సత్యానికి హాని కలుగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి : డా. వైజయంతి పురాణపండ

సత్యానికి హాని కలుగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి : డా. వైజయంతి పురాణపండ

అసత్యం పలికితే దోషం కనుక, నిత్యం సత్యమే పలకాలి అనుకుంటే, అది కూడా పొరపాటే. సందర్భానుసారంగా, సత్యానికి హాని కలుగకుండా, అసత్య దోషం అంటకుండా, జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే సత్యం పలికి ప్రాణానికి ముప్పు తెచ్చుకోవలసి వస్తుంది. అందుకే...

ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కామాటలాడి యన్యుల మనముల్‌‌
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాడె ధన్యుడు సుమతీ.

ఈ సందర్భానికి తగ్గట్లుగా మనకు అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.

ఒక అరణ్యంలో మహర్షి కఠోర తపస్సు చేసుకుంటుంటేవాడు. ఒకనాడు.. ఒక దొంగ రాజభవనంలో నగలు దొంగిలించాడు. రాజభటులు వెంటాడుతుండగా, తప్పించుకుని పరుగెత్తుకుంటూ మహర్షి దగ్గర నగలు పడేసి, తనను రక్షించమని కోరుకుని, ఆశ్రమంలోకి వెళ్లి దాక్కుంటాడు. రాజభటులు మహర్షి దగ్గరకు వచ్చి, ఆ నగలు చూసి, దొంగ అక్కడికే వచ్చాడని తెలుసుకుని, ‘స్వామీ! ఆ దొంగ మీ ఆశ్రమంలో ఉన్నాడా?’ అని ప్రశ్నించారు. దొంగకు అభయం ఇచ్చాడు కనుక, నిజం చెప్పలేడు. నిజం చెప్తే, ఆ దొంగకు శిక్ష పడుతుంది. అలాగని, అబద్ధం చెబితే, తనకు అసత్య దోషం అంటుతుంది. అందుకని బాగా ఆలోచించి, ‘అయ్యా! ఆ దొంగ ఎక్కడ ఉన్నాడో నా కళ్లకు తెలుసు. కానీ, నా కళ్లు మాట్లాడలేవు. అతడు ఎక్కడ ఉన్నాడో నా నోరు చెప్పగలదు కానీ, నా నోరు ఆ దొంగను చూడలేదు. కాబట్టి నేనేమీ చెప్పలేను’ అని ఎంతో సమయస్ఫూర్తితో మాట్లాడాడు. రాజభటులు దొంగను వెతికి తీసుకొని వెళ్లిపోయారు. మహర్షికి అసత్య దోషం అంటలేదు. దొంగకు  ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. 

మరో కథ...

ఒక ఊరిలో ఒక సింహం ఉండేది. దాని దగ్గర నక్క, ఒంటె, ఎద్దు నమ్మకంగా, స్నేహంగా ఉండేవి. ఒకసారి సింహం జబ్బు పడింది. అస్సలు కదల్లేక, కొన్ని రోజుల పాటు గుహలోనే ఉండిపోయింది. ఒకరోజున సింహాన్ని పరామర్శించాలని ఎద్దు వచ్చి, సింహానికి దూరంగా కూర్చుంది. అప్పుడు సింహం, ‘వృషభరాజా! నేను చాలారోజులుగా నా నోటిని శుభ్రం చేసుకోవటం లేదు, వాసన వస్తోందా?’ అని ప్రశ్నించింది. నిజం చెప్తేనే మంచిదనుకున్న ఎద్దు, ‘అవును మృగరాజా! నీ నోరు బాగా వాసన వస్తోంది’ అని సత్యం పలికింది. సింహానికి బాగా కోపం వచ్చి, అమాంతం ఎద్దు మీద పడి, చీల్చి చంపేసింది. ఆ వెనుక ఒంటె లోపలకు వచ్చింది. సింహం మళ్లీ అదే ప్రశ్న వేసింది. అందుకు ఒంటె, జాగ్రత్తపడి, ‘ఓ రాజా! నీ నోరు అస్సలు వాసన రావట్లేదు. పైగా పరిమళాలు వెదజల్లుతోంది’ అని వినయంగా పలికింది. 

అందుకు సింహం, ‘నా నోరు కంపు కొడుతుంటే, పరిమళాలు వెదజల్లుతోందని అబద్ధం పలుకుతావా...’ అని ఒంటెను కూడా చంపేసింది. చివరగా నక్క లోపలకు వచ్చింది. అంతకుముందే విషయం తెలుసుకుని, ఒక పథకాన్ని మనసులోనే వేసుకుని, సింహం దగ్గరకు వచ్చింది. ‘నక్క బావా! నా నోరు వాసన వస్తోందా?’ అని ఎప్పటిలాగే ప్రశ్నించింది సింహం.

అందుకు నక్క, ‘రాజా! నాకు వారం రోజులుగా బాగా జలుబు చేసింది. నా ముక్కుకు ఏ వాసనలూ తెలియట్లేదు. నన్ను మన్నించండి’ అని ఎంతో వినయంగా సమాధానమిచ్చింది. సింహం సంతోషించి, తన దగ్గరున్న మాంసంలో నుంచి కొంత మాంసాన్ని నక్కకు విందుగా అందించింది. అసత్య దోషం అంటకుండా నక్క తెలివిగా సమాధానమిచ్చి, తన ప్రాణాలు రక్షించుకుంది.

*   *   *
మగధ దేశాన్ని పరిపాలించే మహారాజుకు ఒక కన్ను మాత్రమే ఉంది.  ఒకసారి తన బొమ్మను చిత్రించమని అనేకమంది చిత్రకారులకు ఆహ్వానం పంపాడు. అక్కడకు వచ్చిన ముగ్గురు చిత్రకారులు, తమకు రెండు రోజులు సమయం ఇస్తే, రాజుగారి బొమ్మను వేస్తామని పలికారు. మొదటి చిత్రకారుడు రాజుగారు ఎలా ఉంటే అలాగే ఒక్క కంటితోనే బొమ్మ వేశాడు. అది చూసిన రాజుకి కోపం వచ్చి, ‘నాకు ఒక్క కన్నే ఉందని హేళన చేస్తున్నావా, నీకు కారాగార శిక్ష విధిస్తున్నా’ అని ఆ చిత్రకారుడిని చెరసాలలో వేయించేశాడు. ఇది తెలుసుకున్న రెండవ చిత్రకారుడు, రాజుగారికి రెండు కళ్లు ఉన్నట్లు చిత్రించాడు. అది చూసిన రాజు, ‘నాకు ఒక కన్నే ఉంటే, రెండు కళ్లు వేసి, నన్ను హేళన చేస్తున్నావా’ అని ఆ చిత్రకారుడిని కూడా చెరసాలలో వేయించేశాడు. ఇది గమనించిన మూడవ చిత్రకారుడు, రాజుగారు ఒక పక్కకు తిరిగినట్లు చిత్రించాడు. అప్పుడు అందులో ఒకవైపు కన్ను మాత్రమే కనిపిస్తుంది. ఈ చిత్రకారుడి తెలివితేటలకు ముచ్చటపడిన మహారాజు, తగురీతిని సత్కరిస్తాడు. మూడవ చిత్రకారుడు లౌక్యం ప్రదర్శించి, చావు నుండి బయటపడ్డాడు. అంతేకాకుండా తోటి చిత్రకారులను చెరసాల నుండి విడిపించాడు. 

‘యదార్థవాది లోక విరోధి’ అనే నానుడి ప్రచారంలో ఉంది. అందువల్లే అవసరానికి తగ్గట్లుగా లౌక్యం ప్రదర్శించి, యదార్థానికి అంటే సత్యానికి చేటు కలుగకుండా ప్రవర్తించాలంటారు పెద్దలు.

-  డా. వైజయంతి పురాణపండ 
ఫోన్: 80085 51232