మరిచిపోలేని ఊరు మలానా

మరిచిపోలేని ఊరు మలానా

అది హిమాచల్ ప్రదేశ్​లోని మలానా విలేజ్​. మనదేశంలోనే అతి పురాతనమైన ఊరు. సరిగ్గా మూడు వేల మంది జనాభా కూడా లేని ఆ ఊళ్లో మాట్లాడే భాష ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ భాష ఆ ఊరి వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది. అలెగ్జాండర్ సైనికుల వారసులమని చెప్పుకునేవాళ్లు... సొంత రాజ్యాంగాన్ని రాసుకున్నారు. దానికి తగ్గట్టే జీవించేవాళ్లు. బయటి వాళ్లని ఊళ్లోకి రానివ్వరు. వచ్చినా వాళ్లను ముట్టుకునేవారు కాదు. ఇళ్లలోకి రానిచ్చేవారు కాదు. ఇలాంటి కట్టుబాట్లు చాలానే ఉంటాయి ఆ ఊళ్లో. చూడ్డానికి మాత్రం కొండల మధ్య, పచ్చని చెట్లతో ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. ఏండ్లు గడిచాయి.. కాలం మారింది... వాళ్ల ఆలోచనలు మారాయి. వాళ్ల జీవితాలు కూడా మార్పును స్వాగతిస్తున్నాయి. 

మలానాలో మాట్లాడే భాష కనషీ. ఇందులో సంస్కృత పదాలు ఎక్కువ. అతి ప్రాచీనమైన ఈ భాష వాళ్లకే అర్థమవుతుంది. ఇక్కడి ఇళ్లు రెండు లేదా మూడు అంతస్తుల్లో కట్టుకుంటారు. ఒక్కో ఫ్లోర్​కి ఒక్కో పేరుంటుంది. గ్రౌండ్ ఫ్లోర్​లో పశువుల పాక, దాణా, కట్టెలు ఉంటాయి. అందుకని దాన్ని ఖుడంగ్ అంటారు. రెండో ఫ్లోర్​ని గయింగ్ అంటారు. అందులో ఫుడ్ ఐటమ్స్, బట్టలు ఉంటాయి. టాప్ ఫ్లోర్​లో బాల్కనీ ఉంటుంది. ఆ ప్లేస్​ని పటి అంటారు. ఇదే వాళ్ల లివింగ్ ఏరియా. ఇల్లు బయటి వైపు చెక్కతో, లోపలివైపు మట్టితో కడతారు. 

ఫిబ్రవరిలో ఫగ్లీ అనే పండుగ చేసుకుంటారు. అందులో భాగంగా ఇళ్లకు ఆవు పేడ అలుకుతారు. కొంతమంది గంజాయి ఆకుల్ని ధరిస్తారు. హర్​లాల్​ మాస్క్​ పెట్టుకుని డాన్స్​ చేస్తారు. అంతేకాకుండా అక్బర్​ చక్రవర్తి బొమ్మను ఊరేగిస్తారు. ఆగస్ట్ 15న షాన్​ అనే మరో పండుగ చేసుకుంటారు. ఆ రోజున నాటి అనే ట్రెడిషనల్ లోకల్ డాన్స్ చేస్తారు. ఊలుతో తయారుచేసిన ‘పట్టు’ అనే బట్టలు వేసుకుంటారు. జమదగ్ని రిషి అనే దైవానికి పూజ చేస్తారు. 

ఒకప్పుడు...
మలానాకి గవర్నమెంట్​తో సంబంధం ఉండదు. గవర్నమెంట్ ఇచ్చే పథకాలు అవసరం లేదు. వాళ్లకు నచ్చినట్లే బతుకుతారు. ఆఫీసర్స్​ వచ్చి ఏదైనా చెప్పినా అక్కడి వాళ్లు వినరు. ఈ ఊళ్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది. పిల్లలు చదువుకుంటున్నారు కూడా. అయితే అది తప్ప ఏ విషయంలోనైనా గవర్నమెంట్ జోక్యం చేసుకుంటే వాళ్లకు నచ్చదు. అంతేకాకుండా బయటి వ్యక్తులు చేసే వంటలు తినరు. వేరే ఊరి వాళ్లని పెండ్లి చేసుకోరు. పిల్లలు ఆదివారం పుడితే ‘అహ్త’, సోమవారం పుడితే ‘సౌనరు’, మంగళవారం పుట్టిన వాళ్లకి ‘మంగల్’ అని...  పేర్లు పెడతారు. దాంతో ఈ ఊళ్లో ఒకే పేరున్న వాళ్లు చాలామంది ఉంటారు. అందుకని మలానాని ‘ద రిపబ్లిక్ ఆఫ్ మలానా’ అని కూడా అంటారు. అక్కడ అందరూ సమానమే. ఎవరు ఏ పనిచేసినా అంతా కలిసిమెలిసి ఉంటారు. కానీ, బయటి వ్యక్తులతో మాత్రం కలవరు.

పార్వతి లోయలో.. 
పార్వతి లోయలో చాలా విలువైన మెడిసినల్ ప్లాంట్స్​ ఉన్నాయి అంటుంటారు. ఒకసారి అక్బర్ చక్రవర్తికి ఆరోగ్యం బాగోలేకపోతే ఎవరో మలానా మెడిసిన్స్​ గురించి చెప్పారట. దాంతో ఆయన ఈ గ్రామాన్ని వెతుక్కుంటూ వచ్చి, ఇక్కడి మందులు వాడితే కొద్ది రోజులకే ఆయన కోలుకున్నారట. అయితే అది నిజమో, కాదో అనేది ఆ ఊరి వాళ్లకే తెలియాలి. అడపాదడపా టూరిస్ట్​లను ఊళ్లోకి రానిచ్చినా చెట్లను ముట్టుకోనివ్వరు. అంతేకాదు, అక్కడి అధికారులు మాత్రమే ఎర్ర పైకప్పు ఉన్న ఇళ్లలోకి వెళ్లడానికి పర్మిషన్ ఉంటుంది. ఎందుకంటే అందులో ఆయుర్వేద మందులు దాచిపెడతారు. 

జమ్లూ మాటే శాసనం
ఆ ఊళ్లో ఏదైనా ప్రాబ్లమ్​ వస్తే న్యాయం కోసం వస్తే ‘హర్చార్’ అనే ప్లేస్​లో పంచాయితీ పెడతారు. దానికి రెండువైపులా ఉన్న ఇళ్లను ధారా బెహర్, సారా బెహర్ అంటారు. దాని పక్కనే ఒక చిన్న తోట కూడా ఉంటుంది. కాకపోతే బయటి వ్యక్తుల్ని లోపలికి వెళ్లనివ్వరు. ఇది జమ్లూ టెంపుల్​కి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ ఎలక్షన్స్ కూడా పురాతన కాలంలోకి మల్లే ఉంటాయి. ఒక కౌన్సిల్ ఉంటుంది. అందులో పదకొండు మంది మెంబర్స్ ఉంటారు. వాళ్లలో కొందరు వంశపారంపర్యంగా వస్తారు. మిగిలినవాళ్లు ఇంటికి పెద్దవాళ్లు. ఊళ్లో ప్రాబ్లమ్​ ఉంటే ఈ పదకొండు మంది కౌన్సిల్ మీటింగ్ పెట్టి తీర్పిస్తారు. మెజారిటీ ప్రజలు ఏది చెప్తే అదే ఫైనల్. అదే జమ్లూ మాటగా తీర్పు చెప్తారు. జమ్లూ అంటే మలానా ప్రజలు పూజించే దైవం పేరు. జమ్లూ ప్రకారం బయటి వ్యక్తులు ఎవరైనా వస్తే ఆ రోజు చీకటి పడకముందే వెళ్లిపోవాలి. రాత్రిపూట అక్కడ ఉండటానికి వీల్లేదు. వాళ్ల ఇళ్లలోకి, గుళ్లలోకి కూడా వెళ్లనివ్వరు. ఈ ఊళ్లో మటన్​ తింటారు. కానీ, తోలు, పౌల్ట్రీలు బ్యాన్ చేశారు. ఈ రూల్స్​ ఇక్కడ కచ్చితంగా పాటిస్తారు. 

కాలం మారింది
మలానాలో పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయి. మలానాలో గ్రామ పంచాయతీ ఉంది. ప్రజలు న్యాయం కోసం పోలీస్​ల దగ్గరకు రావడం మొదలైంది. నెమ్మదిగా వాళ్ల పద్ధతుల నుంచి బయటికి వస్తున్నారు. ప్రతి ఇంట్లో టీవీ, శాటిలైట్ డిష్​లు, సోలార్ ప్యానెల్స్​ ఉన్నాయి. మొబైల్​ ఫోన్లు వాడుతున్నారు. ప్రజలు జీన్స్, షార్ట్స్ వేసుకుని కనిపిస్తారు. రోజుకి రెండుసార్లు ఊళ్లోకి బస్​ వచ్చి వెళ్తుంది. టూరిస్ట్​ల కోసం ట్యాక్సీలున్నాయి. కొంతమందికి సొంత ట్యాక్సీలు కూడా ఉన్నాయి. అయితే కొందరు ఆడవాళ్లు ఇప్పటికీ వంటకోసం కట్టెలు మోసుకెళ్తున్నారు. ఇక్కడికి దగ్గర్లో ‘జరీ’ అనే చిన్న ఊరు ఉంది. మలానాలో ఆల్కహాల్ దొరకదు. అందుకని చాలామంది ఇక్కడికి వస్తుంటారు. టూరిస్ట్​లు కూడా ఎక్కువగా ఇక్కడే రెస్టారెంట్​లలో స్టే చేస్తారు. పోస్ట్​ ఆఫీస్​ ఉంది. అయితే పోస్ట్ మాస్టర్ రోజుకి మూడు గంటలే పనిచేస్తాడు. మిగతా టైంలో పొలం పనిచేసుకుంటాడు. మలానాలో ఉండేవాళ్లకు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. జరీలో ఉన్న మెయిన్ ఆఫీస్​కు డైలీ అకౌంట్స్​ పంపిస్తాడు. గవర్నమెంట్ చొరవతో ఇప్పుడు మలానాకు కావాల్సిన అన్ని వసతులు వచ్చాయి. బయటివాళ్లను పెండ్లిండ్లు కూడా చేసుకుంటున్నారు. ఇక్కడున్న పార్వతి లోయలో నిఖార్సైన గంజాయి పండిస్తారు. బుట్టలు అల్లడం, తాళ్లు, చెప్పులు తయారుచేయడం వంటి పనులు చేస్తుంటారు. ఇక్కడ జమ్లూ లాగానే కులు విలేజ్​ల్లో వాళ్ల దేవుళ్లున్నారు. వాళ్ల పండుగలు అందరూ కలిసి చేసుకునేవాళ్లు. కానీ, ఇంతకుముందు వరకు మలానా మాత్రం వాటిలో కలిసేది కాదు. కొన్నేండ్ల కిందట మాత్రం ఆ విషయంలో కూడా మలానా ప్రజలు కాంప్రమైజ్​ అయ్యారు.

ఎలా ఏర్పడిందంటే... 
ఒకసారి శివుడి కోసం ఒకతను కఠోర తపస్సు చేశాడట. అందుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ‘ఏం కావాలో కోరుకో’ అని అడిగాడట. ‘ప్రశాంతంగా ఉండే ఊరు కావాలి. ఆ ఊరు ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా ఉండాలి’ అని కోరుకున్నాడట. దాంతో శివుడు మలానాను సృష్టించి ఇచ్చాడని ఒక కథ ప్రచారంలో ఉంది. అయితే, అలెగ్జాండర్  సైనికులు ఇక్కడికి వచ్చినప్పుడు, కొంతమంది సైనికులు ఇక్కడే ఉండిపోయారు. వాళ్ల వారసులే ఈ ఊరిని కట్టారని కూడా చెప్తుంటారు. అయితే దాన్ని ఒప్పుకోని కొందరు, ఆ వారసులు ఇక్కడ కాదు, పాకిస్తాన్‌‌‌‌లోని కలాష్ దగ్గర స్థిరపడ్డారు అంటారు. మొత్తానికి ఈ ఊరు ఎలా ఏర్పడిందో సరిగ్గా తెలియదు. 

ఎలా వెళ్లాలి?
జరీ ఊరి నుంచి13 కి.మీ. దూరంలో ఉన్న బంటుర్ ఎయిర్​ పోర్ట్​లో దిగి, 12 కి.మీ ట్యాక్సీలో వెళ్లాలి. నడిచి వెళ్తే ఆరు గంటలు పడుతుంది. పార్వతి వ్యాలీ నుంచి ట్రెక్కింగ్ చేసి వెళ్తే పది గంటలు పడుతుంది.