పాట్గా మార్చామని ప్రభుత్వం ప్రకటించినా.. అధికారులు మాత్రం క్షేత్ర స్థాయిలో మెయింటనెన్స్పై దృష్టి పెట్టినట్టు కనిపించడం లేదు.
చెత్త ఆటోలు, వాటి నుంచి వస్తున్న దుర్వాసనతో బతుకమ్మకుంటకు రావలసిన ప్రజలు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. సాయంకాలం సమయంలో పిల్లలతో కాసేపు సరదాగా గడపడానికి కూడా కంపు వాసన అడ్డొస్తున్నదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ కుంటను బతికించి.. సుందరీకరించినా.. స్థానిక ప్రజలు ఆస్వాదించలేక పోతున్నారు. చెత్త వాహనాలను అక్కడి నుండి తరలించకపోవడంతో పరిస్థితి యథాతధంగా మారింది. ఈ ఆటోలతో పాటు బతుకమ్మ కుంట ప్రాంతంలో పోకిరీల బెడదా కూడా కనిపిస్తోంది. ఆటోల పక్కన గంజాయి, మందుబాబుల వీరంగం.. రోడ్డుపైనే మత్తులో నిద్రపోవడంతో స్థానికులు అటువైపు వెళ్లాలంటే జంకుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబం అంతా కలిసి పిక్నిక్కి ఎలా వెళ్తారన్న భయం కనిపిస్తోంది. చెత్త ఆటోలతో పాటు, పోకిరీల బెడదనూ అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
చెత్త ఆటోలను ఇక్కడి నుంచి తరలించాలి
ప్రభుత్వం కోట్ల నిధులు ఖర్చు పెట్టి బతుకమ్మ కుంటను పిక్నిక్ స్పాట్గా మార్చడం మా అదృష్టం. కానీ, చెత్త సేకరించే ఆటోలతో ఇబ్బంది వస్తున్నది. రోడ్డుకు ఇరువైపులా ఆటోలు నిలపడంతో స్పాట్ కు వెళ్లలేక పోతున్నాం. అధికారులు స్పందించి వేరే స్థలం చూపించి ఇక్కడి నుంచి చెత్త ఆటోలను తరలించాలి.
స్థానిక ప్రజలు