ఈ సారి హోరా హోరీ : అనితా సలూజా

ఈ సారి హోరా హోరీ : అనితా సలూజా

కేంద్ర ఎన్నికల కమిషన్​ ఐదు రాష్ట్రాల ఎలక్షన్ షెడ్యూల్​ను ఇటీవల విడుదలజేసింది. మిజోరం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో కాంగ్రెస్,  భారతీయ జనతా పార్టీ మధ్య బ్యాలెట్ల హోరాహోరీ పోరుకు సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్యే పోరు కొనసాగుతోంది.  తెలంగాణలో మాత్రం జాతీయ పార్టీలు అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నించినా బీఆర్ఎస్ మాత్రం అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది.  ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రేసులో మొదటి స్థానంలో ఉంది. కాగా, ఆసక్తికరమైన విషయమేమిటంటే, మిజోరం ప్రాంతీయ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్​ఎఫ్​), కాంగ్రెస్ పార్టీల మధ్య మిజోరం పోరు మినహాయిస్తే..మిగిలిన రాష్ట్రాలన్నింటిలో కాంగ్రెస్, బీజేపీ రెండూ సమంగా ఉన్నాయి. 

మిజో నేషనల్​ ఫ్రంట్ గత ఎన్నికల్లో కాంగ్రెస్​ను  ఓడించి అధికార పీఠాన్ని సొంతం చేసుకుంది. మిజోరాంలోని 40 సీట్లలో 26 స్థానాలను ఎంఎన్ఎఫ్​ కైవసం చేసుకుంది. ఈశాన్య రాష్ట్రాలలో కాంగ్రెస్ ​చివరి కంచుకోటలో మిజో నేషనల్​ ఫ్రంట్ దానిని ఓడించింది.  అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ    నేతృత్వంలోని ఎన్నికల బరిలోకి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో వరుసగా ఓటమిపాలైంది. కానీ,  కాంగ్రెస్ పార్టీలో ఈసారి పోటీతత్వంలో ఉన్నట్లు కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అయినా, హిందూత్వ కార్డ్ ప్లే అయినా బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది.

ఓబీసీ రిజర్వేషన్లు వ్యతిరేకించిన రాజీవ్​గాంధీ

ఇంతకుముందు కాంగ్రెస్​ నేత, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తన హయాంలో ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మండల్ కార్డుతో ఆయన ఆడుకున్నారు. కానీ, రాహుల్ గాంధీ మొదటి రోజు నుంచి వెనుకబడిన వారికి రిజర్వేషన్లను సమర్థిస్తున్నారు. రాజీవ్ గాంధీ1990 సెప్టెంబర్ 6న తన పార్లమెంట్ ప్రసంగంలో మండల్ కమిషన్ నివేదికను వ్యతిరేకించారు. రాజ్యాంగం షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల మధ్య భేదం ఉందని ఎత్తి చూపారు.  "రాజ్యాంగ నిర్మాతలు ఈ వ్యత్యాసాన్ని ఎందుకు చేశారు? వాళ్ళ మనసులో ఏదో ఉంది.

ఈ రోజు మనం ఆ వ్యత్యాసాన్ని ఎందుకు కోల్పోయాము? ” అని రాజీవ్​గాంధీ ప్రశ్నించారు.  2010లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లులో 33 శాతం ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించనందుకు రాహుల్ గాంధీ యూటర్న్​ తీసుకుని క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు. 2023 సెప్టెంబర్​ 20న పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో నూతన పార్లమెంటు భవనంలో మహిళా బిల్లు ఆమోదం పొందింది. మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం )లో  వెనుకబడినవారికి రిజర్వేషన్ కల్పించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతుతో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది.

అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన వెంటనే రాహుల్ గాంధీ తన నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి మీడియా సమక్షంలో అధికారంలోకి వస్తే కుల గణన చేస్తామని ప్రకటించారు. 1989లో  హిమాచల్​ప్రదేశ్​లోని పాలంపూర్​లో జరిగిన ప్లీనరీ సమావేశంలో బీజేపీ తొలిసారి రామమందిరాన్ని రాజకీయ అజెండాలోకి తెచ్చింది. అప్పటి నుంచి బీజేపీకి, హిందూ వర్సెస్ ముస్లింల మధ్య కాంగ్రెస్ బుజ్జగింపుల ఆటలో కాంగ్రెస్ ​బిజీగా మారింది.  బీజేపీ సొసైటీ పోలరైజేషన్​లో విజయం సాధించింది. అనంతరం జరిగిన ప్రతి వరుస ఎన్నికల్లోనూ బీజేపీ తన ప్రాబల్యం పెంచుకుంది. మరోవైపు బీజేపీ సమాజాన్ని మతపరమైన మార్గాల్లో విభజిస్తోందని కాంగ్రెస్​ ఆరోపించడం షురూ చేసింది. 

మోదీ, రాహుల్​ మధ్యే పోరు

ఇంతకుముందెన్నడూ లేనివిధంగా బీజేపీ శ్రేణుల్లో మొదటిసారిగా భయాందోళనలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే కమలం పార్టీ ఎజెండా దొంగిలించబడటమే కాకుండా కాంగ్రెస్​ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో బీజేపీ అప్రమత్తమైంది. మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్, రాజస్థాన్ మూడు రాష్ట్రాలలో మంత్రులు, ఎంపీలను ఎన్నికల  రంగంలోకి దింపడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని స్పష్టమవుతోంది. అంతకుముందు 2014, 2019 లోక్​సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ పేరు మీద ఎన్నికలు జరగడంతో ఓటర్లు అభ్యర్థులను పెద్దగా పట్టించుకోలేదు.

నరేంద్ర మోదీకి పట్టం కట్టడంతో బీజేపీ ఆ ఎన్నికల్లో భారీ  మెజార్టీని నమోదు చేసింది. అయితే ఆ తరువాత జరిగిన  హిమాచల్ ప్రదేశ్, కర్నాటకలో బీజేపీ ఓటమిపాలైంది. ఈ పరిణామంతో బీజేపీ విశ్వాసం సన్నగిల్లుతోంది. మరో నెల రోజుల వ్యవధిలో జరిగే ఐదు రాష్ర్టాల ఎన్నికలు బీజేపీతోపాటు కాంగ్రెస్​ రెండింటికీ చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే వచ్చే ఏడాదిలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రంగాన్ని సిద్ధం చేస్తాయి. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడానికి ప్రతిపక్షాల నుంచి ఎవరు పోటీ చేసినా..కేంద్రంలో అధికారాన్ని అందించే లోక్​సభ ఎన్నికల అసలు పోరు మాత్రం కాంగ్రెస్, బీజేపీ టైటాన్స్ రాహుల్​గాంధీ, నరేంద్ర మోదీ మధ్యే జరుగుతుంది. 

హిందువులపై కాంగ్రెస్​ ప్రేమ

కుల గణన వెనుక ఉన్న పెద్ద ఆలోచన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల భారీ కూటమిని నిర్మించడం.  కుల గణన స్పష్టమైన డేటా, నిర్దిష్టమైన సంఖ్యలను అందిస్తుంది, దాని ఆధారంగా ఇది సమగ్ర అభివృద్ధి ఎజెండాను రూపొందించగలదు. 2014 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత ఆంటోనీ కమిటీ ఏర్పాటైంది. ఆంటోనీ కమిటీ నివేదికలో ముస్లింలను బుజ్జగించే విధానాన్ని తప్పుపట్టింది. మెజారిటీల ఓట్లు బీజేపీ వైపు నిలవగా, మైనారిటీ ఓట్లు సెక్యులర్ పార్టీల మధ్య చీలిపోవడమే కాంగ్రెస్ ఓటమికి కారణమని ఆంటోనీ కమిటీ అభిప్రాయపడింది.

దీంతో శరవేగంగా క్షీణిస్తున్న ప్రజాదరణ నుంచి గుణపాఠం నేర్చుకున్న కాంగ్రెస్ ఇప్పుడు మెజారిటీ ఓట్లను ఆకర్షించడానికి బీజేపీ హిందూత్వ విధానాన్ని అవలంబిస్తున్నది. జనాభాలో కేవలం 18 శాతం ఉన్న మైనారిటీలను మభ్యపెట్టడానికి బదులుగా, హిందువులపై కాంగ్రెస్ తన కొత్త ప్రేమను ప్రదర్శిస్తోంది. మధ్యప్రదేశ్​లో  కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి  కమల్ నాథ్ తనను తాను హనుమాన్ భక్తుడిగా ముద్ర వేసుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరూ కూడా బీజేపీ నాయకుల కంటే తాము ఏమాత్రం తక్కువ కాదని చూపించడానికి దేశవ్యాప్తంగా అన్ని హిందువుల దేవాలయాలను సందర్శించారు. చత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​ గోవధను నిరసించడమే కాకుండా.. గోవు రాజకీయాలను గ్రామీణ ప్రాంతాలతో ముడిపెట్టారు. గోవులను పెంచే వారి నుంచి లీటర్​కు రూ.4 చొప్పున ఆవు మూత్రాన్ని కొనుగోలు చేసే పథకాన్ని ప్రారంభించారు. 

రాహుల్​ గాంధీలో పరిణతి

వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తన గత తప్పుల నుంచి చాలా పాఠాలు నేర్చుకుంది.  కాంగ్రెస్​పార్టీ నాయకుల అభిప్రాయం ప్రకారం.. వారికి ఓట్లు తెచ్చే విధానాన్ని అవలంబిం చేందుకు మొగ్గు చూపుతోంది. కాంగ్రెస్​ పార్టీ తమ ప్రత్యర్థులను ఖండించడమే కాకుండా, ఒక లక్ష్యాన్ని సాధించాలనే స్పృహ చివరకు పార్టీ నాయకులకు రావడంతో కాంగ్రెస్​లో  ఐడియా ఆఫ్ ఇండియా, హిందూత్వ మధ్య సన్నని గీత అస్పష్టంగా కనిపిస్తోంది.  భారతీయ జనతా పార్టీ నేతలకు వారి హిందూత్వ ఎజెండా ఆవిరి అయిపోయినట్లు కనిపించడంతో రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకోవడం కూడా కొంతవరకు ఖాయమైంది.

కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ  ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సాటి కానప్పటికీ, కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడైన రాహుల్​ గాంధీ కూడా మునుపెన్నడూ లేనంతగా చాలా పరిణతి చెందారు. అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడిగా మారారు. ప్రస్తుతం రాహుల్​గాంధీని  ఖచ్చితంగా  పప్పు అని పిలవలేము. ఎందుకంటే మీడియాతోపాటు ప్రజలతోనూ రాహుల్ గాంధీ  ఇంటరాక్షన్​ చాలా రెట్లు పెరిగింది. రాహుల్​ చిన్న ప్రసంగాలు కూడా పెద్దవిగా మారాయి. సంపన్నులు, వ్యాపార దిగ్గజాలు ప్రధాని మోదీ సన్నిహితులంటూ ఆరోపిస్తూ అదానీపై దాడులకు బదులుగా కాంగ్రెస్​ ఓబీసీలు,  సంక్షేమ పథకాలు, దేశ సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించింది.

– అనితా సలూజా, రాజకీయ వ్యాఖ్యాత