
కార్తికేయ, నేహా శెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన చిత్రం ‘బెదురులంక 2012’. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా సినిమాకొస్తున్న రెస్పాన్స్ గురించి తెలియజేస్తూ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించింది టీమ్. కార్తికేయ మాట్లాడుతూ ‘ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం ఆనందంగా ఉంది. ఈ విజయం జీవితంలో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. కథ విన్న తొలి రోజు నుంచే ప్రేక్షకులకు నచ్చుతుందనుకున్నా. అలాగే వర్కవుట్ అయ్యింది.
సెకండాఫ్ అంతా నవ్వుతూ ఉన్నామని అందరూ చెబుతున్నారు. సీరియస్ విషయాన్ని వినోదంతో చెప్పడం ఇంతకు ముందు చూడలేదు. అటువంటి కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలపై మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది’ అని చెప్పాడు. క్లాక్స్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. ఇప్పుడు స్క్రీన్స్ పెంచుతున్నట్టు చెప్పడం మరింత ఆనందాన్ని ఇచ్చింది’ అన్నాడు. సినిమాను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అని చెప్పారు బెన్నీ. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దుర్గా, నటులు శ్రీకాంత్ అయ్యంగార్, రామ్ ప్రసాద్, రాజ్ కుమార్ కసిరెడ్డి పాల్గొన్నారు.