- రూ.257.27 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఆసిఫాబాద్ , వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.257.27 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కాగజ్‌నగర్‌లో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు.
కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 30 పడకల నుంచి 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయనున్న రూ.26 కోట్ల చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు వాంకిడిలోని ఇందానిలో రూ.200 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు మంత్రి శంకుస్థాపన చేస్తారు.
అనంతరం వాంకిడి కేజీబీవీలో అదనపు తరగతి గదులను ప్రారంభిస్తారు. వాంకిడి జడ్పీహెచ్‌ఎస్‌లో రూ.2.30 కోట్లతో నిర్మించనున్న బాలుర వసతి గృహానికి శంకుస్థాపన చేస్తారు. ఏహెచ్‌ఎస్ (బాలికల)లో నిర్మించిన అదనపు తరగతి గదులు, నూతన పీహెచ్‌సీ భవనాన్ని, చిన్నుగూడ గ్రామంలో నిర్మించిన గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారు.
జైత్పూర్లో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి, లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశంలో పాల్గొంటారు. 5.45 గంటలకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రూ.26 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ భవనానికి మంత్రి భూమిపూజ చేస్తారు. అనంతరం ఆసిఫాబాద్ రోజ్ గార్డెన్‌లో నిర్వహించే ఏఎంసీ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు.
