- డిసెంబర్ 9 లోపు బుమృక్తో పాటు మరో రెండు చెరువులు రెడీ
- ఇప్పటికే బతుకమ్మ కుంట ప్రారంభం
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో కబ్జాకు గురైన, కలుషితమైన చెరువులకు పూర్వ వైభవాన్ని తెస్తున్న హైడ్రా డిసెంబర్ 9లోగా మూడు చెరువులను పునరుద్ధరించి అందుబాటులోకి తేవడానికి సిద్ధమైంది. ఇప్పటికే మొదటి దశలో రూ.58 కోట్లతో బతుకమ్మ కుంట, ఉప్పల్ పెద్ద చెరువు, కూకట్‌పల్లి నల్ల చెరువు, మాదాపూర్ తుమ్మిడి కుంట, సున్నం చెరువు, ఓల్డ్ సిటీ బుమృక్ దావాల చెరువుల పునర్నిర్మాణ పనులు చేపట్టింది.
ఇందులో బతుకమ్మ కుంట పనులు పూర్తి చేయగా, సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇక బుమృక్ దావాల చెరువు, కూకట్‌పల్లి నల్లచెరువు, మాదాపూర్ తమ్మిడి కుంట చెరువు పనులు స్పీడ్‌గా కొనసాగుతున్నాయి. ఈ సుందరీకరణ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. మిగిలిన ఉప్పల్పెద్ద చెరువు, సున్నం చెరువులను డిసెంబర్ 9 తర్వాత పూర్తి చేయనున్నారు.
అడ్డుంకులను దాటుకుంటూ...
పనులు మొదలు పెట్టిన ప్రతి చెరువు వద్ద హైడ్రాకు ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. బతుకమ్మకుంట పనులు మొదలుపెట్టినప్పుడు కోర్డు కేసుతో కొన్నాళ్లు పనులు నిలిచిపోయాయి. తర్వాత అన్ని అడ్డంకులను అధిగమించి విజయవంతంగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం పనులు కొనసాగుతున్న ఓల్డ్ సిటీలోని బుమృక్ దావాల చెరువు విషయంలోనూ స్థానికులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము చెరువు పరిధిలోని భూములు కొన్నామని, పనులతో తాము నష్టాపోవాల్సి వస్తుందని హైడ్రాను ఆశ్రయించారు.
దీంతో కమిషనర్ రంగనాథ్అర్హత ఉన్నవారికి ప్రభుత్వంతో మాట్లాడి టీడీఆర్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కూకట్ పల్లి నల్లచెరువు వద్ద కూడా కూల్చివేతల సమయంలో వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ, ఇప్పుడు జరుగుతున్న పనులను చూసి స్థానికులే హైడ్రాని అభినందిస్తున్నారు. తమ్మిడికుంట వద్ద కూడా కొందరు అక్రమ వ్యాపారాలు చేస్తూ హైడ్రాను అడ్డుకున్నారు. కానీ, ఆక్రమణలను తొలగించిన అధికారులు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు.
ఒక్కొక్కటిగా పునరుద్దరణ...
మొదటి విడతలో చేపట్టిన ఆరు చెరువుల పనులు పూర్తయిన తర్వాత నగరంలో అవకాశం ఉన్న చెరువులను పునరుద్ధరించాలని హైడ్రా ప్లాన్ చేస్తోంది. ఈ విషయమై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇరిగేషన్ అధికారులుతో ఇప్పటికే హైడ్రా కమిషనర్ సమావేశమయ్యారు. దీంతో గ్రేటర్ పరిధిలోని 185 చెరువుల్లో అవకాశమున్న చెరువులను ఒక్కొక్కటిగా అప్పగించాలని బల్దియా భావిస్తోంది.
ఇప్పటికే కొన్ని చెరువులు బల్దియా సీఎస్ఆర్ కింద డెవలప్‌చేసింది. మిగతా చెరువుల్లో కొన్నింటిని హైడ్రాకు అప్పగించి పనులు చేయించాలని ప్లాన్ చేస్తోంది. ముందుగా ఆక్రమణలకు గురవుతున్న చెరువులను అప్పగించి కాపాడాలని బల్దియా భావిస్తోంది.
