కెప్టెన్‍గా ఉండి తీరాల్సిందే: వద్దన్నా రోహిత్ వెంటపడుతున్న బీసీసీఐ

కెప్టెన్‍గా ఉండి తీరాల్సిందే: వద్దన్నా రోహిత్ వెంటపడుతున్న బీసీసీఐ

దక్షిణాఫ్రికాతో త్వరలో జరగనున్న పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు, 2024 టీ20 వరల్డ్ కప్ కు కెప్టెన్ ఎవరు అనే ప్రశ్నకు సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇటీవలే టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ టీ20లపై ఆసక్తి లేదని సెలక్టర్లకు చెప్పడం, తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్య చీలమండ గాయంతో ఇంకా కోలుకోలేకపోవడంతో ఎవర్ని కెప్టెన్ చేయాలనే విషయంలో బీసీసీఐ సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో రోహిత్ తప్ప మరో ఆప్షన్ లేదని భావించిన బీసీసీఐ.. హిట్ మ్యాన్ ని బతిమిలాడే పనిలో ఉంది.
 
ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియాతో టీ 20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ తర్వాత దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటించనుంది. ఇందులో భాగంగా 3 వన్డేలు,3 టి20 లతో పాటు రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం యునైటెడ్ కింగ్ డంలో ఉన్న రోహిత్.. టెస్టు సిరీస్ కు అందుబాటులో ఉంటాడు. అయితే టెస్టు సిరీస్ కు ముందు వన్డే, టీ 20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ కు రోహిత్ రెస్ట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. విదేశాల్లో మ్యాచ్ లు కాబట్టి రోహిత్ ను దక్షిణాఫ్రికాకు పంపించాలని బీసీసీఐ భావిస్తోందట.
 
ఈ మేరకు రోహిత్ తో సంప్రదింపులు జరిపి అతన్ని ఒప్పించే ప్రయత్నం బీసీసీఐ చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది. అంతేకాదు 2024 టీ20 ప్రపంచ కప్ వరకు కెప్టెన్ గా రోహిత్ బెస్ట్ అని.. అతన్ని అప్పటివరకు కెప్టెన్ గా కొనసాగించాలని బీసీసీఐ గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఈ క్రమంలో రోహిత్ ను ఒప్పించడానికి బీసీసీఐ ఒత్తిడి చేస్తుందని సమాచారం. బీసీసీఐ కార్యదర్శి జైషా, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ మధ్య గురువారం(నవంబర్ 30) కీలక చర్చలు జరగనున్నాయి.

2023 భారత్ వన్డే వరల్డ్ కప్ ఓడిపోయినప్పటికీ టోర్నీ అంతటా రోహిత్ జట్టును నడిపించిన తీరు బీసీసీఐని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే, టీ20 సిరీస్ కు రెస్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు(నవంబర్ 30) దక్షిణాఫ్రికా వెళ్లబోయే భారత జట్టును ప్రకటించనున్నారు.