కరోనాతో దసరా, దీపావళికి జాగ్రత్తగా ఉండాలి

కరోనాతో దసరా, దీపావళికి జాగ్రత్తగా ఉండాలి

వినాయక చవితి, ఓనమ్​ ఫెస్టివల్స్​ తర్వాత కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిందట. నాలుగు రాష్ట్రాల్లో అయితే ఇది మరింత ఎక్కువగా ఉందట. ఈ రాష్ట్రాల్లో ఫెస్టివల్​ సీజన్​ తర్వాత సగటున 50 శాతానికిపైగా కేసులు నమోదయ్యాయని ఎస్​బీఐ రీసెర్చ్​ రిపోర్ట్​లో వెల్లడైంది. ఈ లిస్ట్​లో తెలంగాణ కూడా ఉంది. మన రాష్ట్రంలో ఆగస్టు తర్వాత కరోనా కేసుల సంఖ్య 49.8 శాతం పెరిగిందని ఈ రిపోర్ట్​ చెబుతోంది. దసరా, దీపావళి సీజన్​ రానున్న నేపథ్యంలో కరోనా విషయంలో అలర్ట్ గా ఉండాలని హెచ్చరించింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళలో ఆగస్టు తర్వాత కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిందని ఎస్​బీఐ రీసెర్చ్​ రిపోర్ట్​ డేటా వెల్లడించింది. ఆగస్టు 22న వినాయకచవితి, అదే నెలలో ఓనమ్​ ఫెస్టివల్స్​ వచ్చాయి. దీంతో జనం బయట తిరగడం ఎక్కువైందని, దీని ప్రభావంతో కేసుల సంఖ్య పెరిగిందని ఈ రిపోర్ట్​ పేర్కొంది. ఈ ఫెస్టివల్స్​ తర్వాత ఏపీలో కేసుల సంఖ్య 2.93 లక్షలు పెరిగింది. మొత్తం కేసుల్లో ఇది 67 శాతం. మహారాష్ట్ర విషయానికి వస్తే ఫెస్టివల్స్​ తర్వాత 3.7 లక్షల కేసులు పెరిగాయి. మొత్తం కేసుల్లో ఇది 46 శాతం. అదే తెలంగాణ విషయం చూస్తే గణేశ్​ చతుర్థి తర్వాత 62 వేల కేసులు నమోదయ్యాయి. ఇది మొత్తం కేసుల్లో 50 శాతం వరకూ ఉంది. దేశంలో తొలి కరోనా కేసు నమోదైన కేరళలో ఓనమ్​ తర్వాత కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. దాదాపు 1.38 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది మొత్తం కేసుల్లో 65 శాతం వరకూ ఉంది. కరోనా కేసుల పెరుగుదలకు ఓనమ్​ ఫెస్టివలే కారణమని ఈ నెల మొదట్లో కేరళ సీఎం పినరయి విజయన్​ కూడా ప్రకటించారు. గోల్డ్​ స్మగ్లింగ్​ కేసుకు సంబంధించి చేపట్టిన ఆందోళనల వల్ల కూడా కరోనా కేసులు పెరిగాయని ఆరోపించారు.

ఇది మిగతా రాష్ట్రాలకు వార్నింగ్

ఈ నాలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు మిగతా రాష్ట్రాలకు హెచ్చరికలుగా మారాయి. అక్టోబర్–నవంబర్​లో మళ్లీ దసరా, దీపావళి పండుగల సీజన్​ రానుంది. దీంతో జనం మరింత ఎక్కువగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కరోనా కేసులు మరింత పెరగవచ్చని ఎక్స్​పర్ట్స్​ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘గణేశ్​ చతుర్థి, ఓనమ్​ ఫెస్టివల్స్ జరిగిన రాష్ట్రాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరిగింది. సెలబ్రేషన్స్​ కోసం జనం బయటకు రావడమే దీనికి కారణం. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనట్లయితే దసరా వేడుకల తర్వాత పశ్చిమ బెంగాల్​ లాంటి రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురుకావొచ్చు”అని ఎస్​బీఐ రిపోర్ట్​ వార్నింగ్​ ఇచ్చింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా దసరా, దీపావళి ఫెస్టివ్ సీజన్​లో కేసులు పెరగవచ్చని, అందువల్ల జనం తప్పనిసరిగా మాస్కులు అని సూచించింది. మన దేశంలో ఇప్పటి వరకూ 70 లక్షల కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 15 లక్షల కేసులు రికార్డయ్యాయి. ఎకానమీ రీ ఓపెనింగ్, ఫెస్టివ్​ సీజన్​ నేపథ్యంలో కరోనా కేసులను తగ్గించే లక్ష్యంతో జనంలో మాస్కుల వాడకం, ఫిజికల్​ డిస్టెన్స్, చేతులు కడగడంపై అవగాహన పెంచేందుకు ప్రధాని నరేంద్రమోడీ జన్​ ఆందోళన్​ క్యాంపెయిన్​ను స్టార్ట్​ చేశారు.