బెంగళూరులో ట్రాఫిక్ వల్ల ఏర్పడే ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్ లో ఇరుక్కుని గంటలు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితులు అక్కడి జనానికి కొత్త సమస్యేం కాదు. ఇక దీని వల్ల మానసికంగా, ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎంత చెప్పినా తక్కువే. ట్రాఫిక్ జామ్ కారణంగా మనుషులే కాదు.. ఐటీ సంస్థలు సైతం కోట్లలో నష్టాలను చవిచూస్తుండగా.. ఒక్క బెంగళూరులోనే ఏటా ఏకంగా రూ.19 వేల 725 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్టు తాజాగా వెల్లడైంది.
ఈ విషయంపై కర్ణాటక ప్రభుత్వ సలహాదారు శ్రీహరి.. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఓ నివేదిక అందించారు. ట్రాఫిక్ జామ్‌లను అదిగమించేందుకు పాటించాల్సిన విధానాలు సైతం ఇందులో వివరించారు. అంతకు క్రితం.. ఆగస్టు 3వ తేదీన శ్రీహరి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ట్రాఫిక్ జామ్‌ల కారణంగా బెంగళూరులో నెలకొంటున్న ఇబ్బందుల్ని ఆయనకు తెలిపారు. ట్రాఫిక్ కారణంగా ఏటా బెంగళూరులోని ఐటీ హబ్ రూ.19వేల 725 కోట్లు నష్టపోతోందని తెలిపారు.
నగరంలో దాదాపు 60 ఫ్లై ఓవర్లు ఉన్నప్పటికీ ట్రాఫిక్ విషయంలో మాత్రం అంతరాయాలు ఏర్పడుతూనే ఉన్నాయని శ్రీహరి తెలిపారు. బెంగళూరులో 14.5 మిలియన్ల జనం నివసిస్తున్నారని, 1.5 కోట్ల వాహనాలు ఉన్నాయని వెల్లడించారు. శ్రీహరి వివరణ విన్న కేంద్ర మంత్రి.. బెంగళూరులో ఏర్పడ్డ ట్రాఫిక్ పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావటానికి ఏం చేయాలన్న దానిపై ఓ పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కోరారు.
