ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. అయితే ఈ తప్పులు చేయొద్దు

V6 Velugu Posted on Apr 07, 2021

బిజినెస్ డెస్క్, వెలుగు: కరోనా మహమ్మారి ఇప్పటికే 1.6 లక్షల మందిని బలిగొంది. దీంతో  ఇన్సూరెన్స్ పాలసీల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రాబోయే ఆర్నెళ్లలో కచ్చితంగా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటామని 51 శాతం మంది రెస్పాండెంట్లు ఒక సర్వేలో చెప్పారు.  అయితే జనంలో ఇప్పటికీ ఇన్సూరెన్స్ పై అపోహలు ఉన్నాయి. చాలా విషయాలపై అవగాహన ఉండటం లేదు. వయసు పైబడేవరకు ఇన్సూరెన్స్ అవసరం లేదని అనుకునేవాళ్లు ఉన్నారు.  పాలసీని  ఎంత మొత్తానికి తీసుకోవాలో కూడా తెలియడం లేదు. తమ ఇంటి యజమాని ఇన్సూరెన్స్ తీసుకున్న విషయం కూడా మిగతా కుటుంబీకులకే తెలియడం లేదు. బీమా తీసుకునేటప్పుడు జరుగుతున్న ఇలాంటి10 తప్పుల గురించి తెలుసుకుందాం..

చిన్న వయసులోనే తీసుకోవాలి..
ఇన్సూరెన్స్ వయసు మీరిన వారికి అవసరమని, 35 ఏళ్లు వచ్చే దాకా ఇది అవసరమే లేదని చాలా మంది పొరబడుతున్నారు. ఇది చాలా తప్పుడు ఆలోచన. కరోనా ముంచెత్తిన తరువాత ఈ విషయం అర్థమైంది. ఇన్సూరెన్స్ లేనంత కాలం ఇంటి యజమాని, ఆయన పై ఆధారపడ్డవాళ్లు చాలా రిస్కులో ఉన్నట్టేనని ‘గెట్టింగ్ యూ రిచ్’ సీఈఓ రోహిత్ షా హెచ్చరించారు. వీలైనంత త్వరగా పాలసీలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి
చిన్న వయసులోనే పాలసీలు తీసుకోవడం తెలివైన పని. అయితే ఇక్కడితోనే అంతా అయిపోదు. వయసు పెరుగుతున్నకొద్దీ అవసరాలూ పెరుగుతుంటాయి. ఆర్థిక అవసరాలకు తగినట్టు పాలసీని మార్చాలి. కొన్ని కష్టనష్టాల వల్ల కవర్ మొత్తం ఎక్కువ కావాల్సి ఉంటుంది.  పిల్లలు పుట్టిన తరువాత ఖర్చులు పెరుగుతాయి. పాత పాలసీ సరిపోకపోవచ్చు. కాబట్టి కాలానికి అనుగుణంగా పాలసీల్లో మార్పులుచేర్పులు చేయాలి.

లాంగ్ టర్మ్ పాలసీ టర్మ్తో లాభం తక్కువే..
కొంతమంది వందేళ్ల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. జీవితాంతం బీమా ధీమా ఉంటుందని అనుకుంటారు కానీ ఇలాంటి పాలసీల వల్ల లాభం తక్కువ. ఉదాహరణకు 35 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి రూ.కోటికి బీమా తీసుకున్నాడని అనుకుందాం. ఆయన 80 ఏళ్లప్పుడు మరణించాడని భావిద్దాం. ఏటా నాలుగు శాతం ద్రవ్యోల్బణంతో లెక్కిస్తే ఆయన పాలసీ విలువ రూ.17.12 లక్షలకు తగ్గుతుంది. 99 ఏళ్ల వయసులో మరణిస్తే పాలసీ విలువ రూ.8.12 లక్షలకు తగ్గుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ పాలసీలతోపాటు ఈక్విటీ ఫండ్లలోనూ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం ఉంటుంది.
షార్ట్ టర్మ్ పాలసీతోనూ తక్కువ లాభమే..
షార్ట్ టర్మ్ పాలసీలను తీసుకోవడం కూడా తెలివైన పనికాదు. కేవలం 50 ఏళ్ల వయసు వరకు పాలసీ తీసుకుంటే, ఆ గడువు ముగిశాక కుటుంబం రిస్కులో పడుతుంది. మన అప్పులు తీరే వరకు, ఫైనాన్షియల్ టార్గెట్స్ చేరుకునే వరకు ఇన్సూరెన్స్ ఉండాలి. 50 ఏళ్లప్పుడు పిల్లల పెళ్లిళ్లు, చదువుల ఖర్చులు ఉంటాయి. వీటికి తగ్గట్టు పాలసీలను, ఇన్వెస్ట్మెంట్లను ప్లాన్ చేసుకోవాలి.

లిమిటెడ్ పే మోడ్ మంచిదే..
చాలా మంది ఏటా ఒకసారి ప్రీమియం చెల్లిస్తారు. ఇందుకు బదులు ‘లిమిటెడ్ పే’ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ విధానంలో కొన్నేళ్లు ప్రీమియం కడితే, జీవితాంతం కవరేజ్ ఉంటుంది.  వీలైతే సింగిల్ పేమెంట్ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. అయితే లిమిటెడ్ పే ఆప్షన్ అందరికీ నప్పకపోవచ్చని, ప్రీమియం మొత్తం పెరుగుతుందని ఎక్స్పర్టులు అంటున్నారు. అందరికీ ఒకే విధానం అనువుగా ఉండకపోవచ్చని. ఎక్కువ మొత్తం చెల్లించేంత డబ్బు ఉంటే మాత్రమే లిమిటెడ్ పే ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా రిటైర్మెంట్ దగ్గర పడినవాళ్లకు ఈ విధానం బాగుంటుందని అంటున్నారు.

టర్మ్ ప్లాన్లకు డిమాండ్
ఇది వరకు టెర్మ్ ఇన్సూరెన్స్ను  పట్టించుకునేవాళ్లు కాదు. నిజానికి వీటిని తప్పకకొనాలి. అయితే ఇప్పుడు టర్మ్ పాలసీలకు గిరాకీ విపరీతంగా పెరుగుతోంది. అయినప్పటికీ సాధారణ పాలసీలకూ ఆదరణ తగ్గడం లేదు. అయితే ఈరకం పాలసీలు తీసుకున్న వారిలో మూడోవంతు పాలసీహోల్డర్లకు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలియదని తాజా సర్వేలో తేలింది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే కుటుంబానికి పరిహారం చెల్లిస్తారు. లేకపోతే మెచ్చూరిటీ బెనిఫిట్స్ ఉండవు.  టర్మ్ ఇన్సూరెన్స్తోపాటు మంచి రాబడులూ ఇచ్చేవాటిలోనూ ఇన్వెస్ట్ చేయాలి.

పూర్తి వివరాలు ఇవ్వాలి

పాలసీ కొనేటప్పుడు అన్ని వివరాలనూ తప్పకుండా బయటపెట్టాలి. కొంతమంది  అనారోగ్యం గురించి దాచిపెడతారు. స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అలవాట్ల గురించి చెప్పరు. అంతేకాదు నకిలీ డాక్యుమెంట్లు ఇవ్వడం కూడా మంచిది కాదు. ఇట్లా చేసిన వాళ్లు మరణిస్తే ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిములను తిరస్కరిస్తాయి.

పేఔట్‌ను జాగ్రత్తగా ఉంచుకోవాలి
పాలసీహోల్డర్ మరణిస్తే కంపెనీలు మెచ్చూరిటీ మొత్తాన్ని రకరకాలుగా చెల్లిస్తాయి. పాలసీ మొత్తాన్ని ఒకేసారి తీసుకోవచ్చు. నెల, మూడు నెలలు, ఆర్నెళ్లకు ఒకసారి తీసుకునే సదుపాయమూ ఉంది. ఆర్థిక అవసరాలు మరీ ఎక్కువగా ఉంటే పూర్తిమొత్తం తీసుకోవాలి. లేకపోతే ఒకేసారి భారీ మొత్తం తీసుకోవడం మంచిదికాదు. డబ్బును ఎలా వాడాలో అందరికీ అవగాహన ఉండకపోవచ్చు. చాలా మందికి రెగ్యులర్ పేఅవుటే మంచిదని ఫైనాన్షియల్ ఎక్స్పర్టులు చెబుతారు. ఇన్వెస్ట్మెంట్లపై అవగాహన ఉంటే పూర్తిమొత్తాన్ని తీసుకొని లాభపడొచ్చు.
ప్రీమియం రిటర్నుల కోసం ఆశపడొద్దు..
ప్రీమియం రిటర్న్ పాలసీల వల్ల పెద్దగా లాభం ఉండదు. పాలసీకాలంలో పాలసీహోల్డర్ మరణించకున్నా, ఈ పాలసీలతో కొంత ప్రీమియం వెనక్కి వస్తుంది. ఇందుకు భారీగా ప్రీమియం చెల్లించాలి. రూ.కోటి ఇన్సూరెన్స్ కోసం ఏటా రూ.28,448 కట్టాలి. మామూలు టెర్మ్ ఇన్సూరెన్స్ అయితే రూ.13,448 చాలు. ఏటా రూ.28 వేలు కట్టిన వ్యక్తి పాలసీ ముగిశాక కేవలం రూ.7.43 లక్షలు చేతికి అందుతాయి. ఇదే మొత్తాన్ని ఇతర ఫండ్స్లో పెడితే, ఏటా 8 శాతం వడ్డీ లెక్కించినా 60 ఏళ్ల వరకు రూ.13.15 లక్షలు అవుతాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కోసం సాధారణ టర్మ్ పాలసీ తీసుకోవాలి. మిగతా మొత్తాన్ని హైబ్రిడ్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టాలి.
కుటుంబానికి తెలియజేయక పోవడం..
చాలా మంది తాము పాలసీ కొన్నట్టు కుటుంబ సభ్యులకే చెప్పరు. ఇది చాలా పెద్ద తప్పు. పాలసీహోల్డర్ మరణించాక కూడా పాలసీ గురించి తెలియకుంటే వారికి తీవ్రనష్టం జరుగుతుంది. పరిహారం అందదు. బీమా తీసుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులందరికీ తప్పక తెలియజేయాలి. అందరికీ అందుబాటులో ఉండే చోట పాలసీ డాక్యుమెంట్లను ఉంచాలి.

Tagged business, Insurance, tips, Experts, Mistakes

Latest Videos

Subscribe Now

More News