IPL 2025: ఏప్రిల్ 16న ఐపీఎల్‌ ఓనర్లతో బీసీసీఐ సమావేశం

IPL 2025: ఏప్రిల్ 16న ఐపీఎల్‌ ఓనర్లతో బీసీసీఐ సమావేశం

ఏప్రిల్ 16న ఐపీఎల్‌ ఫ్రాంచైజీల ఓనర్లతో బీసీసీఐ పెద్దలు సమావేశం కానున్నారు. ఇప్పటికే మొత్తం 10 మంది ఐపీఎల్ టీమ్ ఓనర్లకు బోర్డు ఆహ్వానాలు పంపింది. ఈ భేటీకి నిర్దిష్ట ఎజెండా అంటూ ఏమీ లేనప్పటికీ.. ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి మెగా వేలం, ఆటగాళ్ల రిటెన్షన్‌, రైట్ టు మ్యాచ్ కార్డ్‌, పర్స్‌ వ్యాల్యూ తదితర అంశాలు చర్చకు రావచ్చని తెలుస్తోంది.

అహ్మదాబాద్‌లో జరిగే ఈ సమావేశానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జే షా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ హాజరుకానున్నారు. వెబ్‌సైట్‌ నివేదికల ప్రకారం, బీసీసీఐ.. యజమానులను మాత్రమే ఆహ్వానించినప్పటికీ.. టీమ్ CEOలు, ఇతర సిబ్బంది వారితో పాటు సమావేశానికి వస్తారని భావిస్తున్నారు. 

వచ్చే ఏడాది ప్రారంభంలో వేలం

ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించి మెగా వేలం వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో జరగవచ్చని భావిస్తున్నారు. అంతకుముందు జరిగే ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ నియమ నిబంధనల గురించి ఈ భేటీలో చర్చించవచ్చని తెలుస్తోంది. రిటైన్‌ విషయంలో జట్ల యాజమాన్యాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. రిటైన్‌ చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్యపై ఏకాభిప్రాయం లేదు. అందుతున్న సమాచారం ప్రకారం.. గతంలో 4 ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకునే అవకాశం ఉండగా.. ఆ సంఖ్యను 8కి పెంచాలని ఫ్రాంచైజీలు కొరవచ్చని తెలుస్తోంది. మెగా వేలానికి ముందే పాలసీలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలన్నీ ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి.

ALSO READ :- BAN vs SL: ఈజీ క్యాచ్ మిస్.. ముగ్గురు చేతిలో దోబూచులాడిన బంతి

ఈ సమావేశంలో సాలరీ క్యాప్‌పై చర్చించే అవకాశాలున్నాయి. గతేడాది మినీ వేలంలో 100 కోట్లకు పెరిగిన ఫ్రాంచైజీ పర్స్‌ వ్యాల్యూ రాబోవు సీజన్‌లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే, ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు మరింత ఖర్చు చేయాల్సి రావొచ్చు.