
ఇక రోజుల వ్యవధిలోనే క్యాలెండర్ మారిపోనుంది. 2024 సంవత్సరం రంగ ప్రవేశం చేయనుంది. కొత్త వత్సరానికి ఆహ్వానం పలికేందుకు అంతా సిద్ధమవుతున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం కొన్ని కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చేందుకు ప్రణాళిక రచించింది. అందుకే కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే లోపే అంటే డిసెంబర్ 31లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటిల్లో ఆర్థికపరమైన అంశాలు కూడా ఉన్నాయి. డిసెంబర్ 31లోపు పూర్తి చేయాల్సిన ఆర్థిక పనుల చెక్‌లిస్ట్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. .
బ్యాంక్ లాకర్ ఒప్పందం..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం, సేఫ్ డిపాజిట్ లాకర్ల కోసం కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులు తమ బ్యాంకులతో కొత్త ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. కస్టమర్లు అద్దె చెల్లించినంత కాలం మాత్రమే లాకర్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఒప్పందానికి గడువు డిసెంబర్ 31తో ముగుస్తోంది.
సిమ్ కార్డుల కోసం పేపర్ కేవైసీ ఉండదు..
మొబైల్ ఫోన్ వినియోగదారులు 2024 మొదటి రోజున పేపర్ ఫారమ్‌లను పూరించకుండానే కొత్త సిమ్ కార్డ్‌లను పొందగలరు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ) నోటిఫికేషన్ ప్రకారం.. పేపర్ ఆధారిత నో యువర్-కస్టమర్ (కేవైసీ) ప్రక్రియ జరుగుతుంది. జనవరి 1 నుంచి ఇది తీసివేయబడుతుంది. అంటే ఎటువంటి పేపర్ అవసరం లేకుండానే బయోమెట్రిక్ అథంటికేషన్ సాయంతో కేవైసీ పూర్తవుతుంది
డీమ్యాట్ ఖాతాదారులు నామినేషన్ సమర్పించడం, ఇన్ యాక్టివ్ యూపీఐ ఐడీలను డిలీట్ చేయడం, బ్యాంక్ లాకర్ల అగ్రిమెంట్ ను రెన్యూవల్ చేయడం, సిమ్ కార్డుల కోసం పేపర్ లెస్ కేవైసీ సమర్పించడం వంటివి చేయాల్సి ఉంది.
ఆలస్యం అయిన ఐటీఆర్ ఫైలింగ్ గడువు..
2022-23 ఆర్థిక సంవత్సరానికి పెనాల్టీ రుసుముతో ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయడానికి చివరి తేదీ కూడా డిసెంబర్ 31. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం, గడువు తేదీకి ముందే రిటర్న్‌లను ఫైల్ చేయడంలో విఫలమైన వ్యక్తులు కొంత ఆలస్య రుసుముతో ఐటీఆర్ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఆలస్య రుసుము రూ. 5,000 వరకూ ఉంటుంది. మీ మొత్తం ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువగా ఉన్న పన్ను చెల్లింపుదారులు రూ.1,000 పెనాల్టీని మాత్రమే చెల్లించాలి.
డీమ్యాట్ ఖాతాదారులు, మ్యూచువల్ ఫండ్ నామినేషన్లు..
సెప్టెంబర్ 26న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఇప్పటికే ఉన్న డీమ్యాట్ ఖాతాదారులకు నామినేషన్ దాఖలు చేసేందుకు మూడు నెలల పాటు డిసెంబర్ 31, 2023 వరకు పొడిగించింది. అలాగే పాన్ కార్డు సమర్పణ, నామినేషన్, కాంటాక్ట్ వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, సంబంధిత ఖాతాల్లో సంతకాలను సమర్పించడానికి కూడా డిసెంబర్ 31 వరకూ సెబీ అవకాశం కల్పించింది.
ఇన్ యాక్టివ్ యూపీఐ ఐడీలు..
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నవంబర్ 7 నాటి సర్క్యులర్‌లో, ఒక సంవత్సరం కంటే ఎక్కువ యాక్టివ్‌గా లేని యూపీఐ ఐడీలు, నంబర్‌లను డీయాక్టివేట్ చేయాలని చెల్లింపు యాప్‌లు, బ్యాంకులను కోరింది. ప్రతి బ్యాంక్, థర్డ్-పార్టీ యాప్ వీటిని డిసెంబర్ 31 లోపు చేయాల్సి ఉంటుంది.