ప‌శ్చిమ బెంగాల్ లో అంఫాన్ విల‌యం.. రూ. ల‌క్ష కోట్లు న‌ష్టం: మ‌మ‌తా బెన‌ర్జీ

ప‌శ్చిమ బెంగాల్ లో అంఫాన్ విల‌యం.. రూ. ల‌క్ష కోట్లు న‌ష్టం: మ‌మ‌తా బెన‌ర్జీ

ప‌శ్చిమ బెంగాల్ లో అంఫాన్ తుపాన్ పెను విల‌యం సృష్టించింద‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. త‌న జీవితంలో ఇంత‌టి విధ్వంస‌క‌ర‌ ప్ర‌కృతి విప‌త్తును చూడ‌లేద‌ని, రాష్ట్రంలో దాదాపు రూ.ల‌క్ష కోట్ల మేర న‌స్టం జ‌రిగింద‌ని ఆమె చెప్పారు. ఈ క్లిష్ట ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు కేంద్ర ప్ర‌భుత్వం త‌మ‌కు చేయూత‌గా నిల‌వాల‌ని కోరారు. అంఫాన్ సృష్టించిన విధ్వంసంపై స్వ‌యంగా తెలుసుకునేందుకు ప్ర‌ధాని మోడీ శుక్ర‌వారం ఆ రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మ‌మ‌తా బెన‌ర్జీతో క‌లిసి ఆయ‌న ఏరియ‌ల్ స‌ర్వే చేశారు.

తుఫాన్ దెబ్బ‌కు తీవ్రంగా న‌ష్ట‌పోయిన ప్రాంతాల‌ను హెలికాప్ట‌ర్ నుంచి వీక్షించారు. ఆ త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్క‌ర్, సీఎం మమ‌తా బెన‌ర్జీల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు ప్ర‌ధాని మోడీ. ఈ భేటీలో తుఫాన్ వ‌ల్ల జ‌రిగిన న‌ష్టాన్ని వివ‌రించారు మ‌మ‌తా బెన‌ర్జీ. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విప‌త్తు కార‌ణంగా రాష్ట్రంలో రూ. ల‌క్ష కోట్లు న‌ష్టం జ‌రిగింద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం త‌మ‌కు అండ‌గా ఉండి ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఫుడ్ స‌బ్సిడీ, సోష‌ల్ స్కీమ్స్, సెంట్ర‌ల్ స్కీమ్స్ వంటి వాటికి రూ.53 వేల కోట్లు వ‌స్తాయ‌ని, ఈ క‌ష్ట స‌మ‌యంలో వీలైనంత ఎక్కువ నిధులు విడుద‌ల చేసి స‌హాయ కార్య‌క్ర‌మాల‌కు సాయం చేయాల‌ని మోడీని కోరిన‌ట్లు చెప్పారు. ఆయ‌న ప్ర‌స్తుతం రూ.వెయ్యి కోట్ల అత్య‌వ‌స‌ర సాయం ప్ర‌క‌టించార‌ని, అయితే ఇది అడ్వాన్స్ గా ఇస్తున్న నిధులా లేక ప్యాకేజీనా అనేది క్లారిటీ ఇవ్వ‌లేద‌ని అన్నారు మ‌మ‌త‌. దీనిని అడ్వాన్స్ గానే ప‌రిగ‌ణించ‌వ‌చ్చ‌ని, త్వ‌ర‌లో పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డిస్తామ‌ని చెప్పార‌న్నారు. తుఫాన్ వ‌ల్ల జ‌రిగిన న‌ష్టానికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను అందిస్తామ‌ని, వీలైనంత ఎక్కువ సాయం చేయాల‌ని ప్ర‌ధానిని కోరామ‌ని చెప్పారామె.

కాగా, అంఫాన్ తుఫాన్ కార‌ణంగా 80 మంది ప్రాణాలు కోల్పోగా.. భారీగా ఆస్తి న‌ష్టం జ‌రిగింది. రాష్ట్రంలోని ఉత్త‌ర‌, ద‌క్షిణ 24 ప‌ర‌గ‌ణాస్, తూర్పు, ప‌శ్చిమ మిడ్నాపూర్, కోల్ క‌తా, హౌరా, హుగ్లీ జిల్లాల్లో అంఫాను తుఫాన్ పెను విధ్వంసం సృష్టించింది. భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌ల ఇళ్లు, ప్ర‌భుత్వ ప్ర‌భుత్వ ఆస్తులు ధ్వంస‌మ‌య్యాయి. ల‌క్ష‌లాది మంది నిరాశ్ర‌యుల‌య్యారు.