లగ్జరీ కార్లంటే సేఫ్టీకి కేరాఫ్ అడ్రస్ అనుకుంటుంటాం. కానీ కోట్లు ఖర్చు పెట్టి కొన్న కారు తెచ్చిపెట్టిన తలనొప్పికి.. గుజరాత్‌లో వోల్వో కారు యజమాని చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. అహ్మదాబాద్ వీధుల్లో ఒక వోల్వో XC90 కారు టో ట్రక్కుపై ఊరేగుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే అదేదో రిపేర్ కోసం వెళ్తున్నట్టు లేదు.. సదరు కంపెనీ పరువు తీయడానికే ఆ ఓనర్ ఈ రేంజ్ ప్లాన్ చేశాడంటూ నెటిజన్లు అంటున్నారు.
అసలేం జరిగింది?
కారుపై విరిగిపోయిన ఒక అల్లాయ్ వీల్‌ను ఉంచి.. దాని వెనుక ఒక పెద్ద ఫ్లెక్సీ బోర్డును తగిలించి నగరమంతా తిప్పాడు ఆ వోల్వో కారు యజమాని. ఆ బోర్డుపై ఉన్న మ్యాటర్ చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. వోల్వో కారు అల్లాయ్ వీల్స్ నడిరోడ్డుపై రెండు ముక్కలయ్యాయి. సేఫ్టీ గురించి ఈ కంపెనీ చెప్పే డొల్ల నినాదాల వెనుక ఉన్న అసలు నిజం అని రాసి ఊరేగించాడు సదరు కారు యజమాని. వోల్వో కారు కొనే బదులు, హాయిగా ఒక ఆల్టో కారు కొనుక్కోవడం వంద రెట్లు మేలు అంటూ గుజరాతీలో రాసి ఉంది పోస్టరు మీద.
Watch | Upset over a "vertical split in the alloy wheel" of his "newly purchased Volvo car" which he claims posed a serious safety risk, a customer in Ahmedabad is staging a protest by displaying the vehicle and the damaged wheel on an open truck across the city. Banners placed… pic.twitter.com/YVj0VpIIPC
— DeshGujarat (@DeshGujarat) May 16, 2026
కారు కొనేటప్పుడు కోట్లు వసూలు చేసే కంపెనీలు.. కారు అమ్మేసిన తర్వాత ఎలాంటి బాధ్యత తీసుకోకుండా కొన్నోళ్ల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని వోల్వో కారు ఓనర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిగో.. కంపెనీ నాణ్యత ఎలా ఉందో మీరే కళ్లారా చూసుకోండి అంటూ విరిగిపోయిన భాగాన్ని అందరికీ కనిపించేలా కారుపై ఏర్పాటు చేసి ఊరంతా తిప్పాడు.
ఈ వినూత్న నిరసనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లగ్జరీ కార్ల మెయింటెనెన్స్, క్వాలిటీపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై వోల్వో గ్రూప్ ఇప్పటి వరకూ స్పందించలేదు. కస్టమర్ కేర్ విసిగిస్తే కస్టమర్లు ఏ రేంజ్ లో క్రియేటివ్‌గా రివెంజ్ తీర్చుకుంటారో చెప్పడానికి ఈ అహ్మదాబాద్ వోల్వో కారు ఓనర్ చేసిన పని బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు నెటిజన్లు.
