Shreyas Iyer: రోహిత్ తర్వాత టీమిండియా వన్డే కెప్టెన్‌ ఎవరు..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ సెక్రటరీ

Shreyas Iyer: రోహిత్ తర్వాత టీమిండియా వన్డే కెప్టెన్‌ ఎవరు..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ సెక్రటరీ

శ్రేయాస్ అయ్యర్‌కు వన్డే కెప్టెన్సీ ఇస్తున్నారంటూ వస్తున్న వార్త గురువారం (ఆగస్టు 21) చర్చనీయాంశమైంది. అన్ని రిపోర్ట్స్ కూడా శ్రేయాస్ కు వన్డే పగ్గాలు అప్పజెబుతున్నట్టు చెప్పుకొచ్చాయి. మొన్నటివరకు టీమిండియా జట్టులో స్థానం కోసం పోరాడినా అయ్యర్ కు ఏకంగా వన్డే సారధ్య బాధ్యతలు ఇవ్వడం కాస్త షాకింగ్ గా మారింది. గిల్ కు మూడు ఫార్మాట్ లకు కెప్టెన్సీ ఇస్తే అతనిపై పని భారం ఎక్కువవుతుందని.. ఈ కారణంగా అయ్యర్ కు వన్డే కెప్టెన్సీ బీసీసీఐ ఇస్తుందనే ప్రచారం సాగింది. అయ్యర్ కు వన్డే కెప్టెన్ బాధ్యతలు ఇస్తున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. 

శ్రేయాస్ అయ్యర్‌ను తదుపరి వన్డే కెప్టెన్‌గా చేయడానికి బీసీసీఐ సిద్ధంగా ఉందని వచ్చిన వార్తల్లో నిజం లేదని.. ఒక రోజు తర్వాత బోర్డు అలాంటి రూమర్స్ కు చెక్ పెట్టింది. రోహిత్ శర్మ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్ లో ఎవరిని కెప్టెన్ గా చేయాలనే చర్చలు జరగలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. అయ్యర్ పై ఎలాంటి చర్చలు జరగలేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. అదే సమయంలో రోహిత్ తర్వాత టీమిండియా వన్డే కెప్టెన్ ఎవరనే విషయంలో క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం వన్డే జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉంటున్న శుభమాన్ గిల్ ఫ్యూచర్ లో రోహిత్ స్థానంలో సారధ్య బాధ్యతలు చేపడతాడని సైకియా పరోక్షంగా చెప్పుకొచ్చారు. 

"గిల్ వన్డే క్రికెట్‌లో యావరేజ్ 59 ఉంది. ప్రస్తుతం అతను టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇటీవల టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సమయం వచ్చినప్పుడు వన్డే క్రికెట్‌లో నాయకత్వం వహించకుండా గిల్ సిద్ధంగా ఉన్నాడు". అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బీసీసీఐ మాటలను బట్టి చూస్తుంటే అయ్యర్ కు వన్డే కెప్టెన్సీ ఇచ్చే ఉద్దేశ్యం లేనట్టు తెలుస్తుంది. గిల్ ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్ గా జట్టును నడిపిస్తున్నాడు. 2026 టీ20 వరల్డ్ కప్ తర్వాత సూర్య స్థానంలో కెప్టెన్సీ చేపట్టడం దాదాపుగా ఖాయమైంది. 

మరోవైపు అయ్యర్ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అతడికి టెస్ట్, టీ20 జట్టులో చోటు దక్కడం లేదు. ఒక్క ఫార్మాట్ లోనే చోటు దక్కించుకునేందుకు కష్టపడుతున్న శ్రేయాస్ కు సారధ్య బాధ్యతలు ఇవ్వడం దాదాపు అసాధ్యం. శ్రేయాస్ అయ్యర్ కు ఇటీవలే ఆసియా కప్ లో చోటు దక్కని సంగతి తెలిసిందే. అయ్యర్ ఐపీఎల్ 2025 సీజన్ లో అత్యద్బుత్యంగా రాణించాడు. 175 స్ట్రైక్ రేట్ తో 600 పరుగులు చేశాడు. కెప్టెన్ గాను రాణించి జట్టును ఫైనల్ కు చేర్చాడు. కంబ్యాక్ ఇవ్వడం గ్యారంటీ అనుకున్నా జట్టులో చోటు సంపాదించలేకపోయాడు.