రెండు కాళ్లు కోల్పోయిన స్టూడెంట్

రెండు కాళ్లు కోల్పోయిన స్టూడెంట్

బెల్లంపల్లిలో ప్రమాదం
వినికిడి సమస్యతో గమనించని బాధితుడు పరిస్థితి విషమం 

బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కాల్టెక్స్ ఫ్లైఓవర్ కింద రైలు పట్టాలు దాటుతున్న ఓ ఎం ఫార్మసీ స్టూడెంట్​ను  రైలు ఢీకొనడంతో రెండు కాళ్లు కోల్పోయాడు. సోమవారం ఉదయం10:30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో బాధితుడి ఎడమ కాలు మోకాళ్ల వరకు తెగిపోగా, కుడికాలు పాదం వరకు కట్ అయ్యింది. వినికిడి సమస్యతో గమనించక పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. బెల్లంపల్లి మండలం మాలగూరిజాల గ్రామానికి చెందిన గోమాస క్రాంతికుమార్ కాల్టెక్స్ ఫ్లై ఓవర్ కింద నుంచి రైలు పట్టాలు దాటుతూ కాల్ టెక్స్ లోని స్టేట్​బ్యాంక్​ ఆఫ్​ ఇండియాకు వెళ్తున్నాడు.

ఈ క్రమంలో బెల్లంపల్లి నుంచి ఢిల్లీ వెళ్తున్న తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో క్రాంతి కుమార్ రెండు కాళ్లు కోల్పోయాడు. స్థానికులు బెల్లంపల్లి జీఆర్పీ రైల్వే పోలీస్ కానిస్టేబుల్ రషీద్ కు సమాచారం ఇవ్వగా, అతడు క్రాంతి కుమార్ ను బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానాకు తరలించాడు. సీరియస్​గా ఉండడంతో అక్కడి నుంచి మంచిర్యాలలోనీ ఓ ప్రైవేటు దవాఖానాకు తీసుకువెళ్లారు. పేద దళిత కుటుంబానికి చెందిన క్రాంతికుమార్ కు  ప్రభుత్వం పూర్తి స్థాయి వైద్య సేవలందించి ఆదుకోవాలని బీజేపీ బెల్లంపల్లి అసెంబ్లీ నియోజక వర్గ ఇన్​చార్జి కొయ్యాల ఏమాజీ డిమాండ్ చేశారు.