ఎవరు గెలుస్తారు.. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై రూ. 10 వేల కోట్ల బెట్టింగ్

ఎవరు గెలుస్తారు.. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై రూ.  10 వేల కోట్ల బెట్టింగ్
  • హైదరాబాద్​లోని స్టార్ ​హోటళ్లలో బుకీల మకాం
  • పార్టీల సింబల్స్​తో ప్రత్యేక యాప్​లు.. వాటి ద్వారా దందా
  • తెలంగాణ, ఏపీ సహా మహారాష్ట్ర,కర్నాటకలోనూ బెట్టింగ్స్​
  • ఇండ్లు, భూములనూ పందెంలో పెడ్తున్న బెట్టింగ్​ రాయుళ్లు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​తోపాటు మహారాష్ట్ర, కర్నాటకలోనూ పెద్ద ఎత్తున పందెం కాస్తున్నారు. డబ్బులే కాదు.. ఇండ్లు, భూములు కూడా బెట్టింగ్​లో పెడ్తున్నారు. ఆదివారం ఓట్లను లెక్కించనున్న నేపథ్యంలో ఏ పార్టీ మ్యాజిక్​ ఫిగర్​ను దాటుతుంది? ఏ పార్టీ ఓడిపోతుంది? ఏ అభ్యర్థికి ఎక్కువ మెజారిటీ వస్తుంది?.. అనే దానిపై పందెం రాయుళ్లు కోట్లకు కోట్లు పెడ్తున్నారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రూ.10 వేల కోట్లకు పైగా బెట్టింగులు సాగుతున్నట్లు ఓ  అంచనా. ఎగ్జిట్​పోల్స్​ ఎక్కువగా కాంగ్రెస్​ పార్టీకే లీడ్​ఇవ్వడంతో సట్టా బజార్​లోనూ ఆ పార్టీపైనే ఎక్కువ శెర్తులు నడుస్తున్నాయి. ఏపీలోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో బెట్టింగులు పీక్స్​కు చేరాయి. ఒక్క భీమవరంలోనే రూ.500 కోట్లకు పైగా కాసినట్టు తెలుస్తున్నది. సమయానికి డబ్బులు చేతుల్లో లేనివాళ్లు తమ భూములు, ఇండ్లు, ప్లాట్లు కూడా బెట్టింగ్​లో పెడ్తున్నారు. 

హైదరాబాద్​లో తిష్టవేసిన బుకీలు

ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడిన వెంటనే బెట్టింగ్ గ్యాంగ్స్‌ యాక్టివ్‌ అయ్యాయి. ముంబై, బెంగళూరు, కోల్ కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో తదితర మెట్రో సిటీల నుంచి బుకీలు హైదరాబాద్​లో ల్యాండ్​ అయ్యారు. స్టార్​హోటళ్లలో తిష్ట వేసి బెట్టింగ్ ​రాకెట్​నడిపిస్తున్నారు.  బెంగళూరు, వైజాగ్ ​కేంద్రంగానూ తెలంగాణ ఫలితాలపై బెట్టింగులు సాగుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్​యాప్​లు రెడీ చేశారు. గతంలో బ్యాన్​చేసిన యాప్​లను మళ్లీ స్టార్ట్​ చేసి.. వాట్సప్, టెలిగ్రామ్​ద్వారా పంటర్లకు ఆయా ఆన్​లైన్, మొబైల్ యాప్​ల లింక్​లు పంపుతున్నారు. వాటిని క్లిక్ చేసి బెట్టింగులు పెట్టాలని సూచిస్తున్నారు.​

క్రికెట్​ బెట్టింగ్​లోని అనుభవంతో..!

క్రికెట్ బెట్టింగ్ తరహాలోనే అభ్యర్థులకు పోల్ అయ్యే ఓట్ల దగ్గర్నుంచి గెలుపు, ఓటముల వరకు బుకీలు టార్గెట్ చేశారు. బెట్టింగ్ కోసం బీఆర్‌‌‌‌ఎస్‌‌, కాంగ్రెస్ సింబల్స్​తో ప్రత్యేక యాప్స్ క్రియేట్‌‌ చేశారు. ఇలాంటి 8 గ్యాంగ్స్‌‌ ఇప్పటికే తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పోలీసులు గుర్తించారు. ఆన్‌‌లైన్ బెట్టింగ్ లింకులను పంటర్లకు పంపిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలనే టార్గెట్ చేసి పందేలు కాయిస్తున్నారు. ఇందుకోసం అభ్యర్థులు, పార్టీల బలాబలాలను సీనియర్ పొలిటీషియన్లతో బుకీలు విశ్లేషిస్తున్నారు.

తమ దగ్గరున్న సమాచారంతో ఆయా పార్టీల నుంచి గెలుపొందే అభ్యర్థులపై బెట్టింగ్ ఆపరేట్ చేస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్‌‌ లో అనుభవం ఉన్న పంటర్లే ఈ ఎలక్షన్ల బెట్టింగ్‌‌లో కీ రోల్ పోషిస్తున్నారు. ఆన్ లైన్ వెబ్ సైట్స్‌‌, మొబైల్ యాప్స్, వాట్సప్ అడ్డాగా పార్టీల కోడ్స్‌‌ తో బెట్టింగ్ ఆపరేట్ చేస్తున్నారు. ఒక్కో పార్టీకి ఒక్కో కలర్ కోడ్‌‌, అభ్యర్థులకు వివిధ రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గుర్తులను కేటాయించారు. డిమాండ్ ను బట్టి బెట్టింగ్ ప్రైస్ నిర్ణయిస్తున్నారు.సెలెక్ట్ చేసుకున్న వాటిపై గెలుపు, మెజార్టీల ఆధారంగా పేమెంట్స్‌‌ చేస్తున్నారు.

కామారెడ్డి, గజ్వేల్​ సీట్లపై ఆసక్తి

కేసీఆర్, రేవంత్​రెడ్డి తలపడుతున్న కామారెడ్డి సీటుపై... కేసీఆర్, ఈటల రాజేందర్​ పోటీ పడుతున్న గజ్వేల్ ​సీటుపై పెద్ద ఎత్తున బెట్టింగ్​లు నడుస్తున్నాయి. ఈ సీట్లలో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఏ స్థానంలో నిలుస్తారు.. ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది.. అనే దానిపై బెట్టింగ్​ రాయుళ్లు భారీగా డబ్బులు పెడ్తున్నారు. కేటీఆర్​పోటీ చేస్తున్న సిరిసిల్లలో గెలుపు ఎవరిదనే దానిపై కూడా జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. పోస్టల్​ బ్యాలెట్లలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడుతాయనే దానిపైనా పందేలు కాస్తున్నారు. మంత్రులు, ప్రముఖ నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పోస్టల్​ బ్యాలెట్లలో లీడ్​ ఎవరికి అనే దానిపై కూడా బెట్టింగులు సాగుతున్నాయి. 

లోకల్​ గ్యాంగ్​లు కూడా..!

క్రికెట్​వరల్డ్​కప్ ఫైనల్, ఐపీఎల్ ​ఫైనల్​ కన్నా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపైనే బెట్టింగులు పెద్ద ఎత్తున సాగుతున్నట్లు తెలుస్తున్నది.  కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాసిన పందేలతో పోల్చితే మూడు రెట్లు అధికంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు పెడుతున్నట్లు సమాచారం. సట్టా బజార్​ మాత్రమే కాకుండా నియోజకవర్గాల స్థాయిలో లోకల్​గ్యాంగ్​లు కూడా బెట్టింగులు నిర్వహిస్తున్నాయి. రూ.లక్షల్లో ఆయా నియోజకవర్గాల ఫలితాలపై పందేలు కాస్తున్నట్లు తెలుస్తున్నది. ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉండటంతో క్రికెట్​లో బాల్​బై బాల్​బెట్టింగ్​ పెట్టినట్టుగా ఎన్నికల ఓట్ల లెక్కింపులో రౌండ్​బై రౌండ్​ రిజల్ట్​ పైనా పందేలు కాసేలా యాప్​లలో ప్రత్యేక ఫీచర్లు క్రియేట్​చేశారు. ఆదివారం మధ్యాహ్నానానికి బెట్టింగుల జోరు ఇంకా పెరుగుతుందని సమాచారం.