రాష్ట్ర సర్కారు బీసీ గణన చేయాలి

రాష్ట్ర సర్కారు బీసీ గణన చేయాలి

బీ సీ కుల గణన పాలకులకు కొరకరాని కొయ్యగా మారబోతోంది. అటు కేంద్ర ప్రభుత్వాన్నే కాదు, ఇటు రాష్ట్ర సర్కారుకూ చెమటలు పట్టించనుంది. ఎందుకంటే.. గత రెండేళ్ళుగా బీసీలు డిమాండ్ చేస్తున్న బీసీ కుల గణన చేపట్టే అవకాశం అందుబాటులోకి వచ్చింది కాబట్టి! బీసీలు ఈ అవకాశాన్ని జారవిడిస్తే ఇక జన్మలో మళ్ళీ ఇటువంటి అవకాశం దొరకదు. దేశంలో 1932 లో అప్పటి బ్రిటిష్ పాలనలో కులాల వారీగా జన గణన జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన ఆధిపత్య పాలకులు ఎన్నడూ కుల గణన చేపట్టలేదు. కేంద్రంలో బీసీ అని చెప్పుకునే 
ప్రధాని మోడీ సైతం బీసీ గణన చేపట్టకపోవడం గమనార్హం.

బీసీ కుల గణన ఎట్లా అంటే? 

రాష్ట్రంలోని అన్ని వర్గాలకు విద్యా, వైద్యం, ఆరోగ్యం, పోషకాహారం ఏ మేరకు అందుతుందో తెలుసుకోవడానికి త్వరలో ఇంటింటికీ సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే  రాష్ట్ర  ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సబ్జెక్టుపై ఓ సమావేశం జరిగింది. ఇంటింటికీ సర్వేలో కులం, వృత్తి, ఆదాయంతోపాటు ఆధార్​ కార్డు, మొబైల్ నెంబర్ వివరాలకు అదనంగా కొన్ని కాలమ్స్ వెచ్చిస్తే చాలు, ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు పెట్టకుండానే.. అదీ అదనంగా కష్టపడాల్సిన అవసరం లేకుండా కుల గణన చేపట్టవచ్చు. దీని వల్ల రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం జనాభా ఎంత? వారి వృత్తి, ఆదాయ పరిస్థితి, ఆధార్ వివరాలు కూడా లభిస్తాయి. 

మొబైల్ నెంబరు సేకరించడం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఓటు హక్కు వంటి అనేక వివరాలను ప్రజలకు పంపే అవకాశం ఉంది. ఇంటింటికీ సర్వేతోనే కుల గణన చేపట్టాలని బీసీలతో పాటు అన్ని సామాజికవర్గాల సంఘాలు ప్రభుత్వం పై వత్తిడి తెస్తే చాలు. బీహార్​లో ఉన్నత న్యాయస్థానం అడ్డు చెప్పినట్లు ఇక్కడ అడ్డుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే బీహార్ ప్రభుత్వం మాదిరిగా నేరుగా కుల గణన చేపట్టడం లేదు కాబట్టి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వేలో  ఆస్తులు, ఆదాయ, వ్యయాలు, నివాసం, స్వస్థలంతో పాటు ఆధార్ వివరాలు, కులం, మతం వివరాలనూ సేకరించడం జరిగింది. కాబట్టి అదే తరహాలో ఇంటింటి సర్వే చేపడితే చాలు. సో కుల, బీసీ సంఘాల నాయకులు ప్రభుత్వంపై వత్తిడి తేవడానికి ఏకమై... సమైక్యమై రంగంలోకి దిగితే తప్ప బీసీ గణన మొదలు కాదు.

బీహార్​లో ఆపేసిన సుప్రీంకోర్టు

బీసీ గణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం తానే ఈ పని ఎందుకు చేయడం లేదు? అని ఇంతకాలం బీసీలను తొలుస్తూ వస్తోంది. అయితే బీహార్​లో నితీష్ కుమార్ ప్రభుత్వం చేపట్టిన కుల గణను ఉన్నత న్యాయ స్థానం నిలిపి వేసింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన జన గణనను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం అంటే.. కేంద్ర ప్రభుత్వ సార్వభౌమ అధికారంలో జోక్యం చేసుకోవడం అని ఉన్నత న్యాయస్థానం తప్పు పట్టింది. సో.. రాష్ట్రంలో బీసి కుల గణన చేపట్టినా న్యాయ స్థానాలు అడ్డు చెప్పే అవకాశం ఉంటుంది. మరి బీసీలతో పాటు అన్ని వర్గాల జనాభా తేలితేనే కదా.. ఆయా వర్గాలకు సంక్షేమ పథకాలలో తగిన వాటా దక్కుతుంది. దీనికి తోడు చట్ట సభల్లో సమాన అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే కుల గణన చేపట్టి తొంభై ఏళ్ళు కావస్తోంది.‌ పరాయి పాలకులు చేపట్టారు. కానీ మన పాలకులు దాటవేస్తున్నారు. దీని వల్ల బీసీలు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయానికి గురవుతూ వస్తున్నారు. 1990 నాటి మండల్​ కమిషన్​ నివేదికలో 2500 మంది ఐఏఎస్​లకు గానూ 200 బ్రాహ్మణులు, 200 మంది ఎస్సీ, ఎస్టీ, ఇతరులు ఉంటే, బీసీలు కేవలం 50 మంది మాత్రమే.

 జంగిటి వెంకటేష్, సీనియర్ జర్నలిస్ట్