
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
కాజీపేట, వెలుగు : బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించే పార్టీలను తెలంగాణలో రాజకీయంగా బొందపెడుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం (సెప్టెంబర్ 19) కాజీపేటలోని ఫాతిమానగర్ జరిగిన బీసీల రాజకీయ మేధోమథన రాష్ట్ర స్థాయి సమావేశం బైరి రవికృష్ణగౌడ్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఉద్యోగ, విద్య, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీలో చేసిన బిల్లును రాష్ట్రపతి, అసెంబ్లీలో చేసిన చట్టాన్ని గవర్నర్ ఆమోదించాలని కోరారు. తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
నవంబర్ 9న భువనగిరిలో బీసీల రాజకీయ యుద్ధభేరి సభను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీపావళిలోగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే యుద్ధభేరి సభతో రాజకీయ పార్టీలను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 79 ఏండ్లు అయినా కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. భువనగిరిలో నిర్వహించే సభలో రాజకీయ భవిష్యత్ ఎజెండాను ప్రకటిస్తామని చెప్పారు.
సమావేశంలో కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్, బీసీ కులాల జేఏసీ అధ్యక్షుడు కుందాచారి గణేశ్‌చారి, బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుంకరి శ్రీనివాస్, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముకురాల చంద్రశేఖర్, బీసీ కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వరంగల్ శ్రీనివాస్, బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు తాటికొండ విక్రంగౌడ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనుకాల శ్యాం, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మని మంజరి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేశ్, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్ పాల్గొన్నారు.