
గోదావరిఖని, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారాకనే, రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని బీసీ ఆజాద్ఫెడరేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘బీసీ మేలుకొలుపు రథ యాత్ర’ శనివారం గోదావరిఖనికి చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని జ్యోతిరావు పూలే, బీఆర్అంబేద్కర్, కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణన ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో వెంటనే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో వాటా దక్కాలన్నారు. జనాభాలో ‘మేమెంతో మాకంత’ నినాదంతో ముందుకు పోవాలన్నారు. యాత్రలో లీడర్లు రమేశ్, ఉప్పరి శ్రీనివాస్, నవీన్, కోటేశ్వర రావు, మనోహర్, సునీత, నిఖిల్, శ్రీనివాస్, శ్రీకాంత్, అశోక్ పాల్గొన్నారు.