తాళాలు పగులగొట్టి గృహ ప్రవేశం చేసిన.. డబల్ బెడ్రూం బాధితులు

తాళాలు పగులగొట్టి గృహ ప్రవేశం చేసిన.. డబల్ బెడ్రూం బాధితులు
  • ఉన్న ఇండ్లు కూల్చిన్రు.. కొత్త ఇండ్లు ఇస్తలేరు
  • వంటా వార్పు చేసి.. తాళాలు పగుల గొట్టి గృహ ప్రవేశం చేసి నిరసన
  • మెదక్ జిల్లా వెల్దుర్తిలో ఘటన

మెదక్ (వెల్దుర్తి), వెలుగు: రోడ్డు వెడల్పు కోసం ఇండ్లు, షాపులు కూలగొట్టిన్రు. బాధితులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు శాంక్షన్ చేస్తమన్నారు. స్వయంగా సీఎం హామీ ఇచ్చిండు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయి మూడేండ్లకు పైగా అయితుంది. కానీ వాటిని అలాట్ చేస్తలేరు. ఆఫీసర్లకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకుంటలేరు. దీంతో ఆగ్రహించిన బాధితులు డబుల్ బెడ్రూం ఇండ్ల తాళాలు పగలగొట్టి గృహ ప్రవేశాలు చేయగా పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. మెదక్​ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో బుధవారం జరిగిన ఈ ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.
నెరవేరని సీఎం హామీ 
మెదక్​ జిల్లా నర్సాపూర్​ నుంచి వెల్దుర్తి మీదుగా తూప్రాన్ వరకు ఉన్న సింగిల్ రోడ్డును డబుల్​రోడ్డుగా నాలుగేళ్ల క్రితం విస్తరించారు. ఇందులో భాగంగా వెల్దుర్తి పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇండ్లు, షాపులను తొలగించారు. మొదట్లో తాము రోడ్డున పడతామంటూ ఇండ్లు, షాపుల ఓనర్లు కూల్చివేతకు ఒప్పుకోలేదు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి జోక్యం చేసుకుని ఇండ్లు, షాపులు కోల్పోయే 65 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు శాంక్షన్ చేస్తామని చెప్పి రోడ్డు విస్తరణకు ఒప్పించారు. అంతేగాక స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బాధితులను సీఎం కేసీఆర్‌‌ వద్దకు తీసుకెళ్లారు. ఇండ్లు, షాపులు కోల్పోయే వారందరికీ న్యాయం చేస్తామని సీఎం కూడా వారికి హామీ ఇచ్చారు. 
5 కోట్లతో 100 ఇండ్లు కట్టినా..
డబుల్​బెడ్రూం స్కీంలో భాగంగా ప్రభుత్వం వెల్దుర్తికి 100 ఇండ్లు శాంక్షన్​ చేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్​శాఖ ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. రూ. 5 కోట్లతో ఇండ్ల నిర్మాణం పూర్తి చేశారు. దీంతో తమకు అలాట్​ చేస్తారని రోడ్డు విస్తరణలో ఇండ్లు, షాప్​లు కోల్పోయినవారు ఆశించారు. అయితే మూడేండ్లు అవుతున్నా ఇండ్లను ఎవరికీ అలాట్​చేయలేదు. లీడర్లు, ఆఫీసర్లకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో బాధితులు బుధవారం మూకుమ్మడిగా డబుల్​బెడ్రూం ఇండ్ల వద్దకు చేరుకున్నారు. తామే గృహప్రవేశాలు చేస్తామంటూ 35 ఇండ్ల తాళాలు పగలగొట్టారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. అలాట్​ చేయకుండా ఇండ్లలోకి ప్రవేశించరాదని అన్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఎంత నచ్చజెప్పినా బాధితులు వినిపించుకోకుండా అక్కడే వంటావార్పు చేపట్టారు. తహసీల్దార్​ సురేష్ కుమార్ బాధితుల వద్దకు వచ్చి చర్చలు జరిపే ప్రయత్నం చేయగా వినిపించుకోలేదు. ఎంపీపీ స్వరూప నరేందర్​రెడ్డి, జడ్పీటీసీ రమేష్​ గౌడ్​ వచ్చి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి 15 రోజుల్లో పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు. విషయం తెలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నర్సాపూర్​ సెగ్మెంట్​ఇన్​చార్జి  సింగాయిపల్లి గోపి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్​గౌడ్ వెల్దుర్తికి వచ్చారు.  బాధితులతో మాట్లాడారు. ఈ నెల 30 లోగా వారికి ఇండ్లు అలాట్​చేయకుంటే తామే దగ్గరుండి గృహప్రవేశాలు చేయిస్తామన్నారు.