జామియాలోనూ బీబీసీ టెన్షన్

జామియాలోనూ బీబీసీ టెన్షన్
  • ఢిల్లీలోని మరో వర్సిటీలో డాక్యుమెంటరీ ప్రదర్శనకు యత్నం
  • భారీగా మోహరించిన బలగాలు

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని మరో యూనివర్సిటీలో వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో డాక్యుమెంటరీ షో వేసేందుకు  ఎస్ఎఫ్ఐ స్టూడెంట్లు ప్రయత్నించగా రాళ్లదాడి జరగడంతో కలకలం రేగింది. బుధవారం జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో కూడా డాక్యుమెంటరీ ప్రదర్శనకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోని స్టూడెంట్లు ప్రయత్నించారు. సాయంత్రం 6 గంటలకు క్యాంపస్ లో బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని ముందుగా జామియా వర్సిటీ ఎస్ఎఫ్ఐ యూనిట్ ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్లను కూడా పంపిణీ చేసింది. దీంతో క్యాంపస్​లో ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా బలగాలను మోహరించారు. డాక్యుమెంటరీని ప్రదర్శించిన యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేయగా.. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్టూడెంట్లు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు 70 మంది స్టూడెంట్లను అదుపులోకి తీసుకున్నారు.  

డాక్యుమెంటరీ రెండో పార్ట్ విడుదల 

గుజరాత్ అల్లర్లు, ప్రధాని మోడీ పాలనపై రూపొందించిన ఫస్ట్ పార్ట్ వీడియోపై దుమారం కొనసాగుతుండగానే.. రెండో పార్ట్ వీడియోను కూడా బ్రిటన్ మీడియా సంస్థ బీబీసీ మంగళవారం రాత్రి యూకేలో విడుదల చేసింది. ఇందులో ఆర్టికల్ 370 రద్దు, ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక నిరసనలు, మతపరమైన అల్లర్లు, మోడీ ప్రధాని అయ్యాక గోరక్షణ పేరుతో జరిగిన దాడుల వంటి వాటిని బీబీసీ చూపించింది.