ఖమ్మం జిల్లాలో జోరుగా బెల్ట్​ దందా!

ఖమ్మం జిల్లాలో జోరుగా బెల్ట్​ దందా!
  • కోడ్’ ఉన్నా ఉమ్మడి జిల్లాలో ఆగని అక్రమ మద్యం అమ్మకాలు
  • తనిఖీలు చేస్తున్నా తగ్గేదేలేదన్నట్లుగా వ్యాపారుల తీరు.. 
  • కొందరు అధికారులే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కోడ్​ అమలులో ఉన్నా అక్రమ మద్యం అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా, పోలీసులు, టాస్క్​ ఫోర్స్​ సిబ్బంది తనిఖీలు చేస్తున్నా బెల్ట్​షాపుల నిర్వహణ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఖమ్మం జిల్లాలో  122, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 88  వైన్​ షాపులు ఉన్నాయి. వీటికి వైరాలోని ఐఎంఎల్​ డిపో నుంచి స్టాక్​ సరఫరా అవుతోంది. మద్యం లైసెన్స్​లు పొందిన షాపుల నుంచే ఆయా గ్రామాల్లోని బెల్ట్ షాపులకు మద్యం సరఫరా జరుగుతున్నట్లు తెలుస్తోంది. గ్రామంలో జనాభాను బట్టి 5 నుంచి 10కి పైగా బెల్టు షాపులు ఉంటున్నాయి. 

తూతూ మంత్రంగా దాడులు.. 

వైన్ షాపులకు ఇచ్చిన నెలవారీ అమ్మకాల టార్గెట్ ను రీచ్​ అయ్యేందుకు బెల్ట్ షాపుల సంస్కృతిని ఆఫీసర్లే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన టైంలో ఎక్సైజ్, పోలీస్ అధికారులు కొంత హడావుడి చేస్తున్నారు. కొన్ని బెల్ట్ షాప్​లను మూసివేయిస్తున్నా మరికొందరికి కొందరు అధికారులే అండగా ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. తనిఖీలకు వచ్చే ముందు వారికి సమాచారం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్ ఉన్న పాల్వంచ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ ఉన్న కొత్తగూడెంతో పాటు ఇల్లెందు, మణుగూరు, టేకులపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, చర్ల, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బెల్ట్ షాపుల జోరు కొనసాగుతోంది. పాల్వంచ. టేకులపల్లి, ఇల్లెందు, చర్ల లాంటి ప్రాంతాల్లో బహిరంగంగానే బెల్ట్ షాపులు నడుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పట్టుబడిన మద్యం.. నమోదైన కేసులు.. 

ఇటీవల ఖమ్మం జిల్లాలోని పట్టణాల్లో, గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి జిల్లాలోని 200 బెల్ట్ షాపులు బంద్​ చేయించామని, నిర్వాహకులపై కేసులు కూడా నమోదు చేశామని అధికారులు చెబుతున్నారు. కోడ్​ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పోలీసులు, ఎక్సైజ్​ శాఖ అధికారులు కలిసి 391 మందిపై 325 కేసులు నమోదు చేశారు. రూ.3 లక్షలకు పైగా విలువైన 3,144 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. 

ఎన్నికల కోడ్​ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 12 వేల లీటర్ల మద్యం పట్టుబడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రోజుకారోజు మద్యం పట్టివేత, బెల్ట్ షాపులు ఎన్ని మూసివేశామనే వివరాలను మీడియాకు రిలీజ్ చేసేవారు. కానీ ఈ సారి అటువంటిది అడపాదడపా మాత్రమే ప్రకటిస్తూ మమ అనిపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

తనిఖీలు చేస్తున్నాం..

ఖమ్మం జిల్లాలో బెల్ట్ షాపులపై పూర్తి నిఘా పెట్టాం. ఇప్పటి వరకు 200 కు పైగా కేసులు నమోదు చేశాం. బాధ్యులను బైండోవర్లు కూడా చేస్తున్నాం. గతేడాది ఏప్రిల్ తో పోలిస్తే, ఈసారి రెండు రెట్లు, మూడు రెట్లు ఎక్కువ స్టాక్​ కొనుగోలు అయితే వాటికి గల కారణాలు తెలుసుకుని చర్యలు చేపడుతాం. 

నాగేంద్రరెడ్డి, జిల్లా ఎక్సైజ్​ అధికారి