
- హైకమాండ్ల మెప్పు కోసం ఎవరికి వారే యమునా తీరే!
- పార్టీలకతీతంగా ఢిల్లీకి తరలిరావాలని ఇప్పటికే బీసీ మంత్రుల పిలుపు
- వెళ్తే అధిష్టానాలకు కోపం.. వెళ్లకుంటే రాజకీయంగా నష్టం
- సంకట స్థితిలో బీజేపీ, బీఆర్ఎస్ బీసీ నేతలు
- ఇకనైనా ఏకతాటిపైకి రావాలంటున్న బీసీ సంఘాలు
హైదరాబాద్, వెలుగు:బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తున్నది. రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బీసీ బిల్లులు, పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీకి రావాలని బీసీ మంత్రులు ఇప్పటికే పిలుపునిచ్చారు. 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఆయా పార్టీల్లోనీ బీసీ నేతలంతా పార్టీలకు అతీతంగా వచ్చి, కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవాలని బీసీ సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఇలాంటి టైంలో కలిసిరాకపోతే ఆయా నేతలు, పార్టీ లకు పుట్టగతులు ఉండవని ప్రెస్‌మీట్లు పెట్టి మరీ హెచ్చరిస్తున్నారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లోని బీసీ నేతలు సంకట స్థితిలో పడ్డారు. బీసీ బిల్లులకు మద్దతుగా ఢిల్లీ వెళ్తే ఎక్కడ తమ హైకమాండ్ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందోననే భయం ఒకవైపు, వెళ్లకపోతే బీసీల నుంచి వ్యతిరేకత వచ్చి రాజకీయంగా నష్టపోతామన్న ఆందోళన మరోవైపు ఆ రెండు పార్టీల్లోని బీసీ నేతలను వెంటాడుతున్నది. ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటపడేందుకు కొందరు బీసీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సాకులు వెదుకుతున్నారనే విమర్శలు బీసీ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి.
బీసీ జాబితాలోనుంచి ముస్లింలను తొలగించాల్సిందేనంటున్న బీజేపీ
బీజేపీలోని బీసీ లీడర్ల పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అన్నట్లుగా తయారైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్ బిల్లు లకు ఆమోదం తెలపడంలో కావాలనే జాప్యం చేస్తు న్నదనే ఆరోపణలున్నాయి. బీసీ బిల్లులతోపాటు ఇటీవల పంచాయతీరాజ్ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతికి గవర్నర్ పంపడం, వీటన్నింటినీ రాష్ట్రపతి పెండింగ్పెట్టడం ఆ పార్టీలోని బీసీ నాయకులకు ఇబ్బందికరంగా మారింది. బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అర్వింద్ కుమార్, ఈటల రాజేందర్, లక్ష్మణ్, ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యేల్లో పాయల్ శంకర్ బీసీ నాయకులే. బీసీ సామాజిక వర్గానికి చెందిన వీరంతా రిజర్వేషన్ల ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్‌నేతలు కొంతకాలంగా డిమాండ్చేస్తున్నారు.
కానీ కేంద్రం బీసీ బిల్లులను ఆమోదించే పరిస్థితి లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఇప్పటికే తేల్చి చెప్పారు. హైకమాండ్‌తో మాట్లాడిన తర్వాతే ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా, దానికి వ్యతిరేకంగా బీజేపీలోని బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీసీ బిల్లులకు మద్దతిచ్చే పరిస్థితి లేదు. ఈ అంశంపై ముందే క్లారిటీ ఉన్న కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తోపాటు బీసీ ఎంపీలు.. బీసీ జాబితాలోంచి ముస్లింలను తొలగిస్తే తప్ప బీసీ బిల్లులకు మద్దతు ఇవ్వబోమని మాట్లాడుతున్నారు. నిజానికి బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు బీజేపీ ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ బిల్లులు గవర్నర్ నుంచి రాష్ట్రపతికి చేరాక మాట మార్చడం ప్రారంభించారు. ఒక దశలో కులగణన సరిగ్గా జరగలేదని, ఆ తర్వాత బీసీల్లో ముస్లింలనూ లెక్కించారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ బీజేపీ అధికారంలో ఉన్న యూపీ, గుజరాత్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లోనూ మతంతో సంబంధం లేకుండా వెనుకబాటుతనం ఆధారంగా పలు ముస్లిం వర్గాలను బీసీల్లో చేర్చిన విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు మంత్రులు సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. ఈ క్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను ముస్లింల సాకుతో అడ్డుకోవడం ముమ్మాటికీ బీసీ వ్యతిరేక చర్యే అని కుండబద్ధలు కొట్టారు. కాంగ్రెస్తెచ్చిన బీసీ బిల్లుల్లో ఎలాంటి లోపం లేదని, వాటిని ఉన్నదున్నట్లు కేంద్రంతో ఆమోదింపజేయకపోతే తెలంగాణలో బీజేపీకి, ఆ పార్టీ నేతలకు పుట్టగతులుండవని హెచ్చరించారు.
బీసీ వ్యతిరేకులుగా ముద్రపడుతుందనే భయం..
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ నేతలను ఏదోరకంగా కౌంటర్ఇస్తూ తప్పించుకుంటున్న బీజేపీ నేతలు.. బీసీ సంఘాల లీడర్ల విషయంలో మాత్రం కిమ్మనడం లేదు. బీసీ సంఘాల నేతలకు వ్యతిరేకంగా మాట్లాడితే బీసీ వ్యతిరేకులుగా ముద్రపడే ప్రమాదముందని, అది తమ రాజకీయ ఉనికికే ప్రశ్నార్థకమనే భయం వారిలో వెంటాడుతున్నట్లు తెలుస్తున్నది. ‘‘బీసీ రిజర్వేషన్ల పెంపు మా హైకమాండ్‌కు ఇష్టం లేదు. తెలంగాణ నుంచి వచ్చిన బీసీ బిల్లులను ఆమోదించి, 9వ షెడ్యూల్‌లో పెట్టడమంటే దేశవ్యాప్తంగా తేనెతుట్టెను కదిలించడమే అని భావిస్తున్నది. అందుకే మా అధిష్టానం అంటీముట్టనట్లు ఉంటోంది. ఇలాంటి టైంలో బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా మేం మాట్లాడే పరిస్థితి లేదు. మాట్లాడకుంటే బీసీలకు వ్యతిరేకమనే భావన వస్తుంది. ఈ తిప్పలన్నీ అందుకే’’ అని బీజేపీకే చెందిన ఓ సీనియర్‌నేత చెప్పడం ఆ పార్టీలోని పరిస్థితికి అద్దంపడుతున్నది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన శాస్త్రీయంగా లేదన్న బీజేపీ నేతలకు కాంగ్రెస్ లీడర్లు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. తెలంగాణ చేపట్టిన కులగణన మోడల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనందునే కేంద్రం జనగణనతోపాటు కుల గణన చేసేందుకు ముందుకు వచ్చిందని, అలాంటప్పుడు కులగణనను రాష్ట్ర నేతలు ఎలా తప్పుపడ్తారని నిలదీస్తున్నారు.
బీఆర్ఎస్‌లో తీవ్ర గందరగోళం
బీసీ బిల్లులకు మద్దతు ఇచ్చే విషయంలో బీఆర్ ఎస్‌లోనూ తీవ్ర గందరగోళం నెలకొన్నది. బిల్లు లకు అసెంబ్లీలో బేషరతుగా మద్దతు ప్రకటించిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవ హరిస్తున్నారు. చలో ఢిల్లీపై ఆ పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్లే బీసీ నాయకులు ఎవరికి తోచింది వారు మాట్లాడు తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే ప్రక్రియ నడి చిందనే ఆరోపణలు ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టా యి. తాజాగా.. బీసీ రిజర్వేషన్లపై బీజేపీతో పోరాడేందుకు ముందుకు రాకపోతే ఆ ఆరోప ణలకు మరింత ఊతం ఇచ్చినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తాజాగా.. తలసాని చేసిన వ్యాఖ్యలూ బీజేపీకే మద్దతు ఇచ్చేలా ఉన్నాయి. మరోవైపు హైకమాండ్ పెద్దలు తమ చేతికి మట్టి అంటకుండా ఈ అంశంపై బీసీ నేతలను ఇరుకున పెడ్తున్నారనే విమర్శలు వస్తు న్నాయి. తాజాగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివా స్ గౌడ్, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి మీడియా సమావేశంలో మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బీసీ బిల్లులను హడావుడిగా పాస్ చేసి కేంద్రానికి పంపారని, ఇప్పుడు ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న దని తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. ఆ బిల్లులను ఆమోదించిన సభలో సభ్యుడిగా ఉన్న ఆయన ఇప్పుడిలాంటి విమర్శలు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
లోలోపల మధనపడుతున్న బీఆర్ఎస్ బీసీ లీడర్లు
కొంతకాలంగా కాంగ్రెస్ తీసుకున్న కార్యాచరణ ద్వారా బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. 42% రిజర్వేషన్లు న్యాయపరమైన చిక్కులకు దారితీస్తాయని, ఇది బీసీలకు నిజమైన ప్రయో జనం చేకూర్చదని వాదిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. గతంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్లపై జీవోలు ఇచ్చింది. కానీ కుల గణన సర్వే చేయకపోవడం, ఎంపిరి కల్ లేకుండా కేవలం కాగితాలపై జీవో ఇవ్వడంతో అవి చెల్లుబాటు కావని కోర్టు కొట్టేసింది. కానీ కాంగ్రె స్ ప్రభుత్వం కుల గణన చేయడంతోపాటు బీసీ బిల్లులను పకడ్బందీగా రూపొందించింది. పైగా సర్వేలో ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నప్పటికీ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు లాంటి వారు పాల్గొనలేదు.
బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టంలేకనే అలా చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఇది బీఆర్ఎస్ పార్టీలోని బీసీ నాయకులకు అప్పట్లో ఇబ్బందిగా మారింది. తీరా ఇప్పుడు హైకమాండ్ మౌనం కూడా బీసీ నేతలను కలవ రపెడ్తున్నది. ఇప్పటిదాకా జరిగింది ఓ ఎత్తు కాగా, చలో ఢిల్లీ పేరుతో కేంద్రంపై ఒత్తిడి పెట్టే కార్యక్రమానికి వెళ్లకుంటే ప్రజల్లోకి, ముఖ్యంగా బీసీల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఇది తమకు రాజకీయంగా నష్టం చేస్తుందని బీఆర్ఎస్‌లోని బీసీ నేతలంతా లోలోపల మధనపడ్తున్నారు. 8న కరీంనగర్‌లో బీసీ రిజర్వేషన్లపై భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నామని చెప్తున్నారు. కానీ, కేంద్రంపై ఢిల్లీలో పోరాడాల్సిన సమయంలో గల్లీ పోరాటం ఎందుకని ఆ పార్టీలోని ఇంకొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు.
అన్ని పార్టీల ప్రెసిడెంట్లకు సీఎం లేఖలు..
బీసీ రిజర్వేషన్ బిల్లులపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. పార్లమెంట్‌లో ఎంపీలతో వాయిదా తీర్మానం, జంతర్ మంతర్ దగ్గర ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నేతలతో ధర్నా, రాష్ట్రపతిని కలిసి బీసీ బిల్లులకు ఆమోదం తెలపాలని వినతిపత్రాలు ఇవ్వడం లాంటి కార్యాచరణను రెడీ చేసింది. కాగా, ఈ కార్యక్రమాలకు పార్టీలకతీతంగా తరలివచ్చి మద్దతు ఇవ్వాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు లేఖలు రాయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆయా పార్టీల్లో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులకు కూడా ప్రత్యేకంగా లేఖలు రాయాలని భావిస్తున్నారు. రిజర్వేషన్లపై తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని మరోసారి చాటిచెప్పడంతోపాటు అన్ని పార్టీలు కలిసివస్తే కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలుస్తున్నది.