రండీ అమ్మ రండీ.. బతుకమ్మ చీరలు తీసుకోండి..

రండీ అమ్మ రండీ.. బతుకమ్మ చీరలు తీసుకోండి..

రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరలపై మహిళలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇవ్వేం బతుకమ్మ చీరలు.. మాకు వద్దు అంటూ మహిళలంతా నిరాకరిస్తున్నారు. చీరలు రోడ్డున పడేసి మాకొద్దంటూ తెలంగాణ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పలు ప్రాంతాల్లో మహిళలు చీరలను రోడ్డున పడేస్తే.. మరికొన్ని ప్రాంతాల్లో చీరలకు నిప్పు అంటిస్తున్నారు. 

చీరలు పంపిణీ చేస్తున్నట్లు ఫోటోలు అయిన దిగాలని కొందరు అధికారులు మహిళలను బ్రతిమిలలాడం కనిపించింది. రండీ అమ్మా రండీ అంటూ అధికారులు  పిలిచిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చీరలు తీసుకున్న తర్వాత కొందరు మహిళలు నాసిరకంగా ఉన్నాయి అంటూ.. గ్రామ పంచాయతీ రోడ్డుపై పడేసి వెళ్ళారు. 

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఎస్బీపల్లిలో బతుకమ్మ కానుకగా మహిళలకు పంపిణీ చేశారు. అయితే ఆ చీరలు నాణ్యతగా లేవని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మేము ఇలాంటి చీరలు ఎలా కట్టుకోవాలని ప్రశ్నించారు. ఎస్బీపల్లిలో గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద స్ధానిక జడ్పీటీసీ, బీఆర్ఎస్ నాయకులతో కలసి మహిళలకు బతుకమ్మ చీరలు ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ చీరలు తీసుకోడానికి మహిళలు ముందుకు రాలేదు. 

బతుకమ్మ చీరలు కాల్చివేత..

షాద్ నగర్ నియోజక వర్గం కొందుర్గు మండలం గంగనగూడ గ్రామంలో బతుకమ్మ చీరలను మహిళలు కాల్చివేశారు. చీరలు నాసిరకంగా ఉన్నాయని గ్రామంలోని కొందరు మహిళలు కలసి వంద చీరలను కాల్చివేశారు. ఇక్కడే కాదు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో మహిళలు బతుకమ్మ చీరలను నిరాకరించినట్లు సమాచారం.