కట్టిన ఇండ్లు ఎందుకిస్తలే

కట్టిన ఇండ్లు ఎందుకిస్తలే
  • హైదరాబాద్​ కట్టెలమండిలో జనం ఆందోళన
  • పదిరోజుల కింద డబుల్​ బెడ్రూం ఇండ్లలోకి ప్రవేశం
  • ఖాళీ చేయించేందుకు వచ్చిన పోలీసులు, ఆఫీసర్లు
  • అడ్డుకున్న జనం.. తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్​, వెలుగు: డబుల్​ బెడ్రూం ఇండ్లు కేటాయించకపోవడంతో లబ్ధిదారులు తిరగబడుతున్నారు. తమ గుడిసెలు ఖాళీ చేయించి, జాగలు తీసుకొని ఏండ్లకేండ్లు గడుస్తోందని, ఇంకా ఎన్నేండ్లు ఎదురుచూడాలని మండిపడుతున్నారు. వేలకు వేల రూపాయలు కట్టి కిరాయి ఇండ్లల్లో ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్​లోని కట్టెలమండిలో కట్టిన డబుల్​ బెడ్రూం ఇండ్లను  కేటాయించకపోవడంతో పదిరోజుల కింద  లబ్ధిదారులు ఇండ్లలోకి వెళ్లారు. గురువారం సాయంత్రం భారీగా పోలీసులు, ఆఫీసర్లు అక్కడికి చేరుకొని, ఇండ్లు ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులను, ఆఫీసర్లను లబ్ధిదారులు అడ్డుకున్నారు. పోలీసుల వాహనానికి అడ్డంగా కూర్చొని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ఇండ్లను వేరేవాళ్లకు అమ్మేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.  
18 చోట్ల ప్రారంభిస్తే.. 10 చోట్ల ఇదే పరిస్థితి
హైదరాబాద్​లో ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో డబుల్​ బెడ్రూం ఇండ్లను ప్రారంభించగా.. ఇందులో 10 ప్రాంతాల్లో ఒక్కో చోట ఒక్కో విధంగా కొన్ని  ఇండ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా ఖాళీగా ఉంచారు. ఐడీఎఫ్​సీ కాలనీ, ఎరుకల నాంచరమ్మ బస్తీ, చిత్తారమ్మ బస్తీ , సింగంచెరువు తాండ, నాచారం, కిడికి బూద్ ఎలిసా,  సయ్యద్ సాబ్ కా బాడ,  జీయాగూడ,  కట్టెలమండి, గోడెఖీకబర్, లంబడితాండ,  వనస్థలిపురం, గాంధీనగర్,​ కంటోన్మెంట్‌‌లోని సాయిరాంనగర్​, అంబేద్కర్ నగర్,  పొట్టిశ్రీరాములు నగర్, జీవై రెడ్డి నగర్, గొల్ల కొమరయ్య నగర్​ ప్రాంతాల్లో డబుల్​ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. వీటిలోని 4,175 డబుల్​ బెడ్రూం ఇండ్లు ఉండగా.. దాదాపు వెయ్యి ఇండ్లను కేటాయించకుండా ఖాళీగా ఉంచారు. అత్యధికంగా జియాగూడలో 200 లకుపైగా ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆరేండ్లుగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు ఓపిక నశించి..  తాళాలను తీసేసి డబుల్​ బెడ్రూం ఇండ్లలోకి వెళ్తున్నారు. 
డబుల్​ బెడ్రూం ఇండ్ల కోసం 
ఆరేండ్ల కింద ఖాళీ చేసి..
డబుల్​ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నాంపల్లిలోని కట్టెలమండిలోని పేదలు ఆరేండ్ల కింద తమ గుడిసెలను ఖాళీ చేసి జాగలను ప్రభుత్వానికి ఇచ్చారు. వాళ్లంతా స్థానికంగా వేలకు వేల రూపాయలు కట్టి కిరాయి ఇండ్లల్లో ఉంటున్నారు. ఏడాది కింద ఇక్కడ 126 డబుల్​ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తవగా.. కొందరికి కేటాయించారు. మిగతావారికి రేపోమాపో అంటూ అధికారులు దాట వేస్తున్నారు. తమ ఇండ్లు తమకు కేటాయించాలని లబ్ధిదారులు ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉంటలేదు. దీంతో పదిరోజుల కింద 14 మంది లబ్ధిదారులు  తాళాలు పగులగొట్టి డబుల్​ బెడ్రూం ఇండ్లలోకి వెళ్లారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వారిని ఖాళీ చేయించేందుకు గురువారం సాయంత్రం పోలీసులతో అక్కడికి వచ్చారు. వారిని లబ్ధిదారులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆరేండ్ల నుంచి గుడిసెలు ఖాళీ చేసి కిరాయి ఇండ్లలో ఉంటున్నామని, డబుల్​ బెడ్రూం ఇండ్లు ప్రారంభించి ఏడాదవుతున్నా  ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కొందరికి ఇచ్చి ఇంకొందరికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇండ్లను అమ్ముకునేందుకు ఆఫీసర్లు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. 15 రోజుల్లో విచారించి అర్హులైన వారికి డబుల్​ బెడ్రూం ఇండ్లను అందిస్తామని ఆర్డీవో  జి.వెంకటేశ్వర్లు హామీ ఇవ్వడంతో వారు శాంతించి.. ఇండ్లను హ్యాండోవర్​ చేసేందుకు ఒప్పుకున్నారు. 
మా ఇండ్లు మాక్కావాలె
చాలా ప్రాంతాల్లో డబుల్​ బెడ్రూం ఇండ్లను ఇవ్వడంలేదంటూ లబ్ధిదారులు ఆందోళనకు దిగుతున్నారు. గతంలో 30, 40 గజాల్లో గుడిసెలు వేసుకొని ఉన్నా సంతోషంగా ఉండేవాళ్లమని, ఆరేండ్లుగా కిరాయిలు చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నామని అంటున్నారు. ఇండ్లను ప్రారంభించిన సమయంలో త్వరలో ఇస్తామని చెప్తున్నారు తప్ప ఇవ్వడం లేదని, అందుకనే తమ ఇండ్లలో తాము ఉందామని తాళాలు పగులగొట్టి ఇండ్లలోకి వచ్చామని కట్టెలమండి వాసులు తెలిపారు. 

అర్హులైతే 15 రోజుల్లో ఇస్తం
కట్టెలమండి డబుల్​ బెడ్రూం ఇండ్లలో ఖాళీ ఉన్న 14 ఇండ్లను అర్హులైన వారికి ఇస్తం. కలెక్టర్ తో మాట్లాడి విచారణ జరిపించి లబ్ధిదారులకు అందజేస్తం. ప్రభుత్వ ప్రాపర్టీల్లో అనుమతులు లేకుండా తాళాలు పగలగొట్టి ఆక్రమించి ఉంటున్నందుకే ఖాళీ చేయిస్తున్నం. ఇల్లీగల్​గా తాళం తీసి ఉండటం నేరం.                                    - జి.వెంకటేశ్వర్లు,   ఆర్డీవో, హైదరాబాద్