భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతి

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతి
  • గుండెపోటుతో ఆకస్మిక మరణం
  • సంతాపం తెలిపిన దత్తాత్రేయ, కిషన్​ రెడ్డి, సంజయ్​, లక్ష్మణ్​

భద్రాచలం, వెలుగు : బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి(52)  సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఇంట్లో ఉండగా బీపీ లెవెల్స్ పెరిగి అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబసభ్యులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో కన్నుమూశారు. ఆంధ్రా విలీన వీఆర్ పురం మండలంలో పుట్టిన సత్యవతి తొలుత సీపీఎంలో పనిచేశారు. 1988-–94 వరకు ఐద్వా భద్రాచలం డివిజన్​ సెక్రటరీగా, ఖమ్మం జిల్లా జాయింట్​ సెక్రటరీగా, 1994-–2000 వరకు రాష్ట్ర జాయింట్​ సెక్రటరీగా, 2000-–2005 వరకు సీపీఎం నుంచి భద్రాచలం

ఎంపీపీగా, 2006-–08 వరకు ఐద్వా సెంట్రల్​కమిటీ మెంబర్​గా పనిచేశారు. 2009లో సీపీఎంకు రాజీనామా చేసి ఆమె అప్పటి ఏపీ సీఎం డా. వైఎస్​రాజశేఖర్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. 2009 ఎన్నికల్లో భద్రాచలం ఎమ్మెల్యేగా 7 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. 2017లో బీజేపీలో చేరి స్టేట్​కమిటీ మెంబర్​గా ఎన్నికయ్యారు. 2018లో బీజేపీ నుంచి భద్రాచలం నియోజకవర్గంలో పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు. 2020 నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈమె భర్త కుంజా ధర్మారావు కూడా సీపీఎం డివిజన్​సెక్రటరీగా పనిచేసి, తర్వాత దుమ్ముగూడెం జడ్పీటీసీగా పనిచేశారు. 

సత్యవతి మరణం పార్టీకి తీరని లోటు : కిషన్​ రెడ్డి

బీజేపీ నాయకురాలు కుంజా సత్యవతి మరణం పార్టీకి తీరని లోటు అని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​చీఫ్ ​కిషన్​ రెడ్డి పేర్కొన్నారు. ఆమె మరణ వార్త తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు. నిత్యం గిరిజనుల కోసం పరితపించే ఆమెతో కలిసి 2009-–14 వరకు అసెంబ్లీలో పనిచేశానని గుర్తు చేసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు చెప్పారు.  హర్యానా గవర్నర్​ బండారు దత్తాత్రేయ సంతాపం ప్రకటించారు.

ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్, బీజేపీ నేషనల్ వైస్  ప్రెసిడెంట్ డీకే అరుణ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్త విన్న ఆదివాసీ, గిరిజన సంఘాల నేతలు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భద్రాచలంకు చేరుకున్నారు. సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరిపారు.