IND vs ENG 3rd Test: ఇరగదీసిన ఇంగ్లాండ్.. హోరాహోరీగా రాజ్ కోట్ టెస్ట్

IND vs ENG 3rd Test: ఇరగదీసిన ఇంగ్లాండ్.. హోరాహోరీగా రాజ్ కోట్ టెస్ట్

రాజ్ కోట్ టెస్టులో ఇంగ్లాండ్ దూకుడు చూపిస్తోంది. బజ్ బాల్ ఆట తీరుతో దుమ్ము రేపుతుంది. భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తూ టెస్టును ఆసక్తికరంగా మార్చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 445 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ మెరుపు సెంచరీతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. క్రీజ్ లో డకెట్(133) తో పాటు, రూట్ (9) ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 238 పరుగులు వెనకబడి ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ దూకుడు చూస్తుంటే మ్యాచ్ లో పైచేయి సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. 

వికెట్ నష్టానికి 33 పరుగులతో మూడో సెషన్ ప్రారంభించిన ఇంగ్లాండ్ లంచ్ తర్వాత మరింత దూకుడు పెంచింది. ముఖ్యంగా ఓపెనర్ డకెట్ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. ఓ వైపు క్లాసికల్ ఆటతో.. మరోవైపు రివర్స్ స్వీప్ లతో భారత బౌలర్లను ఉతికారేశాడు. తొలి వికెట్ కు క్రాలి(15)తో 89 పరుగుల భాగస్వామ్యం.. రెండో వికెట్ కు పోప్(39)తో 93 పరుగుల కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఈ క్రమంలో 88 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సమయంలో డకెట్ కు జత కలిసిన రూట్(5) మరో వికెట్ పడకుండా రోజును ముగించారు.  

ఇంగ్లాండ్ బ్యాటర్ల ధాటికి మన స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, జడేజా 7కు పైగా పరుగులు సమర్పించుకున్నారు. భారత బౌలర్లలో సిరాజ్, అశ్విన్ తలో వికెట్ తీసుకున్నారు. అంతక ముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (131), జడేజా (112) తొలి రోజే సెంచరీలు చేసి భారత్ ను పటిష్ట స్థితిలో నిలిపారు. తొలి టెస్ట్ ఆడుతున్న సర్ఫరాజ్ అర్ధ సెంచరీతో మెరవగా.. జురెల్ 46 పరుగులు చేసి రాణించాడు.