బీసీలకు రూ. లక్ష సాయానికి  ఫండ్స్ సరిపడా వస్తలే

బీసీలకు రూ. లక్ష సాయానికి  ఫండ్స్ సరిపడా వస్తలే
  • యాదాద్రి జిల్లాలో ఈ నెలకు కావాల్సింది రూ. 6 కోట్లు.. వచ్చింది రూ. కోటి 
  • సూర్యాపేటకు రావలసింది రూ.12 కోట్లు.. ఇచ్చింది రూ. 18 లక్షలే 

యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : బీసీలకు రూ. లక్ష సాయానికి ఫండ్స్​ వస్తలేవు.  ఈ స్కీమ్​ కింద ఒక్కో నియోజకవర్గంలో 300  మందికి రూ. లక్ష చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచే సాయం అందిస్తామని చెప్పినా..  ఫండ్స్​ రాకపోవడంతో నెలాఖరున ప్రారంభిస్తాం అని అధికారులు అంటున్నారు. ఈనెల 30లోగా పూర్తి ఫండ్స్​ వస్తే మొదటి విడతలోని అందరికీ అందుతాయి. లేకుంటే వచ్చిన ఫండ్స్​కు తగ్గట్టుగా కొందరికే సాయం అందనుంది. 

31,105 అర్హులు.. 1746 అనర్హులు..

బీసీ కుల, చేతి వృత్తిదారులకు రూ. లక్ష సాయం అందిస్తామని బీసీ సంక్షేమ శాఖ చేసిన ప్రకటనతో యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లోని 14,959 మంది అప్లయ్​ చేసుకున్నారు. వారి నుంచి 12, 978 మందిని అర్హులుగా గుర్తించారు. సూర్యాపేట, తుంగతుర్తి, హుజూర్​నగర్​, కోదాడ నియోజకవర్గాల్లో 23,374 మంది అప్లయ్​ చేసుకోగా 4760 అప్లికేషన్లను పెండింగ్​లో పెట్టి 18,127 మందిని అర్హులుగా గుర్తించారు.    తమ అప్లికేషన్లను ఎందుకు పెండింగ్​లో పెట్టారని కొందరు, అనర్హులుగా ఎందుకు గుర్తించారో రీజన్​ చెప్పాలంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. 
యాదాద్రి, సూర్యాపేట జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో అర్హులకు రూ. 311.05 కోట్లు అందాల్సి ఉంటుంది. యాదాద్రి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఎంపికైన 12,978 మందికి రూ. 129.78 కోట్లు అవసరం. సూర్యాపేటలో నాలుగు నియోజకవర్గాల్లో రూ.181.27 కోట్లు అవసరం. 

మొత్తం రాకుంటే వచ్చిన కాడికే.. 

ఫండ్స్​ తక్కువ రావడంతో ఈ నెల 30 వరకూ వెయిట్​ చేయాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. యాదాద్రి జిల్లాకు ఇప్పటి వరకూ వచ్చిన కోటికి అదనంగా మరో రూ. 5 కోట్లు వస్తే.. 600 మందికి ఇవ్వాలని అనుకుంటున్నారు. లేని పక్షంలో డిపార్ట్​మెంట్​ ఖాతాలో ఉన్న రూ. కోటిని రెండు నియోజకవర్గాల్లో కలిపి 100 మందికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో నాలుగు మున్సిపాలిటీలు, 12 మండలాలు ఉన్నాయి.

వంద మందికే ఇవ్వాల్సి వస్తే 8 మంది చొప్పున అందించాల్సి ఉంటుంది. సూర్యాపేట జిల్లా విషయానికొస్తే మంత్రి జగదీశ్​ రెడ్డి​ స్వయంగా 18 మందికి అందించిన 18 లక్షలు తప్ప ఒక్క రూపాయి కూడా రాలేదు. ఫండ్స్​ వస్తే అందరికీ పంచుడు.. లేకుంటే వచ్చినకాడికి పంచడం తప్ప చేసేదేమీ లేదని ఆఫీసర్లు అనుకుంటున్నారు.

రూ. 18 కోట్లకు.. వచ్చింది రూ. 1.18 కోట్లే 

రెండు జిల్లాలో తొలి విడతలో గుర్తించిన వెయ్యి మందికి ఈ నెల 15న సాయం అందించాల్సి ఉండగా ఫండ్స్​ రాలేదు.   ఆలస్యంగా వచ్చిన ఫండ్స్​ను చూసి ఆశ్చర్యపోయిన ఆఫీసర్లు నెత్తి పట్టుకొని కూర్చున్నారు. యాదాద్రి జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉండగా.. 600 మందికి సాయాన్ని అందించేందుకు   రూ. ఆరు కోట్లు అవసరమైతే రూ. కోటి, సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 1200 మందికి సాయం కోసం రూ. 12 కోట్లు అవసరం అయితే రూ. 8లక్షలు వచ్చాయి.

 ఈ రూ. 18 లక్షలు కూడా మంత్రి జగదీశ్​ రెడ్డి జూన్​ 9న సంక్షేమ దినోత్సవం రోజున 18 మందికి అందించినవే. మిగిలిన వారికి రూపాయి కూడా రాలేదు. వచ్చిన అరకొర పైసలు ఎవరికి పంచాలి..ఎలా పంచాలని ఆఫీసర్లు మల్లగుల్లాలు పడుతున్నారు.