బెంగాల్ పాలిటిక్స్ లో గ్లామర్ మిమి

బెంగాల్ పాలిటిక్స్ లో గ్లామర్ మిమి

పశ్చిమ బెంగాల్లో మరో సినీనటి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బెంగాలీ నటి మిమి చక్రవర్తి జాదవ్‌ పూర్ లోక్‌ సభ నియోజకవర్గం
నుంచి తృణమూల్ కాంగ్రెస్ కేండిడేట్‌ గా బరిలో నిలిచింది. సీపీఎంకు చెందిన సీనియర్ లీడర్ బీఆర్ భట్టా చార్యను ఢీ కొంటోంది. ప్రజలకు నాలుగు మంచి పనులు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే చాలన్నది మిమి అభిప్రాయం. రాజకీయాల్లో అనుభవం కంటే
కమిట్మెంటే ముఖ్యమంది.

పశ్చిమ బెంగాల్‌‌లోని జాదవ్‌‌పూర్ లోక్‌‌సభ సెగ్మెంట్‌‌కి బెంగాలీ నటి మిమి చక్రవర్తి  గ్లామర్ అద్దారు. తాజాగా పాలిటిక్స్‌‌లో కి ఎంట్రీ ఇచ్చిన మిమికి తృణమూల్ కాంగ్రెస్ జాదవ్‌‌పూర్ టికెట్ ఇచ్చింది. ఈ సెగ్మెంట్‌‌కి వెస్ట్ బెంగాల్లో ఓ ప్రత్యేకత ఉంది. మమతా బెనర్జీ 1984లో తొలిసారి లోక్‌‌సభకు పోటీ చేసి, సీపీఎం దిగ్గజం సోమనాథ్ ఛటర్జీని ఓడించారు. ఈ గెలుపుతోనే మమత దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించారు. అప్పటి నుంచి జాదవ్‌‌పూర్ తృణమూల్ కాంగ్రెస్‌‌కి కంచుకోటలా మారింది.

తాజాగా ఇక్కడ బరిలో దిగిన మిమి చక్రవర్తికి రాజకీయ అనుభవం ఏమాత్రం లేదు. ఆమె ప్రత్యర్థులకు ఇదే పెద్ద సాకుగా దొరికింది. ‘ఏ మాత్రం రాజకీయ అనుభవం లేకుండా సిన్మాల నుంచి వచ్చిన సెలబ్రిటీ ప్రజలకు ఏం చేయగలర’ని ప్రచార సభల్లో వెటకారమాడుతుంటారు. ఈ విమర్శలను, వెటకారాన్ని మిమి పెద్దగా పట్టిం చుకోరు. ‘అనుభవం కంటే ప్రజల కోసం పనిచేయాలన్న కమిట్మెంట్ ముఖ్యం ’అంటారు మిమి. ఆ కమిట్మెంట్ తనకు ఉండటం వల్లనే లోక్‌‌సభ బరిలో నిలిచానని ఓటర్లకు వివరణ కూడా ఇస్తుంటారు. తన బ్లాక్ కలర్ కారులో నియోజకవర్గాన్ని సుడిగాలిలా చుట్టేస్తున్నారు మిమి చక్రవర్తి. టీఎంసీ కార్యకర్తలు ఏ చిన్న ఊళ్లో సభ పెట్టినా వెళ్తున్నారు. మమతా బెనర్జీ చేస్తున్న మంచి పనులకు ఫిదా అయిపోయి, తాను పాలిటిక్స్‌‌లో కి వచ్చినట్లు చెబుతున్నారు. తనకు ఓటేస్తే మమతా బెనర్జీ నాయకత్వాన్నిబలపరిచినట్లేనంటున్నారు.

2014లో జాదవ్‌‌పూర్ సెగ్మెంట్‌‌ని హార్వర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్, ప్రముఖ చరిత్రకారుడు సుగతో బోస్ గెలుచుకున్నారు. అనేక అంశాలపై లోక్‌‌సభలో ఆయన చేసిన ప్రసంగాలు అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. సిట్టింగ్ ఎంపీగా ఉన్న సుగతో బోస్‌‌కి టికెట్ ఇవ్వకపోవడాన్ని చాలామంది తప్పుబట్టారు. మమతా బెనర్జీపై తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తంచేశారు. ఈ విమర్శలన్నిం టికీ మమత స్పందిం చారు. హార్వర్డ్ యూనివర్శిటీ పాలకమండలి నుంచి పర్మిషన్ ఇవ్వని కారణంగా సుగతో బోస్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నారని మమత వివరణ ఇచ్చారు. కాగా, మమత ఆశీస్సులతో, ప్రజల అండదండలతో తాను ఎన్నికల్లో గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు మిమి.

ఎన్నికలకు గ్లామర్‌‌

2014లో మాదిరిగానే ఈసారి కూడా తృణమూల్‌‌ అధినేత్రి అయిదుగురు సినీ తారల్ని బరిలో దింపారు.వీరిలో ముగ్గురు సిట్టింగ్‌‌ ఎంపీలు కాగా, ఇద్దరు కొత్త ముఖాలు. గత ఎన్నికల్లో నెగ్గిన మూన్‌‌మూన్‌‌ సేన్‌‌, శతాబ్ది రాయ్‌ , దీపక్‌‌ అధికారి ఈసారి కూడాపోటీలో ఉన్నారు. అయితే, మూన్‌‌మూన్‌‌సేన్‌‌ సీటుని బంకూరా నుంచి అసన్‌‌సోల్‌‌కి మారారు. శతాబ్దిరాయ్‌ 2009లోనూ, 2014లోనూ కూడా బిర్‌‌భూమ్‌‌ నుంచే గెలిచి, మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీపక్‌‌ అధికారి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఘటల్‌‌ స్థానాన్ని మరలా ఆయనకే కేటాయించారు. కొత్తగా పోటీకి దిగిన సినీ నటీమణులు మిమి చక్రవర్తికి జాదవ్‌‌పూర్‌‌, నుస్రత్‌‌ జహాన్‌‌కి బషీర్‌‌హట్‌‌ సీట్లను కేటాయించారు. మమత వ్యూహం గనుక ఫలిస్తే, లోక్‌‌సభలో మాజీ హీరోయిన్లు మూన్‌‌మూన్‌‌సేన్‌‌, శతాబ్ది రాయ్‌ , మిమి చక్రవర్తి,  నుస్రత్‌‌ జహాన్‌‌లతోపాటు నటుడు దీపక్‌‌ అధికారి కూడా కనిపిస్తారు. ఇక, 2014లో గెలిచిన నటుల్లో తపస్‌‌ పాల్‌‌ ఒక చిట్‌‌ఫండ్‌‌ స్కాంలో ఇరుక్కుని టిక్కెట్‌‌ కోల్పోయారు. సంధ్యా రాయ్‌ అనే నటి అనారోగ్య కారణాలతో పోటీ నుంచి తప్పుకున్నారు.

ఎవరీ మిమి?

మిమి చక్రవర్తి సొంతూరు పశ్చిమ బెంగాల్లోని జల్ పాయ్ గురి. హైస్కూల్ వరకు అక్కడే చదువుకున్నారు. 2006 లో కోల్ కతా వచ్చి అశుతోష్ కాలేజీలో డిగ్రీ చదివారు. ఆమె కొంతకాలం మోడల్ గా పనిచేశారు. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో కూడా మిమి పాల్గొన్నారు. టీవీ సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మిమి నటించిన తొలి సిన్మా బపీ బారి ఝా 2012లో రిలీజ్ అయింది.

మే 19న జాదవ్ పూర్ పోలింగ్

అత్యంత ప్రతిష్టాత్మకమైన జాదవ్ పూర్ లోక్ సభ సీటుకి మే 19న పోలింగ్‌ జరుగుతుంది. జాదవ్ పూర్ లో ప్రస్తుతం ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. పోటీ ప్రధానంగా టీఎంసీ, సీపీఎం మధ్యనే ఉంది. టీఎంసీ కేండిడేట్ గా మిమి చక్రవర్తి, బీజేపీ తరఫున అనుపమ్ హజ్రా, సీపీఎం టికెట్ పై బీఆర్ భట్టాచార్య పోటీలో ఉన్నారు.వీరిలో అనుపమ్ హాజ్రా పోయిన ఎన్నికల్లో బోల్ పూర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఈసారి హజ్రాపై టీఎంసీ బహిష్కరణ వేటువేసింది. దీంతో ఆమె బీజేపీలో చేరి జాదవ్ పూర్ టికెట్ తెచ్చుకున్నారు. సీపీఎం తరఫున పోటీ చేస్తు న్న భట్టాచార్య వృత్తిరీత్ యా లాయర్. 2005నుంచి 2010 వరకు కోల్ కతా మేయర్ గా పనిచేశారు. జాదవ్ పూర్ లో మొత్తం 13 లక్షలమందికి పైగా ఓటర్లు ఉన్నారు.

గ్లోవ్స్ తో షేక్ హ్యాండ్

ఎన్నికల ప్రచారం సందర్భంగా చేతులకు గ్లోవ్స్ ధరించి మిమి అభిమానులకు షేక్ హ్యాం డ్ ఇవ్వడం పెద్ద ఇష్యూగా మారిం ది. ఇది ఓటర్లను అవమానించడమేనంటూ బీజేపీ మండిపడిం ది.‘ఈ సంఘటన చాలా విచారకరం. ఇలాంటివారికి లోక్‌సభకి వెళ్లే అర్హత లేదు’ అన్నారు బీజేపీ నేత సురేంద్ర పూనియా. అయితే చేతులకు గ్లోవ్స్ ధరించడం పై మిమి టీం వివరణ ఇచ్చింది. కొన్నిరోజులుగా ప్రచారంలో విపరీతంగా పాల్గొనడంతో ఆమె చేతులు బొబ్బలెక్కాయన్నారు. అందుకే గ్లోవ్స్ వేసుకోవలసి వచ్చిందని ఆమె సన్నిహితులు వివరణ ఇచ్చారు.