వీధి కుక్కల దోస్తులు వీళ్లు

వీధి కుక్కల దోస్తులు వీళ్లు

కుక్కల్ని ఇష్టంగా పెంచుకునేవాళ్లూ, వాటిని వాళ్ల ఫ్యామిలీలో ఒక మెంబర్‌‌‌‌లా చూసుకునేవాళ్లూ ఉంటారు. అదే వీధి కుక్కల విషయానికి వచ్చేసరికి మాత్రం అలా ఉండరు. వాటిని దూరం పెడతారు. ‘‘స్ట్రీట్‌‌ డాగ్స్‌‌ కూడా భూమిపైన ఉండే జీవులే. బతికే హక్కు వాటికీ ఉంది’’ అని చెప్తూ ‘సర్వోహం యానిమల్‌‌ ఫౌండేషన్‌‌’ను పెట్టి వాటిని పెంచుకుంటున్నాడు హారిస్‌‌ అలీ.
బెంగళూరుకు చెందిన హారిస్‌‌కు ఒక వాట్సాప్‌‌ గ్రూప్‌‌లో మధుస్మిత సాహుతో పరిచయం ఏర్పడింది. మధుస్మిత కూడా గాయపడ్డ మూగజంతువులను యానిమల్‌‌ షెల్టర్‌‌‌‌ హోమ్‌‌కు తీసుకెళ్తుండేది. హారిస్‌‌ చేస్తున్న పని నచ్చి ‘నీతో కలిసి పని చేస్తా’ అని చెప్పింది. వీళ్లిద్దరి మోటో మూగజంతువులకు సాయం చేయడమే. అందుకే ఏప్రిల్‌‌ 2017లో సర్వోహం యానిమల్‌‌ ఫౌండేషన్‌‌ మొదలుపెట్టి ఇప్పటికి 2000లకు పైగా వీధి కుక్కలకు ఫ్రీగా ట్రీట్మెంట్‌‌ చేయించారు. 180కి పైగా వీధి కుక్కలను పెంచుకుంటున్నారు. మొదట చిన్న షెడ్డు, 20 కుక్కలు, ఒక కేర్‌‌‌‌టేకర్‌‌‌‌తో ప్రారంభమైన వీళ్ల జర్నీ, సిఎస్‌‌ఆర్‌‌‌‌ (కార్పొరేట్‌‌ సోషల్‌‌ రెస్పాన్సిబిలిటీ) కింద ఏరోస్పేస్‌‌ ఇండియా వాళ్లు చేసిన సాయంతో ఆర్గనైజేషన్‌‌ పెంచడానికి ఉపయోగపడింది. వాళ్లు ఇచ్చిన భూమిని డాగ్‌‌ షెల్టర్‌‌‌‌గా మార్చేశారు. 
మూగ జీవాలకు షెల్టర్‌‌‌‌ ఇస్తున్న హారిస్‌‌ సైబర్‌‌‌‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌‌. ‘ఓర్కాజా సైబర్‌‌‌‌ సెక్యూరిటీ’ స్టార్ట్‌‌ చేసి కార్పొరేట్‌‌ ఆఫీస్‌‌లకు, క్లయింట్​లకు సైబర్‌‌‌‌ సెక్యూరిటీ ఇస్తున్నాడు. దాని ద్వారా సంపాదించిన డబ్బుతోనే రోగాల బారిన పడిన, నడవలేని, గాయాలపాలైన వీధి కుక్కలకి ట్రీట్మెంట్‌‌ చేయిస్తున్నాడు. వాటికోసం ఇప్పటివరకు తన సొంత డబ్బులను దాదాపు ఒక కోటి రూపాయల వరకు ఖర్చు చేశాడు.  ఒక అంబులెన్స్‌‌ కూడా కొన్నాడు.  ఆ ఊళ్లో  వీధి కుక్కలకు బాగోలేకపోతే వీళ్లనే సంప్రదిస్తారు జనాలు. స్పెషల్‌‌గా అందుకోసం ఒక కాంటాక్ట్‌‌ నెంబర్‌‌‌‌ కూడా ఉంది.  
సర్వోహం ఎందుకు? 
అప్పుడు హారిస్‌‌కు తొమ్మిదేండ్లు. రోడ్డు పక్కన దెబ్బలు తగిలి పడి ఉన్న ఒక తల్లి కుక్క, దాని రెండు పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చారు హారిస్‌‌ అమ్మానాన్న.  వాటి గాయాలకు  ట్రీట్మెంట్‌‌ ఇచ్చి,  మందు వేసి వాటిని పెంచుకున్నారు. అప్పటి నుంచే కుక్కలతో మంచి బాండింగ్ ఏర్పడింది హారిస్‌‌కు. ఒకరోజు కొందరు పిల్లలు తన కుక్కను బాగా కొట్టి గాయపరిచారు. అది బాధతో అరుస్తున్నా వదలకుండా తరుముతుంటే హారిస్‌‌ వెళ్లి వాళ్లను వెళ్లగొట్టాడు. తరువాత ఆ కుక్కను ఎన్ని డాగ్‌‌ కేర్‌‌‌‌ సెంటర్లకు తీసుకెళ్లినా ‘వీధి కుక్క కదా మేం ట్రీట్మెంట్‌‌ చేయం’ అని ఎవ్వరూ ముట్టుకోలేదట. ఆఖరికి హారిస్‌‌ ఫస్ట్‌‌ఎయిడ్‌‌ చేసి కట్టుకట్టినా ఆ కుక్క బతకలేదు. దాంతో ఎంతో బాధపడ్డ హారిస్‌‌, ఆ క్షణమే ‘వీధి కుక్కల్ని హీనంగా చూస్తున్నారు. ముట్టుకోవడానికి కూడా వెనకడుగు వేస్తున్నారు. వీటికోసం నేనే ఏదైనా చేయాలి’ అనిపించింది. అందుకే ‘సర్వోహం’ స్టార్ట్‌‌ చేశాడు. ఇదేకాకుండా డాగ్ అడాప్షన్‌‌ క్యాంప్‌‌లు, వ్యాక్సినేషన్‌‌ క్యాంప్‌‌లు కూడా పెడుతుంటాడు. కరోనా టైంలో కూడా ఈ ఫామ్‌‌ నడిపాడు. అప్పుడు దాదాపు 600 వీధి కుక్కలకు తిండి పెట్టాడు హారిస్‌‌.

విజిటర్స్‌‌ కోసం
“సర్వోహం విజిట్‌‌ చేయాలంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వెళ్లొచ్చు. రోజూ చాలామంది డాగ్‌‌ లవర్స్ విజిటింగ్‌‌కు వస్తుంటారు. వారాంతాల్లో అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారు. వీటిని చూసేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరు వాటికోసం ఏదో ఒకటి తీసుకొస్తారు.  ఫౌండేషన్‌‌ కోసం డొనేషన్స్‌‌ కూడా ఇస్తుంటారు కొందరు’’ అని చెప్పాడు హారిస్‌‌.