గెలిపించండి.. ప్రజలకు అండగా ఉంటా : గడ్డం వినోద్

గెలిపించండి..  ప్రజలకు అండగా ఉంటా : గడ్డం వినోద్
  • బీఆర్ఎస్ లీడర్ల మోసపూరిత హామీలు నమ్మొద్దు
  • బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ 

బెల్లంపల్లి, వెలుగు : తన తండ్రి, మాజీ కేంద్ర మంత్రి దివంగత వెంకటస్వామి ఆశయాలకు అనుగుణంగా ప్రజలు, కార్మికుల కోసం పనిచేస్తానని ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని రాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలను అభ్యర్థించారు. మంగళవారం లీడర్లు, కార్యకర్తలతో కలిసి పట్టణంలోని 6వ వార్డు సుభాష్ నగర్, బూడిదిగడ్డ బస్తీతోపాటు పలు కాలనీల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ యువ నేత ఎలుక ఆకాశ్ ఆధ్వర్యంలో 50 మంది యవకులు కాంగ్రెస్ లో చేరగా వారికి వినోద్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచాక బెల్లంపల్లిలోనే నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటానన్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాదిరిగా భూ కబ్జాలు చేయనని, ప్రజలకు అండగా ఉంటానన్నారు. రెండు సార్లు గెలిచిన చిన్నయ్య ఏనాడూ ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ లీడర్లు చెప్పే మోసపూరిత హామీలను నమ్మొద్దని ప్రజలను కోరారు. బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీలో ముస్లింలు నిర్వహించిన గ్యార్మి వేడుకల్లో పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.

వినోద్​ను గెలిపించుకుందాం

బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గడ్డం వినోద్​ను ప్రజలు ఆశీర్వదించి గెలిపించుకోవాలని మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు, టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య ఓటర్లను కోరారు. మంగళవారం ఉదయం బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో భవన నిర్మాణ కార్మికులను కలిసి వినోద్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడంతో పాటు, వారికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా, అన్ని బెనిఫిట్స్ ఇప్పిస్తామని తెలిపారు. కాంగ్రెస్ తోనే బెల్లంపల్లి నియోజకవర్గం అభివద్ధి జరుగుతుందన్నారు.