ఎన్నికల్లో పాటల యుద్ధం.. ప్రధాన ప్రచార అస్త్రాలుగా మారిన సాంగ్స్

ఎన్నికల్లో పాటల యుద్ధం.. ప్రధాన ప్రచార అస్త్రాలుగా మారిన సాంగ్స్
  • పోటాపోటీగా రిలీజ్ చేస్తున్న పార్టీలు, అభ్యర్థులు  
  •  బీఆర్ఎస్ ‘గులాబీల జెండలే..’ పాట వైరల్
  • పేరడీగా ‘గులాబీల దొంగలే..’ అంటూ ప్రతిపాక్షల సాంగ్ రిలీజ్   
  • ఒక్కో సాంగ్​కు రూ.లక్ష నుంచి రూ. 5 లక్షలు
  • అభ్యర్థులు సైతం ఖర్చుకు వెనకాడకుండా పాటల రిలీజ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు పాటకు విడదీయలేని బంధం ఉంది. తొలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం దాకా ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని పాటే ముందుండి నడిపింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పాట తన ప్రాముఖ్యతను చాటుతూ వస్తోంది. ఉద్యమ సమయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తిన పాట.. నేడు రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలూ ప్రజలకు దగ్గరవడానికి పాటనే ప్రధాన అస్త్రంగా నమ్ముకున్నాయి. పథకాలు, అభివృద్ధి, మేనిఫెస్టో ప్రచారం కోసం అధికార పార్టీ పాటలను రిలీజ్ చేస్తుంటే.. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ఎండగడుతూ ప్రతిపక్షాలు కూడా పాటలను రూపొందించి జనంలోకి వదులుతున్నాయి. పార్టీ స్థాయిలోనే కాకుండా నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు సైతం సొంతంగా సాంగ్స్ రిలీజ్ చేసుకుంటున్నారు. ఒక్కో అభ్యర్థి ఐదారు పాటలు విడుదల చేస్తున్నారు. సిట్టింగ్, అధికార పార్టీ అభ్యర్థులు స్థానికంగా తాము చేసిన అభివృద్ధిని చెప్తుంటే.. ప్రతిపక్ష అభ్యర్థులు సమస్యలను ప్రస్తావిస్తూ పాటలు రిలీజ్ చేస్తున్నారు.  

‘గులాబీల జెండలే..’ వర్సెస్ ‘గులాబీల దొంగలే..’    

బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసిన ‘గులాబీల జెండలే రామక్క’ అనే పాట ఎన్నికల ప్రచారంలో దుమ్మురేపుతోంది. పార్టీ ప్రచారాలు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటే బాగా వినిపిస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లా కలల ప్రాజెక్టు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేదుకు సీఎం కేసీఆర్ వెళ్లినప్పుడు.. కేసీఆర్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన పథకాలను పొగుడుతున్నట్లుగా ఈ పాటను రూపొందించారు. ఈ సాంగ్ కొద్దిరోజుల్లోనే రాష్ట్రమంతా పాకింది. వెంటనే అలర్ట్ అయిన ప్రతిపక్షాలు ఇదే పాట ట్యూన్ తో ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, కుటుంబ పాలనను ప్రశ్నిస్తూ సెటైరికల్ గా ‘గులాబీల దొంగలే రామక్క’ అంటూ మరో పాటను రిలీజ్ చేశాయి. దీంతో ఈ పాట కూడా బాగా వైరల్ అయింది. ప్రస్తుతం ప్రచారంలో, సోషల్ మీడియాలో ఎక్కడా చూసినా ఈ రెండు పాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.  

ఒక్కో అభ్యర్థి మూడు నుంచి ఐదు పాటలు

అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ముందే ప్రకటించిన బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. టికెట్ లు ఖరారు కావడంతో అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో ప్రతిపక్షాలలో అభ్యర్థిత్వం ఖరారైనవారు, తమకే సీటు వస్తుందని నమ్మకం ఉన్నవారు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక్కో అభ్యర్థి సొంతంగా మూడు నుంచి ఐదు పాటలను రిలీజ్ చేయించుకుంటున్నారు. స్థానికంగా జరిగిన అభివృద్ధి, ప్రభుత్వ పథకాలను ప్రధానాంశాలుగా చేసుకొని అధికార పార్టీ అభ్యర్థులు పాటలు రిలీజ్ చేస్తుంటే.. స్థానిక సమస్యలు, అవినీతిపై ప్రశ్నిస్తూ ప్రతిపక్ష అభ్యర్థులు పాటలను రిలీజ్ చేస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు మహిళలకు దగ్గరవడానికి కొంచెం వెరైటీగా బతుకమ్మ, దసరా పండుగల థీమ్ తో వీడియో పాటలను రిలీజ్ చేశారు. ప్రజల్లోకి వెళ్లాలంటే పాటే ప్రధాన అస్త్రమని భావిస్తుండటంతో ఖర్చు ఎక్కువైనప్పటికీ అభ్యర్థులు వెనక్కి తగ్గట్లేదు. ప్రతిపక్షాలు మిగతా నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను ప్రకటిస్తే పాటల ప్రచార వేడి ఇంకా పెరిగే అవకాశం ఉంది.

పాత ట్యూన్ల వైపే మొగ్గు చూపుతున్న అభ్యర్థులు

ఎన్నికల సీజన్ కావడంతో లిరిసిస్టులు, సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లకు డిమాండ్ పెరిగింది. పేరున్నవారు అయితే ఒక రేటు, కొత్తవారు అయితే మరో రేటు నడుస్తోంది. కొందరు విడివిడిగా లిరిక్స్, కంపోజింగ్ చేయించుకుంటుంటే, మరికొందరు లిరిసిస్టులు, సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్ టీమ్ గా ఏర్పడి పాటలను అందిస్తున్నారు. పాత ట్యూన్లకైతే ఒక రేటు, కొత్త ట్యూన్లకైతే మరో రేటు చెబుతున్నారు. అభ్యర్థులు మాత్రం పాత ట్యూన్లకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. పాత ట్యూన్లు క్యాచీగా ఉండటం, ప్రజలు ఇదివరకే ఆ ట్యూన్లను విని ఉంటారు కాబట్టి తొందగా రీచ్ అవుతుందని భావిస్తున్నారట. పాత ట్యూన్లకు రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల దాకా, కొత్త ట్యూన్లకు రూ. 3 లక్షల దాకా తీసుకుంటున్నారు. డిమాండ్ ఉన్న మ్యూజిక్ టీమ్ అయితే ఒక్కో పాటకు రూ. 5 లక్షల దాకా డిమాండ్ చేస్తున్నారు. అయితే అభ్యర్థులు మాత్రం రేటు గురించి పట్టించుకోకుండా పాటలు కంపోజ్ చేయించుకుంటున్నారని చెప్తున్నారు.

తీరిక దొరకట్లే ఎలక్షన్ టైమ్

కావడంతో అస్సలు తీరిక ఉండట్లేదు. ఒక్క రోజే మూడు, నాలుగు సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాం. ఒకే నియోజకవర్గం నుంచి ఐదారు సాంగ్స్ వస్తున్నాయి. ఇంకో నెలరోజులు ఇలాగే ఉంటుంది. ఎన్నికల తర్వాత సినిమా, ఫోక్ సాంగ్స్ కంపోజింగ్ పనిలో బిజీగా ఉంటాం.

- రవి కల్యాణ్, మ్యూజిక్ డైరెక్టర్