గద్వాల బీఆర్ఎస్ లో బీసీ పాలిటిక్స్.. నడిగడ్డలో పొలిటికల్​ హీట్

గద్వాల బీఆర్ఎస్ లో బీసీ పాలిటిక్స్.. నడిగడ్డలో పొలిటికల్​ హీట్
  • టికెట్​ కోసం జడ్పీ చైర్​పర్సన్​ సరిత పావులు
  • గద్వాల యువ చైతన్య సదస్సు పేరుతో ఏకతాటిపైకి బీసీ లీడర్లు
  • బ్యానర్​పై ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంపై చర్చ
  • కుల రాజకీయాలంటూ ఎమ్మెల్యే వర్గీయుల కామెంట్​

గద్వాల, వెలుగు:  గద్వాల బీఆర్ఎస్  టికెట్​ కోసం బీసీ వర్గం నేతలు పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలోని మల్దకల్  మండల కేంద్రంలో ఈ నెల 23న ‘సమాజాభివృద్ధిలో యువత పాత్ర’ గద్వాల యువ చైతన్య సదస్సును ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సదస్సుకు జడ్పీ చైర్​పర్సన్  సరిత, ఆమె భర్త తిరుపతయ్య, సీనియర్ బీఆర్ఎస్  లీడర్, ఉద్యమకారుడు నాగర్ దొడ్డి వెంకట్రాములు, ప్రజా సంఘాల లీడర్లు పాల్గొని వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీ లీడర్లకే టికెట్  ఇవ్వాలని డిమాండ్​ చేశారు. అయితే ఈ మీటింగ్​లో బీఆర్ఎస్ కు చెందిన లీడర్ లే ఎక్కువగా పాల్గొనడం హాట్ టాపిక్ గా మారింది. సిట్టింగ్  బీఆర్ఎస్  ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ జడ్పీ చైర్మన్ తో పాటు సీనియర్  లీడర్లు మాట్లాడడం దీనికి బలం చేకూర్చుతోంది.

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా..

గద్వాల ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆయన ఫొటో లేకుండా, సమాచారం లేకుండా బీఆర్ఎస్ కు చెందిన కొందరు నేతలు సదస్సు నిర్వహించడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటివరకు చాప కింద నీరులా ఉన్న అసమ్మతి ఈ సదస్సుతో బయటపడిందని చెబుతున్నారు. బీసీలను ఏకం చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే కు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ సదస్సులు నిర్వహిస్తున్నారని అంటున్నారు. 

ఎమ్మెల్యే, జడ్పీ చైర్​పర్సన్​ మధ్య వార్..

జడ్పీ చైర్​పర్సన్ గా సరిత ఎన్నికైనప్పటి నుంచి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో వైరం కొనసాగుతోంది. జడ్పీ మీటింగ్ లకు జడ్పీటీసీలను రాకుండా అడ్డుకుని జడ్పీ చైర్​పర్సన్​ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. బీసీ కోటాలో జడ్పీ చైర్​పర్సన్​ టికెట్  కోసం ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఇందులో భాగంగానే బీసీ కోటాలో టికెట్  కోసం ఇప్పటి నుంచే సదస్సుల పేరిట బీసీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

భయపడుతున్రని వ్యాఖ్యలు..

గద్వాల యువ చైతన్య సదస్సుకు తాను హాజరవుతున్నానని తెలిసి మీటింగ్​ను అడ్డుకునేందుకు  కరెంట్​ తీసేశారని జడ్పీ చైర్​పర్సన్​ సరిత ఈ మీటింగ్​లో కామెంట్​ చేశారు. ఈ సారి ఖచ్చితంగా బీసీలకు టికెట్ ఇవ్వాలని, వారికి తన సపోర్ట్​ ఉంటుందని, ఎంతో కాలం నుండి నాగర్ దొడ్డి వెంకట్రాములు పార్టీలో ఉన్నా ఏ పదవి దక్కలేదని, ఈసారి ఖచ్చితంగా పార్టీ సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఏ పార్టీ అయినా బీసీలే టికెట్లు తెచ్చుకోవాలని వారికి తన అండదండలు ఉంటాయని ఆమె సదస్సులో పేర్కొన్నారు.

కుల రాజకీయాలు చేస్తున్నారని..

బీఆర్ఎస్ లోని ఒక వర్గం యువ చైతన్య సదస్సులు అంటూ కుల రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే వర్గం నేతలు మండిపడుతున్నారు. నియోజకవర్గంలో కుల రాజకీయాలకు తావు లేదని, కేసీఆర్​ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగిందని వారు కౌంటర్ ఇస్తున్నారు. ఎన్ని మీటింగ్ లు, సదస్సులు పెట్టినా తమకు ఎలాంటి నష్టం ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.