కేసీఆర్ ఇలాకాలో డబుల్ బెడ్ రూమ్ లొల్లి

కేసీఆర్ ఇలాకాలో డబుల్ బెడ్ రూమ్ లొల్లి

సిద్దిపేట, వెలుగు : జిల్లాలోని గజ్వేల్, హుస్నాబాద్ ​మున్సిపాలిటీల్లో డబుల్​ బెడ్ రూమ్​ ఇండ్ల లొల్లి నడుస్తోంది. అనర్హులకే ఇండ్లు ఇస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇటీవల విడదల చేసిన జాబితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. సీఎం ఇలాకలో ఇండ్ల కోసం రోడ్డెక్కుతున్న లబ్ధిదారులకు ప్రతిపక్షాలు మద్దతుగా నిలుస్తున్నాయి. 

రాజకీయ ఒత్తిళ్లే కారణం!

గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపాలిటీల్లో రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల జాబితాల్లో అనర్హులకు చోటు దక్కిందనే చర్చ నడుస్తోంది. రెండో చోట్ల జిల్లా అధికారుల నేతృత్వంలో సర్వే చేశామని చెబుతున్నా వాస్తవానికి  క్షేత్ర స్థాయిలో కింది స్థాయి సిబ్బందే నిర్వహించినట్టు తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులు తమకు నచ్చిన వారికే ఇండ్లు వచ్చే విధంగాచూశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీఎం ఇలాకాలో రగడ షురూ.. 

సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాలిటీలో డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్ల జాబితా విడుదల చేసిన గంటల వ్యవధిలోనే అర్హులైన పేదలు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం గమనార్హం. నిన్న, మొన్నటి దాకా ఇండ్లు ఇస్తారనే ఆశతో ఉన్న పేదలకు జాబితాను చూసి ఒక్కసారిగా ఆందోళనలకు దిగడంతో రగడ మొదలైంది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 1250 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు. వీటిలో గతంలో పట్టణంలో రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన 132 మందికి కేటాయించారు. మిగతా ఇండ్లకు లబ్ధిదారుల ఎంపికలో భాగంగా 3512 దరఖాస్తులు స్వీకరించారు. వాటిలో అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ఆరు జిల్లాస్థాయి అధికారుల టీమ్​తో  సర్వే చేశారు. అర్హులైన 1118 మంది పేర్లతో లిస్టును ప్రకటించారు. కానీ ఆ జాబితాలో అనర్హులకే చోటు దక్కిందంటూ పేదలు రోడ్డెక్కారు. అయితే దాదాపు రెండేండ్లపాటు సర్వే పేరిట కాలయాపన చేసి జాబితాలు విడుదల చేసిన తరువాత అభ్యంతరాల నేపథ్యంలో అధికారులు మాట మర్చి డ్రాప్ట్ జాబితాగా పేర్కొంటుండటం గమనార్హం. ఇదిలా వుంటే ఈ లిస్టుపై అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్టు గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ విద్యాదర్ తెలిపారు. 

రీ సర్వే చేసిన్రు కానీ.. 

హుస్నాబాద్ మున్సిపాలిటీకి 520 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం 1426 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడతగా 280  ఇండ్ల పంపిణీ కోసం 489 మందితో రెండు నెలల కింద అధికారులు జాబితా విడుదల చేశారు. దీనిపై వచ్చిన అభ్యంతరాలతో అధికారులు 15 రోజుల కిందటే రీ సర్వేను పూర్తి చేసినా ఇంకా ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదు. ఈ విషయంపై  హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య మాట్లాడుతూ విడుదల చేసిన జాబితాలో అనర్హులకు చోటు దక్కిందనే అభ్యంతరాల నేపథ్యంలో ఐదు టీమ్ లతో రీ సర్వేపూర్తి చేసినట్టు తెలిపారు. వివరాలను కలెక్టర్ కు నివేదించామని, అక్కడి నుంచి ఆదేశాలు రాగానే అర్హులకు ఇండ్లను పంపిణీ చేస్తామన్నారు. 

పేదల పక్షాన నిలుస్తున్న ప్రతిపక్షాలు

అనర్హులకు ఇండ్లు కేటాయించడంతో పేదల పక్షాన ప్రతిపక్ష పార్టీల నాయకులు నిలిచి ఆందోళనకు దిగుతున్నాయి. హుస్నాబాద్ లో విడుదల చేసిన జాబితాలపై సీపీఐ నేతలు సర్వే నిర్వహించి 50 శాతం వరకు అనర్హులకు ఇండ్లు కేటాయించారని నిర్ధారించారు. లబ్ధిదారులతో కలిసి ఆందోళనలు చేస్తున్నారు. గజ్వేల్​లో కాంగ్రెస్ తోపాటు ఇతర రాజకీయ పార్టీల నాయకులు పేదలకు అండగా న్యాయం జరిగే వరకూ పోరాడుతామని స్పష్టం చేస్తున్నారు.

అద్దెకు ఉంటున్నం.. ఇల్లు ఇయ్యాలె 

గజ్వేల్​లో 20 ఇండ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నం. డబుల్​ బెడ్ రూమ్ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు వివరాలు సేకరించిన్రు. కానీ లిస్టులో పేరు లేదు. నా భర్త వీధుల్లో పల్లీలు అమ్మి కుటుంబాన్ని పోషిస్తున్నడు. మాకు సర్కారు ఇల్లు ఇస్తే కొంత ఆసరా అయితది. 
-జమాల్ పూర్ గీత, గజ్వల్​మున్సిపాలిటీ 

ఏండ్ల సంది ఎదురుచూస్తున్నం.. 

నాకు సర్కారు ఇచ్చే ఇల్లు కోసం అన్ని అర్హతలు ఉన్నయి. ఏండ్ల సంది ఎదురు చూస్తున్న. ఇంకా ఇల్లు ఇస్తలేరు. ఇప్పుడు కూడా లిస్టులో నా పేరు లేదని చెబుతున్రు. కూలి చేసుకుంటూ బతుకుతున్న. మాకు ఇల్లు ఇచ్చి న్యాయం చేయాలె. 
- లక్ష్మి, హుస్నాబాద్ మున్సిపాలిటీ