ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలె: బీసీ విద్యార్థి సంఘం నేత రామకృష్ణ

ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలె: బీసీ విద్యార్థి సంఘం నేత రామకృష్ణ

ముషీరాబాద్, వెలుగు : విద్యా సంవత్సరం పూర్తయినా స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోవడం ఏమిటని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ సకాలంలో ఇవ్వకపోవడంతో పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువును మధ్యలో ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసి గేటు వద్ద విద్యార్థులతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో హాల్ టికెట్లు, సర్టిఫికెట్స్ ఇచ్చే సమయంలో ప్రైవేట్ కాలేజీలు పూర్తి ఫీజు కట్టాలని విద్యార్థులను వేధిస్తున్నాయని రామకృష్ణ తెలిపారు.

విద్యార్థులు అనేక బాధలు పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. పేద విద్యార్థులు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్  పథకాన్ని  బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైన ఫీజు రీయింబర్స్ మెంట్  రిలీజ్  చేయాలని.. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వరుణ్ గౌడ్, నాగరాజ్, శ్రీకాంత్, నిఖిల్ పాల్గొన్నారు.