
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు
- దుకాణాలు బంద్.. డిపోల నుంచి బయటకు రాని బస్సులు
వెలుగు నెట్వర్క్, ఆదిలాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీలు, నేతలు గొంతెత్తారు. కాంగ్రెస్ పార్టీ, బీసీ జేఏసీ, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. బంద్ నేపథ్యంలో ఉదయం నుండే దుకాణాలను మూసిఉంచారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలు ఆర్టీసీ డిపోల ముందు వేకువజాము నుంచే బైఠాయించి నిరసన తెలిపారు.
నిర్మల్డిపో నుంచి బస్సులను రాకుండా డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్, బీజేపీ నాటకమాడుతున్నాయని శ్రీహరిరావు ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ నాయకులకు చిత్త శుద్ధి ఉంటే ప్రధాని మోదీని ఒప్పించాలని డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ నాయకులు నారాయణ గౌడ్ భాస్కర్ వామపక్ష పార్టీల నాయకులు రాజన్న తదితరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్పట్టణంలో బీసీ సంఘాల నాయకులు, కాంగ్రెస్, బీజేపీ నేతలు వేర్వేరుగా బైక్ ర్యాలీలు నిర్వహించారు.
బీసీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో బస్ డిపో ముందు ధర్నా చేపట్టారు. బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ఆడే గజేందర్ నేరడిగొండ మండల కేంద్రంలో నాయకులతో కలిసి బంద్ లో పాల్గొన్నారు. ప్రధాన వీధుల గుండా తిరుగుతూ షాప్ ల యజమానులను బంద్‌కు సహకరించాలని కోరారు. ఆసిఫాబాద్ జిల్లాలో బంద్‌పాక్షికంగా జరిగింది. ఉదయం నుంచే వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రైవేటు విద్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. మధ్యాహ్నం యథావిధిగా దుకాణాలు తెరిచారు.
కార్మికక్షేత్రాల్లో స్తంభించిన జనజీవనం
బంద్‌తో సింగరేణి కార్మికక్షేత్రాల్లో జనజీవనం స్తంభించింది. బంద్‌కు అన్ని రాజకీయ, సింగరేణి కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. మందమర్రి ఏరియాలోని బొగ్గు గనులపై కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. మందమర్రి,రామకృష్ణాపూర్ పట్టణాల్లో రాజకీయ పార్టీలు బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాయి. మందమర్రిలో బీసీ సంఘాలకు మద్దతుగా కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ర్యాలీలో పాల్గొన్నారు.