మీరు తాగే మందు బాటిళ్లలో విషముంది: సైంటిస్టులు

మీరు తాగే మందు బాటిళ్లలో విషముంది: సైంటిస్టులు
  • గ్రీన్​, బ్రౌన్​, ఎనామిల్​ బాటిళ్లలో క్రోమియం, లెడ్​, క్యాడ్మియం
  • ఆరోగ్యానికి చాలా డేంజర్​ అంటున్న బ్రిటన్​ సైంటిస్టులు

లండన్​: అన్నా.. రెండు బీర్లియ్​. అరె, గ్రీన్​ బాటిల్​ ఇయ్యరాదె! లెవ్​.. లెవ్​.. గియ్యే ఉన్నయ్​ తీసుకో. సరెలే ఏదైతేంది! ఇదీ, వైన్​ షాప్​ల దగ్గర మద్యం ప్రియులు, వైన్​ షాప్​ వాళ్లకు జరిగే సంభాషణ. కానీ, సైంటిస్టులు ఏమంటున్నరో తెలుసా.. బాటిల్​ ఏదైతేంది.. అన్నీ విషమే అయినప్పుడు అని చెబుతున్నారు. అర్థం కాలేదా..? మందుబాబులకు ఎక్కిన కిక్కును దించే షాకింగ్​ వార్త చెప్పారు. బీర్లు, విస్కీలు, వైన్లను స్టోర్​ చేసే బాటిళ్లలో విషం ఉందట. గ్రీన్​, బ్రౌన్​, ఎనామిల్​ బాటిల్​ ఏదైనా విషపు ఆనవాళ్లు ఉన్నాయట. ప్రాణాన్ని హరించే క్రోమియం, లెడ్​, క్యాడ్మియం వంటి విషపు మూలకాలున్నాయట. బ్రిటన్​లోని యూనివర్సిటీ ఆఫ్​ ప్లైమౌత్​ సైంటిస్టులు అధ్యయనం చేసి మరీ ఈ విషయాన్ని తేల్చారు. గ్రీన్​ బాటిళ్లలో క్రోమియం ఎక్కువగా ఉందని నిర్ధారించారు. అన్ని రకాల బాటిళ్లలోనూ (పారదర్శక బాటిళ్లు మినహా) 20 వేల పార్ట్స్​పర్​ మిలియన్​ (పీపీఎం) మేర క్యాడ్మియం ఉందని, అది ఆందోళన కలిగించే అంశమని అంటున్నారు.

కొన్ని వైన్​ బాటిళ్లలో అయితే 80 వేల పీపీఎం వరకూ లెడ్​ ఉన్నట్టు తేల్చారు. మామూలుగా అయితే లెడ్​కు పరిమితి కేవలం 90 పీపీఎం. వాటిని పడేసినప్పుడు, రీసైకిల్​ చేసేటప్పుడూ అవి గాల్లో కలిసే ప్రమాదమూ ఉందని, వేరే పదార్థాలకూ అంటొచ్చని హెచ్చరించారు. ‘‘మనం రోజూ వాడే వస్తువుల్లో ఇంత పెద్ద మొత్తంలో విష పదార్థాలుండడం ఆశ్చర్యం, ఆందోళన కలిగించే విషయం. ప్రత్యామ్నాయాలున్నప్పుడు ఇలాంటి హానికారక బాటిళ్లను వాడడం మంచిదికాదు. అంతేకాదు, వాటిని పారేసినప్పుడు రోజులు గడిచే కొద్దీ వాటిలోని విష పదార్థాలు నేల, ఇతర పదార్థాల్లోకి చేరే ప్రమాదం ఉంది” అని స్టడీకి నేతృత్వం వహించిన సైంటిస్ట్​ డాక్టర్​ ఆండ్రూ టర్నర్​ చెప్పారు. ప్రయోగం కోసం బీరు, వైన్​, విస్కీలకు వాడే రంగు రంగుల బాటిళ్లను కొనుగోలు చేశారు. వాటిని ఎక్స్​రే ఫ్లోరోసెన్స్​ స్పెక్ట్రోమెట్రీ (ఎక్స్​ఆర్​ఎఫ్​) ద్వారా వాటిలోని మూలకాలను విశ్లేషించారు. అన్ని గ్రీన్​ బాటిళ్లలో క్రోమియం ఉందని తేల్చారు. బ్రౌన్​బాటిళ్లలో 40 శాతం ఉందని గుర్తించారు.