స్కై బ్లూ రంగులో కొత్త జెర్సీ.. 3 నక్షత్రాలు ఎందుకంటే ?

స్కై బ్లూ రంగులో కొత్త జెర్సీ.. 3 నక్షత్రాలు ఎందుకంటే ?

టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. జట్టు సభ్యుల కోసం కొత్త జెర్సీని బీసీసీఐ ఆవిష్కరించింది. స్కై బ్లూ రంగులో ఈ టీ షర్టు ఉంది. ముంబైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జెర్సీని విడుదల చేశారు. కొంతమంది టీమ్ ఇండియా ఆటగాళ్లు కూడా ఈ ప్రోగ్రామ్ కు హాజరయ్యారు. 2000 సంవత్సరం ఆరంభం నుంచే టీమిండియా ఇలాంటి జెర్సీలు ధరిస్తూ వస్తోంది. 2007లో నీలిరంగుతో కూడిన జెర్సీలు ధరించి టీ 20 ప్రపంచ కప్ ను గెలుచుకుంది. 

ఈసారి టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియాలో జరుగనున్నాయి. ఇటీవల ఆసియా కప్ టైటిల్ ను చేజిక్కించుకోవడంలో భారత్ విఫలమైంది. ఎలాగైనా టీ20 వరల్డ్ కప్ ను సాధించాలన్న సంకల్పంతో టీమ్ సభ్యులున్నారు. టీ 20 ప్రపంచ కప్ కు ముందు టీమిండియా.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లతో టీ 20 సిరీస్ లను ఆడనుంది. టీ20 వరల్డ్ కప్ కంటే ముందు జరుగుతున్న ఈ సిరీస్ లు టీమిండియాకు మంచి ప్రాక్టీస్ లా ఉపయోగపడుతాయని బీసీసీఐ భావిస్తోంది.

జెర్సీపై మూడు నక్షత్రాల అర్థం ఇదీ.. 

ఈ కొత్త జెర్సీపై 3 నక్షత్రాలు ఉన్నాయి. ఇవి మన ఇండియా టీం ప్రపంచ కప్ ను మూడుసార్లు గెలుచుకున్నందుకు చిహ్నాలు. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్ తొలి సీజన్‌లో, మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో రెండోసారి, 2011లో మహేంద్రసింగ్‌ ధోనీ సారథ్యంలో భారత జట్టు మూడోసారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఈసారి ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో నాలుగోసారి ప్రపంచకప్ గెలవాలనే సంకల్పంతో టీమ్ ఇండియా బరిలోకి దిగనుంది.

టీ20 వరల్డ్ కప్ భారత జట్టు :  రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్

 

భారత్ ఆస్ట్రేలియా మధ్య మంగళవారం నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ టీ20 మ్యాచ్ ఆడేందుకు టీమిండియా మొహాలీకి చేరుకుంది. మ్యాచ్‌కు మూడు రోజుల ముందుగానే మనోళ్లు మొహాలీలో దిగారు. మొహాలీ విమానాశ్రయంలో టీమిండియా క్రికెటర్లు కనిపించడంతో..అభిమానులు  వీడియోలు, ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.