బలోపేతమవుతున్న బీసీవాదం.. కారణం అధికార కాంగ్రెస్​ పార్టీ నిర్వహించిన సామాజిక కులగణన

బలోపేతమవుతున్న బీసీవాదం.. కారణం అధికార కాంగ్రెస్​ పార్టీ నిర్వహించిన సామాజిక కులగణన

అధికార కాంగ్రెస్​ పార్టీ సామాజిక కులగణన నిర్వహించిన తర్వాత ఎవరిశాతం ఎంతో తెలిసిపోయింది. ఆయా కులాలకు ఎవరివాటా ఎంతనో అవగతం అయినది. ఈ గాలి త్వరలో రాజకీయ తుఫాన్​గా మారే సంకేతాలను ఇస్తున్నది. వెనుకబడిన కులాలకు ఒక ఆశాకిరణంలా దృశ్యీకరిస్తున్నది. పార్టీ పేరు ఏది ఏమైనప్పటికీ' బడితె ఉన్నోడిదే బర్రె' అన్నట్టు అన్ని పార్టీలు  తమ తమ కులాల ప్రాతిపదికన టికెట్లు ఇస్తున్నాయి.  పైకి సామాజిక సమతూకం అంటూనే  తీరా చూస్తే  అధికార వర్గానికి అగ్రతాంబూలం ఇస్తున్నారు.

అంతవరకు నాయకులు చెప్పిన మాట్లాడిన మాటలన్నీ  ఎన్నికల సమయం వచ్చాక  ప్రాంతీయ,  జాతీయ పార్టీల భేదం లేకుండా అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలుగా వీరికి మొండిచేయి చూపిస్తున్నాయి. కాంగ్రెస్​పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో అధికారంలోకి రాగానే  కులగణనకు శ్రీకారం చుట్టి పూర్తిచేసింది. ఈ గణన అనంతరం  తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలలోని వెనుకబడిన వర్గాలలో అంతర్గతంగా ఒక చర్చకు దారి తీసింది.

సామాజిక విప్లవాత్మక మార్పు 
బీసీవాదం లేక నినాదం రాజకీయ పార్టీలలో  క్రమక్రమంగా బహుజనులను ఏకంచేసే విధంగా, సామాజిక విప్లవాత్మక మార్పు దిశగా మార్చుకోనున్నది. ముందుముందు అధికారం కోసం తమ వాటా డిమాండ్ చేసే మార్గం సుగమం అవుతున్నది.  ఏ రాష్ట్రంలోనైనా  పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చిన  వర్గాల వారికే  పెద్దపీట వేస్తూ వెనుకబడిన వర్గాలను విస్మరిస్తున్నాయి. అయినప్పటికీ ఓపికతో వీరు అధినాయకత్వాన్ని పల్లెత్తు మాట్లాడడం లేదు. గత పదేళ్లలో ఉన్న ప్రభుత్వం వారి వర్గాలకే అనేక ప్రభుత్వ పథకాల ద్వారా  మేలు చేయడంతో పాటు పదవులు కట్టబెట్టారు.  గత ప్రభుత్వం పట్ల అసంతృప్తితో  మరో వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వంలోకి  తెస్తే వీరు కూడా ఏమాత్రం  భిన్నంగా ప్రవర్తించలేకపోవడం శోచనీయం.  ఇది అత్యంత గర్హనీయం. ఈ విధానాలు ఇలాగే కొనసాగితే  త్వరలో బహుజనులు అంతా ఏకమై ప్రభుత్వాలపై తమ వాటా కోసం ఒత్తిడి పెట్టాల్సి వస్తుంది. 

కులగణనపై రాహుల్ పాదయాత్ర ప్రభావం 
ఇటీవల దేశంలో ఏర్పడిన కొన్ని తీవ్ర పరిణామాల నేపథ్యంలో..  ప్రాంతీయ,  జాతీయస్థాయిలలో ఆయా పార్టీల మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవలసిన అనివార్య  పరిస్థితులు ఏర్పడినాయి. ఈ వాతావరణం మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ  దేశమంతా చేసిన పాదయాత్ర మూలంగా ప్రధానంగా  సామాజిక కులగణనను రాజకీయ పార్టీల ఎజెండా మీదికి బలవంతంగానైనా ముందుకు తెచ్చింది. దీని ప్రభావం గత సంవత్సరం జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలపైన చూపింది. అలాగే  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తోడ్పడిన విషయం తెలిసిందే. గత పదేళ్ల ప్రభుత్వ పాలనలో  జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకింది.  గత ప్రభుత్వ అక్రమాలు తదితర విషయాలపైన విచారణ జరిపి నివేదికల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో అన్నారు.

దీంతో  ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు.  ఫలితంగా తెలంగాణ ప్రజలు ఆశించిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన ప్రధాన వాగ్దానం మేరకు సామాజిక కులగణన చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది.  సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు అమలుచేస్తూ జారీ చేయడం జరిగింది. స్థానిక సంస్థలలో  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి అధికారికంగా సంకల్పించింది. ఇది ఇక్కడితో ఆగిపోకుండా భవిష్యత్తులో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు చట్టసభల్లో కల్చించాలనే ఉద్యమం రూపు తీసుకోనుంది. ఇన్నాళ్ళు  నివురు కప్పిన నిప్పులా ఉన్న వెనుకబడిన వర్గాలు త్వరలో తమ హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై ముందు ఎప్పుడూ లేనంత ఒత్తిడి పెంచనున్నాయి.

జూకంటి జగన్నాథం