తెలంగాణ ఎన్నికలపై ఏపీలో బెట్టింగ్​

తెలంగాణ ఎన్నికలపై ఏపీలో బెట్టింగ్​
  • గెలుపు ఎవరిదోనని చర్చించుకుంటున్న జనం
  • రూ.వెయ్యి కోట్ల దాకా పందేలు
  • కేసీఆర్, రేవంత్ పోటీ చేస్తున్న సెగ్మెంట్లపైనే ఎక్కువ ఫోకస్​

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ఎన్నికలను ఏపీ జనాలు ఆసక్తిగా చూస్తున్నారు. మూడు పార్టీల మధ్య పోరులో గెలుపు ఎవరిదోనని చర్చించుకుంటున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు రూ.లక్షల నుంచి రూ.కోట్లలో పందేలు కూడా కాస్తున్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న సెగ్మెంట్లు కామారెడ్డి, గజ్వేల్, కొడంగల్‌‌పై ఎక్కువగా బెట్టింగ్స్ వేస్తున్నారు. ఈసారి ఏపీలో బెట్టింగ్స్‌‌ దాదాపు రూ.వెయ్యి కోట్ల దాకా సాగుతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్‌‌తో పాటు అమరావతి, రాయలసీమ జిల్లాల్లో పందేలు జోరందుకున్నాయని సమాచారం. 

టీడీపీ తప్పుకోవడంతో..

ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఏపీలోనూ ప్రభావం చూపే అవకాశం ఉందన్న చర్చ అక్కడి రాజకీయ వర్గాల్లో సాగుతున్నది. ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుందని నేతలు భావిస్తున్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ.. తెలంగాణలో పోటీ చేస్తామని తొలుత ప్రకటించింది. చివరి నిమిషంలో ఎన్నికల బరి నుంచి తప్పుకుంది.

ఏపీ స్కిల్ డెవలప్‌‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలుకు పోవడంతోనే పరిస్థితి రివర్స్ అయింది. టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రెండు మూడు సార్లు రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబును కలిశారు. అయితే పోటీ నుంచి తప్పుకోవాలంటూ చంద్రబాబు సూచించారు. దీంతో కాసాని టీడీపీ నుంచి బీఆర్ఎస్​లో చేరారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి టీడీపీ శ్రేణులు సపోర్ట్ చేయాలంటూ ఇంటర్నల్‌‌గా చంద్రబాబు 
సూచించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ ఉన్నది.

బీజేపీ, టీడీపీ.. మధ్యలో జనసేన

ఇన్నాళ్లూ ఏపీ రాజకీయాలపైనే దృష్టి పెట్టిన పవన్​కల్యాణ్.. కొన్ని రోజుల కిందట తెలంగాణలో యాక్టివ్ అయ్యారు. బీజేపీతో పొత్తుతో రాష్ట్రంలో అభ్యర్థులను నిలబెట్టారు. తమ పార్టీ అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓవైపు ఎన్డీయేలో ఉన్నామని చెప్తూనే.. ఏపీలో టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. కానీ తెలంగాణలో టీడీపీ మాత్రం ఈ రెండు పార్టీలకు మద్దతు ఇవ్వడం లేదు. జనసేన ఇక్కడ పోటీ చేస్తున్నా సరే.. కాంగ్రెస్‌‌కు సపోర్ట్ చేయాలంటూ టీడీపీ శ్రేణులకు చంద్రబాబు అంతర్గతంగా చెప్పారన్న ప్రచారం.

దీంతో ఇక్కడి రాజకీయాలను ఏపీ నేతలు, ప్రజలు సైలెంట్‌‌గా అబ్జర్వ్ చేస్తున్నారు. పలు వాట్సప్​ గ్రూపుల్లో దీనిపైనే చర్చ జరుగుతుండడం గమనార్హం. నిజానికి టీడీపీ శ్రేణులు కూడా అవుట్​రైట్​గా కాంగ్రెస్​కే సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నాయి. టీడీపీ ప్రభావం ఎక్కువగా ఉండే కూకట్​పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్, ఉప్పల్, మేడ్చల్, మల్కాజిగిరి, ఖమ్మంలోని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ​వైపే వాళ్లు మొగ్గుతున్నట్టు తెలుస్తున్నది. హైదరాబాద్‌‌లోని కొందరు ఏపీలోని పొత్తులకు తగ్గట్టు జనసేన, బీజేపీ వైపు వెళ్తున్నట్టు చెప్తున్నారు.

సెటిలర్ల ఓట్లు ఎటు పడ్తయో?

చంద్రబాబు అరెస్టయినప్పుడు చాలా మంది ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలిల్లో నిరసనలు తెలిపారు. ఏపీలో నిరసనలు చేసుకోవాలంటూ మంత్రి కేటీఆర్ సహా పలువురు మంత్రులు ఓపెన్​గా కామెంట్ చేశారు. తలసాని వంటి వాళ్లు మాత్రం చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడారు. అయితే కాంగ్రెస్​ ముఖ్య నేతలంతా చంద్రబాబుకు సపోర్ట్​గా నిలిచారు. ఐటీ ఉద్యోగులకు మద్దతుగా మాట్లాడారు.

నిరసనలను పోలీసులు అడ్డుకోవడాన్నీ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుపై తెలంగాణలో జరిగిన ఆందోళనలు, పరిణామాలపై ఏపీలో అధికార వైసీపీ కూడా స్పందించింది. వాళ్లంతా అసలు ఐటీ ఉద్యోగులే కారంటూ ప్రకటనలు ఇచ్చింది. ఈ క్రమంలో సెటిలర్ల ఓట్లు ఏ పార్టీవైపు మొగ్గుతాయనే ఆసక్తి ఏపీ రాజకీయ వర్గాలు, ప్రజల్లో నెలకొంది.